ఫ పర్యాటకులను ఆకర్షిస్తున్న దిండి అందాలు
ఫ ఆకట్టుకుంటున్న గోదావరి సోయగాలు
ఫ మదిని దోచుకుంటున్న పచ్చటి తివాచీ
ఫ అలలపై దూసుకుపోయే బోట్లు
మలికిపురం: దిండి కేంద్రంగా గోదావరి అందాలు పర్యాటకులను ఎంతో ఆకట్టుకుంటున్నాయి. రండి.. రండి.. దయ చేయండంటూ స్వాగతం పలుకుతున్నాయి. జిల్లాలోని వశిష్ట నదీ తీరంలో 2004లో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఏర్పాటు చేసిన ఈ ప్రముఖ పర్యాటక కేంద్రం దిండి కేంద్రంగా నేడు ఎంతో ప్రసిద్ధికెక్కింది. సాధారణంగా వేసవి సెలవులు వచ్చాయంటే చక్కని పర్యాటక ప్రాంతాలకు విహరించాలని ప్రకృతి ప్రేమికులు కోరుకుంటారు. మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనంతో పాటు ప్రకృతి అందాలను చూడాటానికి ఈ సమయంలోనే అవకాశం దొరుకుతుంది. అలాంటి వారికి దిండి పర్యాటక కేంద్రం ఘనంగా స్వాగతం పలుకుతోంది. ఇక్కడ టూరిజం శాఖ ఆధ్వర్యంలో పర్యాటకులకు అన్ని సౌకర్యాలూ కల్పించారు.
టూరిస్టుల రాక : రాష్ట్రంతో పాటు దేశ నలుమూలల నుంచీ అనేక మంది టూరిస్టులు దిండికి వస్తున్నారు. ఆన్‌లైన్ విధానం అందుబాటులోకి రావడంతో పాలకొల్లు, నర్సాపురం, రాజమహేంద్రవరం, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు రైల్వే స్టేషన్ల ద్వారా, రాజమహేంద్రవరం, గన్నవరం విమానాశ్రయాల నుంచి ఇక్కడకు చేరుకుంటున్నారు. దిండి, చుట్టు పక్కల విహార కేంద్రాల్లో హోటళ్లు బుక్ చేసుకుని విహరిస్తున్నారు. ఇక్కడ కేరళకు దీటుగా ఉన్న గోదావరి పాయలు, పంట కాలువలు, రోడ్ల వెంబడి గల తోటలతో పాటు టెంపుల్ టూరిజంపై ఆసక్తి చూపుతున్నారు. అంతర్వేది సాగర సంగమం, లొల్ల లాకులు, కోరంగి అడవులలో పచ్చటి అందాల నుంచి ఆహ్లాదం పొందుతున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటున్నారు.
దిండికి దారి : కోనసీమ – పశ్చిమ గోదావరి జిల్లాల మధ్య మ లికిపురం మండలంలో వశిష్ట గోదావరి తీరంలో దిండి పర్యాటక కేంద్రం ఉంది. హైదరాబాద్ నుంచి వచ్చే పర్యాటకులు పాలకొల్లు రైల్వేస్టేషన్‌లో దిగి ఆటోలు, ప్రైవేటు వాహనాల్లో అక్కడకు చేరుకోవచ్చు. పాలకొల్లు ఆర్టీసీ డిపో నుంచి రాజోలు వచ్చే బస్సు ఎక్కి దిండిలో దిగవచ్చు. రాజమహేంద్రవరం మీదుగా రాజోలు చేరుకుని అక్కడ నుంచి పాలకొల్లు వెళ్లే బస్సు ఎక్కి దిండిలో దిగవచ్చు. ఈ కేంద్రం పాలకొల్లు నుంచి 15 కిలోమీటర్లు, రాజోలు నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. విశాఖపట్నం నుంచి పర్యాటకులు కాకినాడ, అమలాపురం చేరుకుని అక్కడి నుంచి రాజోలు మీదుగా దిండికి రావచ్చు.
రిసార్ట్స్‌లో గదుల ధరలు
ఫ ఏసీ స్టాండర్డ్ రూమ్ రూ.2,624(24 గంటలు)
ఫ ఏసీ డీలక్స్ రూమ్ రూ.3,360(24 గంటలు)
ఫ ఏసీ ప్రీమియం డీలక్స్ రూమ్ రూ.4,200
ఫ ఏసీ సూట్ రూ.5,250
ఫ ఏసీ ప్రీమియం సూట్ రూ.6,825
ఫ రాయల్ ప్రిన్స్ సూట్ రూ.10,620
హౌస్‌బోట్ల రేట్లు
ఫ 24 గంటల ప్యాకేజీ రూ.15 వేలు (ఉదయం 10 నుంచి మరుసటి రోజు ఉదయం 9 గంటల వరకు)
ఫ 12 గంటల ప్యాకేజీ రూ.12 వేలు (ఉదయం 10 నుంచి రాత్రి 9 గంటల వరకూ)
ఫ బోటులో రెండు గదులు, అటాచ్డ్ బాత్‌రూమ్‌లు, డైనింగ్ హాలు ఉంటాయి. రెండు జంటలు నలుగురు పిల్లలతో ఒకేసారి విహరించవచ్చు. ఫాంటూన్, ఆత్రేయ బోట్లలో ట్రిప్పుల వారీగా రూ.150 నుంచి రూ.80 వరకూ టిక్కెట్ ధరలు ఉంటాయి. అవసరమైనవారు రిసెప్షన్ నంబర్ 98487 80524ను సంప్రదించొచ్చు. ఇక్కడ ఏపీ టూరిజానికి దీటుగా ప్రైవేటు టూరిజం రిసార్ట్స్ కూడా భారీగా ఆదాయం సంపాదిస్తున్నాయి.
వైఎస్ వేసిన మొక్క.. నేడు మహావృక్షం
2004లో అప్పటి రాజోలు ఎమ్మెల్యే అల్లూరు కృష్ణంరాజు ప్రోత్సాహంతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఇక్కడ టూరిజం అభివృద్ధికి బీజం వేశారు. అప్పట్లో ఆయన రూ.4 కోట్ల కేటాయించి, రిసార్ట్ కట్టి, నాలుగు హౌస్ బోట్లు పెట్టారు. అదే ఇప్పుడు మహా వృక్షం అయింది. నేడు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు సైతం రూ.వంద కోట్లకు పైగా పెట్టుబడి పెట్టాయి. రూ.కోట్లలో టర్నోవర్ జరుగుతోంది. తాజాగా ఇక్కడ ప్రైవేటు బోట్ షికారు జోరుగా జరుగుతోంది.
కేరళకు దీటుగా ..
దిండి కేంద్రం ద్వారా కోనసీమతో పాటు గోదావరి జిల్లాల టూరిజం కేరళకు దీటుగా మారింది. ఇక్కడకు వచ్చే పర్యాటకుల సంఖ్య ప్రతి ఏడాదీ పెరుగుతోంది. ప్రకృతి ప్రేమికులతో పాటు టెంపుల్ టూరిజం కూడా అభివృద్ది చెందింది. వేసవిలో పర్యాటకుల సంఖ్య బాగా ఎక్కువగా ఉంటుంది. దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేశాం.
– కె.మురళీధర్, దిండి ఏపీ టూరిజం మేనేజర్
05ఆర్‌జెడ్‌ఎల్31 కె. మురళీధర్


