ఖతార్‌లో కష్టాల నుంచి మహిళకు విముక్తి | - | Sakshi
Sakshi News home page

ఖతార్‌లో కష్టాల నుంచి మహిళకు విముక్తి

May 6 2026 8:01 AM | Updated on May 6 2026 8:01 AM

అమలాపురం రూరల్‌: ఉపాధి కోసం ఖతార్‌ దేశం వెళ్లి అక్కడ తీవ్ర ఇబ్బందులు పడుతున్న కోనసీమ జిల్లాకు చెందిన మహిళను కలెక్టర్‌ మహేష్‌ కుమార్‌ ప్రత్యేక చొరవతో కేసీఎం అధికారులు సురక్షితంగా మంగళవారం ఇంటికి చేర్చారు. వివరాల్లోకి వెళితే.. మామిడికుదురు మండలం కొమరాడ గ్రామానికి చెందిన డి.కనకదుర్గ అమలాపురానికి చెందిన ఏజెంట్‌ ఎ.శ్రీనివాసరావు ద్వారా 2024 నవంబర్‌లో ఖతార్‌ వెళ్లింది. అక్కడ ఓ ఇంట్లో పనికి చేరిన ఆమెకు చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఖతార్‌ యజమాని భార్యాభర్తల గొడవల కారణంగా దుర్గను తీవ్రంగా వేధించడమే కాకుండా కనీసం సరైన ఆహారం పెట్టకుండా ఇబ్బందులకు గురి చేశారు. ఐదు నెలల పాటు నరక యాతన అనుభవించిన దుర్గ ఆ బాధలను భరించలేక అక్కడి నుంచి తప్పించుకుని తనను పంపిన ఆఫీసుకు చేరుకున్నారు. అక్కడ కూడా ఆమె పరిస్థితి మెరుగుపడలేదు. వేర్వేరు ఇళ్లలో పది రోజులు, వారం రోజులు చొప్పున పనిచేయిస్తూ ఎటువంటి జీతం ఇవ్వకుండా ఆమెను మానసిక, శారీరక వేధింపులకు గురిచేశారు. దీనితో ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షీణించగా, బాధితురాలు తన భర్త నాగరాజుకు ఫోన్‌ చేసి తన గోడు వెళ్లబోసుకోగా కేసీఎంను ఆశ్రయించారు. బాధితురాలిని రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ వలసదారుల కేంద్రాన్ని ఆదేశించారు. కేసీఎం అధికారి గోళ్ల రమేష్‌ ఆధ్వర్యంలో బృందం ఏజెంట్‌తో మాట్లాడి చట్టపరమైన ఒత్తిడి తీసుకువచ్చారు. చివరకు కనకదుర్గను సురక్షితంగా రప్పించగలిగారు.

Advertisement
 
Advertisement
Advertisement