సత్యసాయి ఎంటర్ ప్రైజెస్
నిర్వాహకుని ఇంటి వద్ద బాఽధితుల నిరసన
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): అగరబత్తీల ప్యాకింగ్ పేరుతో తమ వద్ద లక్షల రూపాయలు దండుకున్న సత్యసాయి ఎంటర్ ప్రైజెస్ నిర్వాహకుడు వరదా మోహన్‌కృష్ణ నుంచి తమకు డబ్బు తిరిగి ఇప్పించాలంటూ బాధితులు నిరసన వ్యక్తం చేశారు. స్థానిక నారాయణపురంలోని వరదా మోహన్‌కృష్ణ ఇంటి వద్దకు సోమవారం బాధితులంతా చేరుకుని నిరసన వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్బంగా బాధితులు మీడియాతో మాట్లాడుతూ తాము మోసపోయిన వైనాన్ని వివరించారు. ఇంటి వద్దే ఉంటూ డబ్బు సంపాదించవచ్చని యూట్యూబ్‌లో, సోషల్ మీడియాలో ప్రచారం చేయడంతో తాము సంస్థను సంప్రదించామన్నారు. తమకు డిపాజిట్ చెల్లిస్తే వస్తువులు ఇస్తామని, వాటిని ప్యాకింగ్ చేసి ఇవ్వాలని నిర్వాహకులు తెలిపారన్నారు. దీంతో తామంతా డ్వాక్రా రుణాల ద్వారా, వేరే వ్యక్తుల వద్ద వడ్డీకి డబ్బు తెచ్చి సత్యసాయి ఎంటర్ ప్రైజెస్‌కు చెల్లించామన్నారు. తొలుత రెండు నెలల డబ్బు బాగానే వేశారని, తర్వాత నుంచి వేయడం మానేశారన్నారు. దీనిపై అడిగేందుకు వెళితే రాజమహేంద్రవరంలోని కార్యాలయం మూసివేశారన్నారు. దీంతో కేసు నమోదు చేసేందుకు తమ పరిధిలోని పోలీస్ స్టేషన్లకు వెళితే ఎక్కడా కేసులు నమోదు చేసుకోలేదన్నారు. అయితే రాజమహేంద్రవరం త్రీటౌన్‌లో నలుగురు ఫిర్యాదులపై మాత్రమే కేసు నమోదు చేశారని చెప్పారు. తాము డబ్బు చెల్లించామని, దీనికి ఆధారాలు ఉన్నాయని, తమ కేసులు కూడా నమోదు చేసి సత్యసాయి ఎంటర్ ప్రైజెస్ నిర్వాహకుల వద్ద నుంచి తాము కట్టిన డబ్బు తిరిగి ఇప్పించాలన్నారు. విషయం తెలిసిన ప్రకాశ్‌నగర్ సీఐ బాజిలాల్ ఘటనా ప్రాంతానికి చేరుకుని బాధితులతో మాట్లాడారు. ఏ ప్రాంతంలో సొమ్ము చెల్లించారో అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని తెలిపారు.


