● అధ్వానంగా జిల్లాలోని ప్రభుత్వాస్పత్రులు
● రోగులకు కనీస వసతులు కరవు
● అవసరమైనన్ని బెడ్లు లేక ఇబ్బందులు
● తాగునీరు, మరుగుదొడ్లకూ కటకటే
సాక్షి, నెట్‌వర్క్: తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ వైద్యశాలలు అధ్వానంగా మారాయి. రోగులకు కనీస వసతులు మృగ్యమయ్యాయి. అవసరమైన బెడ్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. తాగునీటికి, మరుగుదొడ్లకు అవస్థలు తప్పడం లేదు. డాక్టర్ల కొరతతో మెరుగైన వైద్యం అందని ద్రాక్షగా మారింది. ఆస్పత్రుల అధ్వాన పరిస్థితులపై ‘సాక్షి’ ఫీల్డ్ విజిట్.
రాజమహేంద్రవరం
రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నిత్యం ఓపీ 1,500 నుంచి 1,800 మధ్య ఉంటుంది. ఇనన్ పేషెంట్ల సంఖ్య 650 ఉంటుంది. ఆసుపత్రిలో బెడ్‌ల సామర్థ్యం 500 వరకు మాత్రమే ఉంది. బెడ్స్ కొరత ఉంది. మెడికల్ కళాశాలకు అనుసంధానంగా ఉండటంతో సూపర్ స్పెషాలిటీ బ్లాక్ నిర్మించాల్సి ఉంది. క్రిటికల్ కేర్ బ్లాక్ నిర్మాణం పూర్తయింది. అందులో మెడికల్ ఎక్విప్‌మెంట్ లేకపోవడంతో ఆ భవనం నిరుపయోగంగా ఉంది. న్యూరో సమస్యలతో రోగులు వస్తే డాక్టర్ ఉన్నా సర్జరీలు చేసేందుకు పరికరాలు లేవు. గుండెపోటుతో ఎవరైనా వస్తే ఇక అంతే సంగతి. ఆసుపత్రిలో కార్డియాలజీ విభాగమే లేదు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరగడం లేదు. ఆసుపత్రిలో ఆ విభాగంలో ఉన్న వైద్యుడిని వేరే ప్రాంతానికి పంపడంతో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఆగిపోయాయి.
మండపేట
మండపేట పట్టణంలోని సీహెచ్‌సీలో రోజుకు సుమారు 200 మంది వైద్యం కోసం ఓపీ రాయించుకుంటున్నారు. ఈ 30 పడకల ఆసుపత్రికి పట్టణంలోని ప్రజలు వస్తారు. ఓపీ చీటీ రాయించడం ఇక్కడ ఓ ప్రసహనంగా మారుతోంది. ఉదయం 10 గంటలకు సుమారు 25 మంది లైన్‌లో నిలుచుండగా ఆసుపత్రి సిబ్బంది ఒక్కరు మాత్రమే ఓపీ రసీదులు ఇస్తున్నారు. మహిళలకు ప్రత్యేక లైనను నిర్వహంచకపోవడంతో సీ్త్రలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాలికి గాయమైన వ్యక్తి బాధను ఓర్చుకుంటూ లైనులో నిలుచోవాల్సిన పరిస్థితి. వృద్ధులు, గాయాలపాలైనవారికి త్వరితగితన ఓపీ చీటీ రాసిచ్చే పరిస్థితి కానరాలేదు. ఓపీ రాయించుకునేందుకు ఆధార్, సెల్‌ఫోన్ నంబర్లు తప్పనిసరి చేయడంపై రోగులు అసహనం వ్యక్తం చేశారు. రావులపేటకు చెందిన బేవర చిన్న వెంకటేశ్వర్లు అనే వృద్ధుడు లైన్లో నిలుచుండగా సెల్‌ఫోనన్ తప్పనిసరని సిబ్బంది చెప్పడంతో కుటుంబ సభ్యుల నంబరు చీటీపై రాయించారు. నేరుగా మొబైల్ ఫోన్ తేవాలని, ఓటీపీ నమోదు చేయాల్సి వస్తుందని చెప్పడంతో తనకు అలాంటి సదుపాయాలు లేవంటూ ఉసూరుమంటూ వెనుదిరిగి వెళ్లాల్సి వచ్చింది. ఆసుపత్రి ప్రధాన ద్వారం వద్ద వాటర్ టిన్‌లో నీళ్లు లేకపోవడంతో బయట వాటర్ బాటిళ్లను రోగులు ఆశ్రయించాల్సి వచ్చింది. ప్రసూతి వైద్య విభాగం వద్ద రోగులు సిబ్బంది కోసం వేచి చూడాల్సి వచ్చింది.
కొవ్వూరు
కొవ్వూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో పలు సమస్యలు వెంటాడుతున్నాయి. 44 పోస్టులకు గాను 8 ఖాళీలు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా ముగ్గురు వైద్యాధికారులు, ముగ్గురు డాక్టర్ల పోస్టులు ఉన్నాయి. ఆస్పత్రిలో జనరేటర్ పూర్తి స్థాయిలో పనిచేయడం లేదు. దీంతో విద్యుత్ సమస్య వస్తోంది. ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయాల్సి ఉంది. ఆసుపత్రిలో అంబులెన్సు ఉన్నప్పటికీ మెయింటినెనన్స్ లేక నిరుపయోగంగా ఉంది. ట్రామా కేర్ సెంటర్ లేకపోవడం వల్ల కేసులను రాజమహేంద్రవరం రిఫర్ చేయాల్సి వస్తోంది. 122 మంది ఓపీ సేవలు ఉపయోగించుకుంటున్నారు. 20 మంది ఇన్ పేషెంట్లు ఉన్నారు.
గోపాలపురం
గోపాలపురంలోని ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు సరిపడినన్ని బెడ్స్ లేక ఇబ్బందులు పడుతున్నారు. 30 పడకల ఆస్పత్రి అయినా 45 మంది రోగులు ఇన్‌పేషెంట్లుగా ఉంటున్నారు. జనరల్ మెడిసిన్ డాక్టర్ పోస్టు ఖాళీగా ఉంది. రోగులకు అవసరమైన మరుగుదొడ్లు లేవు. జనరల్ డ్యూటీ సిబ్బంది కొరత ఉంది. మార్చురీ షెడ్డు శిథిలమై కూలేందుకు సిద్ధంగా ఉంది. ఆర్వో ప్లాంట్ లేదు. ఆస్పత్రికి వచ్చిన వారికి చెట్టు నీడే ఆదరువుగా మారింది.
నిడదవోలు
నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల కొరత వెంటాడుతోంది. ప్రధానమైన ముగ్గురు డాక్టర్ల పోస్టులు భర్తీ కాకపోవడంతో సరైన వైద్యం అందడం లేదు. వెరసి రోగులు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ఇన్ పేషెంట్ వార్డు సరిపోకపోవడంతో వార్డు బయట వరండాలో వైద్యం చేస్తున్నారు. ఇంకా ఇక్కడ 3 వార్డులు అవసరమవుతాయి.


