రేపు పొగాకు రైతు సమస్యలపై ధర్నా | - | Sakshi
Sakshi News home page

రేపు పొగాకు రైతు సమస్యలపై ధర్నా

May 5 2026 7:14 AM | Updated on May 5 2026 7:14 AM

రాజమహేంద్రవరం రూరల్‌: వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో దేవరపల్లి పొగాకు వేలం కేంద్రం ఎదుట బుధవారం ఉదయం 10.0.గంటలకు వర్జీనియా పొగాకు రైతుల సమస్యలపై ధర్నా నిర్వహిస్తున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీమంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, మాజీ మంత్రి తానేటి వనిత వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. వర్జీనియా పొగాకుకి కనీస మద్దతు ధర చెల్లించాలని, కొనుగోళ్లను వేగవంతం చేయాలని డిమాండ్‌ చేస్తూ చేపట్టిన ఈ ఆందోళన కార్యక్రమానికి పొగాకు రైతులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని కోరారు.

సమస్యలుంటే నేరుగా రండి

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ప్రజలు తమ సమస్యల పరిష్కారం కాకపోతే నేరుగా తన వద్దకు వచ్చి తెలపవచ్చని ఎస్పీ డి.నరసింహకిశోర్‌ పేర్కొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం పోలీస్‌ పీజీఆర్‌ఎస్‌ నిర్వహించారు. దీనికి 39 ఫిర్యాదులు వచ్చాయి. జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి ఆర్జీదారులు హాజరయ్యారు. వారి నుంచి పోలీసు అధికారులు ఆర్జీలు స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వెంటనే నేరుగా సంబంధిత స్టేషన్‌ పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడి ఫిర్యాది దారుల సమస్యలను పరిష్కరించవలసినదిగా ఉత్తర్వులు ఇచ్చారు. పీజీఆర్‌ఎస్‌కు సివిల్‌ కేసులు, కుటుంబ సమస్యలు, చీటింగ్‌, కొట్లాట కేసులు, ఇతర కేసులకు సంబంధించిన ఫిర్యాదులు స్వీకరించామన్నారు.

హైవేపై కారు నుంచి మంటలు

కడియం: జాతీయ రహదారిపై మండలంలోని బుర్రిలంక వద్ద ఒక కారు ఇంజిన్‌ నుంచి మంటలు చెలరేగాయి. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. నక్కా రామేశ్వరం గ్రామానికి చెందిన కే.మురళి తన స్నేహతుడితో కలిసి తన స్వగ్రామం నుంచి రాజమహేంద్రవరం కారులో బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న కారు బుర్రిలంక వద్దకు వచ్చేసరికి ఇంజిన్‌ నుంచి మంటలు చెలరేగాయి. దీంతో అందులో ఉన్న ఇద్దరూ అప్రమత్తమై వెంటనే కారుని రోడ్డు పక్కనే నిలిపివేసి కిందికి దిగేసారు. స్థానికుల సాయంతో మంటలు ఆర్పివేశారు. కడియం పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు నమోదు చేసుకున్నారు.

183 అర్జీల స్వీకరణ

సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం) : కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌), రెవెన్యూ క్లినిక్‌ కార్యక్రమాల్లో మొత్తం 183 అర్జీలు స్వీకరించినట్లు జిల్లా రెవెన్యూ అధికారి టి.సీతారామమూర్తి సోమవారం తెలిపారు. నిర్దిష్ట గడువులో అర్జీలకు పరిష్కారం కల్పించే విధంగా చర్యలు కొనసాగుతున్నాయన్నారు. ఎస్‌డిసి ఎం.ఆర్‌.ఆర్‌. ప్రేమ్‌కుమార్‌, పుష్కరాల ప్రత్యేక అధికారి ఎస్‌డిసి డాక్టర్‌ ఏ. మహేష్‌, డీఎస్పీతో పాటు ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

అక్రమ లాకౌట్‌ ఎత్తివేయాలి

ప్రకాశం నగర్‌ (రాజమహేంద్రవరం): కడియం పేపర్‌మిల్లు అక్రమ లాకౌట్‌ ఎత్తి వేసి, తక్షణమే సమస్య పరిష్కరించకపోతే కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రాజమండ్రి పేపర్‌ మిల్లు ప్రధాన కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాటిపాక మధు హెచ్చరించారు. సోమవారం స్థానిక శ్యామల సెంటర్‌ వద్ద గల సీఐటీయూ కార్యాలయంలో కేంద్ర కార్మిక సంఘాల సమావేశం జరిగింది. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బి.పవన్‌ మాట్లాడుతూ కార్మికులు ఏప్రిల్‌ 27 నుంచి న్యాయమైన డిమాండ్‌లపై సమ్మె చేస్తున్నారన్నారు. అనంతరం యాజమాన్యం వైఖరిపై కేంద్ర కార్మిక సంఘాలు నిరసన తెలిపాయి. సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు టి అరుణ్‌, ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటిపాక మధు, జిల్లా ప్రధాన కార్యదర్శి కె రాంబాబు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement