● నేత్ర పర్వంగా చూర్ణ, శ్రీపుష్ప యాగోత్సవం
● క్షేత్రంలో ముగిసిన వైశాఖ బ్రహ్మోత్సవాలు
ద్వారకా తిరుమల: శ్రీవారి వైశాఖమాస దివ్య బ్రహ్మోత్సవాలు ఆదివారం జరిగిన విశేష కార్యక్రమాలతో ముగిశాయి. ఉదయం స్వామివారి కల్యాణ మండపంలో అర్చకులు శ్రీవారు, అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు అర్చన చేసి హారతులిచ్చారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు వసంతాలను సమర్పించి, చూర్ణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అందులో భాగంగా స్వామివారిని కీర్తిస్తూ అర్చకులు, మహిళా భక్తులు వడ్లు దంచారు. ఆ తరువాత రాజాధిరాజ వాహనంపై శ్రీవారికి తిరువీధి సేవ చేసి, భక్తులకు వసంతాలు అందజేశారు. రాత్రి ఆలయంలో స్వామి వారికి ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, శ్రీపుష్ప యాగోత్సవం నిర్వహించారు.
ద్వాదశ కోవెల ప్రదక్షిణలు ఇలా..
ఉభయ దేవేరులతో శ్రీవారికి రాత్రి ఆలయంలో 12 ప్రదక్షిణలు, 12 సేవా కాలాలు, 12 రకాల పిండి వంటలతో నివేదనలు జరిపారు. అందులో అర్చకులు, పండితులు, భక్తులు, అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఒక్కొక్క ప్రదక్షిణకు ఒక్కో సేవాకాలాన్ని నిర్వహించారు. అలాగే ఒక్కో ప్రదక్షిణకు ఒక్కో రకం పిండివంటను ఆరగింపు చేసి స్వామి, అమ్మవార్లకు హారతులిచ్చారు. వీణా, వేణువు, మృదంగం, గానం, నృత్యం, శృతి, స్మృతి, ద్రవిడ వేదం, భేరి, కాహలము, గంటారవం, నిశ్శబ్దం వెరసి 12 సేవలు, 12 ప్రదక్షిణలు నిర్వహించారు. అనంతరం శ్రీపుష్ప యాగోత్సవాన్ని వైభవంగా జరిపారు. ఆలయ ముఖ మండపంలో శయన మహావిష్ణువు అలంకారంలో ఉన్న స్వామి వారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. అలాగే శ్రీహరి కళాతోరణ వేదికపై నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను అలరించాయి. ఈ వేడుకలతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగిశాయి.
నేటి నుంచి ఆర్జిత సేవలు
శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో రద్దు చేసిన నిత్యార్జిత కల్యాణాలు, ఆర్జిత సేవలను సోమవారం నుంచి పునరుద్ధరిస్తున్నట్టు ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు తెలిపారు.


