రాజమహేంద్రవరం సిటీ: బీసీలకు స్థానిక సంస్థల్లో గతంలో మాదిరి 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రాకు రాష్ట్ర బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ సంక్షేమ సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు. సోమవారం రాజమహేంద్రవరం ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ప్రజాప్రతినిధులు, వెనుకబడిన వర్గాల సంఘాలు, సివిల్ సొసైటీలు, ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రాను నియమించగా, జిల్లాలో వినతులు స్వీకరించే కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు సానబోయిన రామారావు, ఉభయ తెలుగు రాష్ట్రాల శెట్టిబలిజ మహానాడు కన్వీనర్, ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు, రాష్ట్ర శెట్టిబలిజ సంక్షేమ సంఘ అధ్యక్షుడు పిల్లి సుబ్రహ్మణ్యం, చైర్మన్ గుమ్మడి సమర్పణరావు, వైస్ చైర్మన్ ఎల్‌వీ ప్రసాద్, జిల్లా అధ్యక్షుడు బి.జార్జి ఆంటోని, మట్టపర్తి సత్యనారాయణ, డాక్టర్ రాచర్ల నాగేశ్వరరావు, నక్కా సోమేశ్వరరావు తదితరులు రాజీవ్ రంజన్ మిశ్రాను కలసి వినతిపత్రం అందజేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అనేక కులాల ప్రజలు విద్యా, ఉద్యోగ అవకాశాలకు దూరంగా ఉన్నారన్నారు. ఈ పరిస్థితుల్లో అన్ని స్థానిక సంస్థల్లో గతంలో మాదిరి 34 శాతం రిజర్వేషన్లు కేటాయించాలని కోరారు.


