యానాంలో ‘మల్లాడి’కే పట్టం | - | Sakshi
Sakshi News home page

యానాంలో ‘మల్లాడి’కే పట్టం

May 5 2026 7:14 AM | Updated on May 5 2026 7:14 AM

అట్టహాసంగా విజయోత్సవ ర్యాలీ

మంచి పాలన అందిస్తానని కృష్ణారావు వెల్లడి

యానాం: యానాం ఎమ్మెల్యేగా మల్లాడి కృష్ణారావు ఆరోసారి ఎన్నికయ్యారు. ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేసిన ఆయనకు 19,863 ఓట్లు రాగా, తన సమీప కాంగ్రెస్‌ అభ్యర్థి, సిటింగ్‌ ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్‌అశోక్‌కు 15,295 ఓట్లు వచ్చాయి. స్థానిక ఎస్‌ఆర్‌కే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్‌ ప్రక్రియకు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఎస్పీ వరదరాజన్‌, ట్రైనీ ఎస్పీ కె.చిట్టిరాజు ఆధ్వర్యంలో పోలీసు బలగాలు బందోబస్తు నిర్వహించారు. మూడో రౌండ్‌లో మల్లాడికి స్పష్టమైన మెజార్టీ రావడంతో కౌంటింగ్‌ కేంద్రం నుంచి శ్రీనివాస్‌ అశోక్‌ తన సతీమణి లక్ష్మీ స్నేహతో కలసి బయటకు వెళ్లిపోయారు.

డిపాజిట్లు కోల్పోయిన అభ్యర్థులు

అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన 11 మంది అభ్యర్థులు డిపాజిట్లను కోల్పోయారు. టీవీకే పార్టీ అభ్యర్థి తోటరాజుకు 167 ఓట్లు, స్వతంత్రులు జనిపల్లి వెంకన్నబాబుకు 9 ఓట్లు, కాళ్ల వెంకటరమణకు 18 ఓట్లు, గిడ్డి బలరాంకు 78 ఓట్లు, తిరుకోటి ఆదిమూర్తికి 4 ఓట్లు, నాటి బూరయ్యకు 19 ఓట్లు, మల్లాడి ఉదయలక్ష్మికి 9 ఓట్లు, మెల్లం శ్రీనివాసరావుకు 14 ఓట్లు, లక్ష్మీస్నేహా మేడపాటికి 34 ఓట్లు, షేక్‌ అహ్మద్‌షా ఖాదర్‌కు 27 ఓట్లు, సూరిమిల్లి సుబ్బారావుకు 195 ఓట్లు లభించాయి.

ఆరోసారి ఎన్నికై ..

నియోజకవర్గం నుంచి ఆరోసారి మల్లాడి కృష్ణారావు విజయకేతనం ఎగురవేశారు. 1996, 2001, 2006, 2011, 2016 ఎన్నికల్లో కృష్ణారావు గెలుపొందారు. ఇప్పుడు తిరిగి మల్లాడి విజయం సాధించారు. యానాం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కృష్ణారావు ఎన్నికై నట్లు రిటర్నింగ్‌ అధికారి మీనా నుంచి మల్లాడి కుమారుడు రఘువంశీ సర్టిఫికెట్‌ అందుకున్నారు.

భారీగా విజయోత్సవం

మల్లాడి కృష్ణారావు విజయోత్సవ ర్యాలీ నియోజకవర్గ పరిధిలో ఉత్సాహంగా సాగింది. ప్రత్యేక వాహనంపై మల్లాడి నిలబడి ప్రజలకు అభివాదం చేశారు. ఓ వైపు బాణసంచా కాల్పులు, మరోవైపు పూలమాలలతో వేలాది మంది అభిమానులు, కార్యకర్తలు, మహిళలతో విజయోత్సవ ర్యాలీ సాగింది. ఇకపై మంచి పరిపాలన ఉంటుందని మల్లాడి కృష్ణారావు అన్నారు. గతంలో పేకాట పరిపాలన చూశారని, ప్రజలు అశోక్‌కు గుణపాఠం చెప్పారని విమర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement