ఫ తెగిపడిన విద్యుత్ తీగలు
ఫ తడిసిన మొక్కజొన్న కళ్లాలు
దేవీపట్నం: వేసవి ఎండలు మండిపోతున్న వేళలో మంగళవారం సాయంత్రం ఇందుకూరుపేట పరిసర గ్రామాల్లో ఈదురు గాలులతో కూడిన భారీవర్షం కురిసింది. గోకవరం దండంగి ఆర్‌అండ్‌బీ రహదారిలో ఇందుకూరు, ఇందుకూరుపేట గ్రామాల మధ్య తాటిచెట్టు విరిగిపడడంతో విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. ఈ కారణంగా ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఆ శాఖ సిబ్బంది సాయంత్రం నుంచి రాత్రి వరకూ మరమ్మతులు నిర్వహించారు. భారీ వర్షం కారణంగా మొక్కజొన్న కళ్లాలు మరోసారి తడిసి ముద్దయ్యాయి. రెండు రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి ముందుగా తడిసిన మొక్కజొన్న కళ్లాల్లో కండెలను మంగళవారం రైతులు కూలీలతో తిరగేసి ఆరబెట్టారు. కానీ సాయంత్రం కురిసిన వర్షానికి మరోసారి తడిచిపోవడంతో రైతులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అసలే ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో దళారులు చెప్పిన ధరకే అమ్ముకుంటున్న రైతులకు.. అకాల వర్షం కారణంగా అదనపు ఖర్చులు పెరిగిపోయాయి.
కూనవరం: మండల కేంద్రమైన కూనవరంలో సోమవారం సాయంత్రం ఈదురుగాలులతో కురిసిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. విద్యుత్ అంతరాయంతో గ్రామస్తులు కంటిమీద కునుకు వేయలేదు. గాలుల ధాటికి పలు చోట్ల విద్యుత్ వైర్లపై చెట్లు విరిగి పడ్డాయి. ఎయిర్ టెల్ టవర్ సమీపంలోని ట్రాన్స్‌ఫారమ్‌తో పాటు రెండు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. గాలి, వర్షం తగ్గగానే విద్యుత్ ఏఈ తన సిబ్బందితో కలిసి విద్యుత్ సౌకర్యం పునరుద్ధరించేందుకు తీవ్ర ప్రయత్నం చేశారు. ఫారెస్ట్ కార్యాలయం రోడ్డుపైనా, హరిజనపేట పాఠశాల సమీపంలో, సాయిబాబా గుడి వద్ద, గిన్నెల బజారులో చెట్లు విరిగి పడ్డాయి. ఆయా చెట్లను తొలగించి మంగళవారం రాత్రి 7.30 గంటల విద్యుత్ పునరుద్దరించారు. బ్రిడ్జిరోడ్డులో ఎయిర్‌టెల్ టవర్ వద్ద పడిపోయిన ట్రాన్స్‌ఫారం పునరుద్దరించేకు ప్రత్యేక మెషీన్ రావాలని సిబ్బంది తెలిపారు. గడిచిన 24 గంటల నుంచి విద్యుత్ లేకపోవడంతో గ్రామస్తులు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గ్రామ పంచాయతీ కుళాయిల ద్వారా సరఫరా కావాల్సిన తాగునీరు నిలిచిపోయింది. సిగ్నల్స్ లేక సెల్‌ఫోన్లు మూగబోయాయి.


