కొత్తపల్లి: ఉష్ణం ఉష్ణేన శీతలే అన్నది ఆయుర్వేద వైద్యుల సూత్రం. మండు వేసవిలో తాపాన్ని చల్లార్చే ఔషధ విలువల ఫలం మామిడి. సహజ సిద్ధంగా చెట్టుకు పండితే దాని రంగు కానీ, రుచి కానీ, వాసన కానీ మనసును దోచుకుంటాయి. అలాంటి పండ్ల ముందు అమృతం కూడా దిగదుడుపే. అందుకే దానిని మధుర ఫలం అంటారు. కాలం మారింది. డిమాండ్ పెరిగింది. దిగుబడి తగ్గింది. వాతావరణ పరిస్థితులు, యాజమాన్య పద్ధతులలో లోపాలతో పూర్తిగా పండకుండానే రాలిపోతున్నాయి. దీంతో వ్యాపారులు స్వార్థంతో కృత్రిమంగా పండించి విషతుల్యం చేస్తున్నారు. కాల్షియం కార్బైడ్ రసాయనాలతో వాటిని సహజ సిద్ధంగా పండిన పండ్లలా మాగించి మార్కెట్‌ను ముంచెత్తుతున్నారు. ఇటువంటి పండ్లను తినడం వల్ల నాడీ వ్యవస్థ దెబ్బ తిని, క్యాన్సర్ తదితర రోగాల బారిన పడే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాకినాడ జిల్లాలో ప్రధానంగా తుని, జగ్గంపేట, శంఖవరం, తొండంగి, ప్రత్తిపాడు, రౌతులపూడి, కోటనందూరు, పెద్దాపురం, గండేపల్లి, కరప, యు.కొత్తపల్లి, కాజులూరు, పిఠాపురం, తాళ్లరేవు, కిర్లంపూడి, కాకినాడ రూరల్, పెదపూడి, సామర్లకోట తదితర ప్రాంతాల్లో సుమారు 22,270 ఎకరాల్లో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. కార్బైడ్ వల్ల ఎసిటిలీన్ వాయువు విడుదలై దానిలోని ఆర్సెనిక్, ఫాస్పరస్ వంటి హానికారక పదార్థాల వల్ల దేహంలో మైకం, దాహం, వాంతులు, నోటి పూతలు వస్తాయని వైద్యులు అంటున్నారు. అధికారులు ఎంత హెచ్చరిస్తున్నా ఏ మాత్రం ఆగకుండా లాభాపేక్షతో కృత్రిమంగా పండించడానికే మొగ్గు చూపుతున్నారు. వినియోగదారులు ఈ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. సహజ సిద్ధంగా పండిన మామిడి పండ్లు నీటిలో వేస్తే మునిగిపోతాయి. సువాసన కలిగి ఉంటాయి. కానీ కార్బైడ్‌తో ముగ్గించినవి నీటిలో తేలుతాయి. సువాసన కూడా ఉండదు. వినియోగదారులు ఈ విషయాన్ని గుర్తించాలి.
దీర్ఘకాలిక వ్యాధులకు అవకాశం
రసాయనాలతో మగ్గబెట్టిన మామిడి పండ్లు తినడం వల్ల దీర్ఘకాలిక రోగాలు వ్యాప్తి చెందుతాయి. రసాయనాల ద్వారా పండించిన మామిడి పండ్లను తీసుకున్న వారికి గ్యాస్ట్రిక్ సమస్యలు, విరేచనాలు, వాంతులే కాకుండా మనిషి పూర్తిగా నీరసించి పోయే ప్రమాదం ఉంది. రంగులు చూసి ప్రజలు మోసపోకుండా ఎవరి ఆరోగ్యాన్ని వారే కాపాడుకోవాలి.
– సౌజన్య, వైద్యాధికారి,
నాగులాపల్లి ఆరోగ్య కేంద్రం
సురక్షిత పద్ధతులు పాటించాలి
మామిడి కాయలపై కాల్షియం కార్బైడ్ పూయడాన్ని ప్రభుత్వం నిషేధించింది. అలా చేస్తే ఆహార భద్రత అధికారులు కఠిన చర్యలు తీసుకుంటారు. రసాయనాలు పూసిన మామిడి పండ్లు తింటే నాలుక, పెదవులు మొద్దు బారినట్లు అనిపిస్తుంది. రైతులు, వ్యాపారులు సురక్షిత పద్ధతులు పాటించాలి. ప్రజల ఆరోగ్యాన్ని ధృష్టిలో పెట్టుకుని రైతులు, వ్యాపారులు సహజంగా ముగ్గబెట్టిన మామిడి పండ్లనే విక్రయించాలి.
– వై.సోమ రాజశేఖర్, ఉద్యానశాఖ అధికారి, పిఠాపురం
కాల్షియం కార్బైడ్‌తో
మామిడిని ముగ్గిస్తున్న రైతులు
ప్రభుత్వం నిషేధించినా
కృత్రిమ విధానంపై మొగ్గు
ప్రజారోగ్యానికి చేటు తప్పదంటున్న వైద్యులు
కొరవడిన అధికారుల పర్యవేక్షణ, నిఘా


