నేడు వైఎస్సార్‌ సీపీ చలో దేవరపల్లి | - | Sakshi
Sakshi News home page

నేడు వైఎస్సార్‌ సీపీ చలో దేవరపల్లి

May 6 2026 8:01 AM | Updated on May 6 2026 8:01 AM

రాజానగరం: పొగాకు రైతుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా వైఎస్సార్‌ సీపీ చలో దేవరపల్లికి పిలుపునిచ్చింది. ఈ మేరకు దేవరపల్లి పొగాకు వేలం కేంద్రం వద్ద బుధవారం ఉదయం 10 గంటలకు చేపడుతున్న ధర్నాకు నియోజకవర్గం నుంచి రైతులతో పాటు పార్టీ శ్రేణులు భారీగా తరలిరావాలని ఆ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మంగళవారం పిలుపునిచ్చారు. ఉదయం 9 గంటలకు రాజమహేంద్రవరం ప్రకాష్‌ నగర్‌లోని పార్టీ కార్యాలయం నుంచి దేవరపల్లికి ర్యాలీ ప్రారంభమవుతుందన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, మాజీ హోం మంత్రి తానేటి వనితతో పాటు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలు, ముఖ్య నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. పొగాకు రైతుల పట్ల ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం తగదని రాజా అన్నారు. పొగాకు కొనుగోళ్లు మార్చి 25న ప్రారంభించినప్పటికీ రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలంలోని నల్లరేగడి నేలల్లో పండించిన పొగాకు కొనుగోలు ఇంతవరకూ ప్రారంభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పొగాకు రైతుల పట్ల చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరికి ఇది నిదర్శనమని విమర్శించారు. వర్జీనియా పొగాకుకు కనీస మద్దతు ధర ఇవ్వాలని, పొగాకు కొనుగోళ్లను వేగవంతం చేయాలనే ప్రధాన డిమాండ్లతో ఈ ధర్నా చేపడుతున్నామని రాజా తెలిపారు.

ఫ పొగాకు వేలం కేంద్రం వద్ద ధర్నా

ఫ రైతులు, పార్టీ శ్రేణులు తరలి రావాలి

ఫ జక్కంపూడి రాజా పిలుపు

Advertisement
 
Advertisement
Advertisement