చీఫ్ కమిషనర్‌కు వ్యతిరేకంగా వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల నిరసన
నిరసన వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు
కాకినాడ రూరల్: అయ్యా బాబు గారు.. మా కొద్దు ఈ బాబు అంటూ వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులు ఆ శాఖకు చెందిన చీఫ్ కమిషనర్ అహ్మద్‌బాబుకు వ్యతిరేకంగా కాకినాడలో సోమవారం నిరసన వ్యక్తం చేశారు. రమణయ్యపేటలోని వాణిజ్య పన్నుల శాఖ డివిజన్ కార్యాలయం వద్ద మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఫ్లెక్సీని పట్టుకుని అహ్మద్‌బాబు ప్రవర్తనా శైలికి వ్యతిరేకంగా కాకినాడ నోడల్ డివిజన్‌లోని ఉద్యోగులు ఆందోళనకు దిగారు. పెండింగ్‌లో ఉన్న పదోన్నతులను వెంటనే భర్తీ చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు పి.విజయ్‌కుమార్ మాట్లాడుతూ పునర్వ్యవస్థీకరణ పేరుతో చేపట్టిన చర్యల వలన ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఆర్వో కార్యాలయ వ్యవస్థ కారణంగా క్షేత్ర స్థాయి ఉద్యోగుల కొరత ఏర్పడిందని, ప్రభుత్వం పునఃసమీక్ష చేపట్టి ఈ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. సంఘ కార్యదర్శి ఏవీవీఎస్ స్వామి, ఎస్.శ్రీను,. ఆర్.నారాయణమూర్తి, గంగాభవాని, నాగ కల్పన, విజయలక్ష్మి పాల్గొన్నారు.


