కపిలేశ్వరపురం (మండపేట): మండపేట మండలం ద్వారపూడి శివారు వేములపల్లిలో రైతు బడుగు సాల్మన్ రాజు (63) విద్యుతాఘాతంతో మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు శనివారం ఉదయం సాల్మన్‌రాజు యథావిధిగా పొలానికి వెళ్లాడు. రాత్రయినా ఇంటికి రాకపోవడంతో ఆయన బంధువు పొలానికి వెళ్లి చూడగా అక్కడ విగతజీవిగా పడి ఉన్నాడు. కొబ్బరి చెట్టు నుంచి ఇనుప ఊచతో కాయలు కోస్తుండగా విద్యుత్ వైర్లు తగిలి ఈ ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడుకి కుమారుడు, నలుగురు కుమార్తెలు ఉన్నారు.
అదుపు తప్పి
వాహనాలను ఢీకొన్న ఐషర్
పి.గన్నవరం: రాజవరం–పొదలాద రహదారిలో పి.గన్నవరం శివారు తాటికాయలవారిపాలెం వద్ద ఆదివారం ఒక ఐషర్ వ్యాన్ అదుపు తప్పి రహదారి పక్కన ఉన్న మూడు మోటారు సైకిళ్లను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల మేరకు ఆదివారం వర్షం కురవడంతో తాటికాయలవారిపాలెం సమీపంలో తేనె పరిశ్రమ వద్ద పలువురు ప్రయాణీకులు తమ మోటారు సైకిళ్లను రోడ్డు పక్కన నిలిపి షెడ్డులోకి వెళ్లారు. ఆ సమయంలో పి.గన్నవరం నుంచి రావులపాలెం వైపు వెళ్తున్న ఐషర్ వ్యాన్ అదుపుతప్పి ఆ వాహనాలను ఢీకొట్టింది. దీంతో మూడు మోటారు సైకిళ్లు ధ్వంసమయ్యాయి. అక్కడ ఉన్న ఒక వ్యక్తికి గాయాలు కావడంతో అతడిని చికిత్స నిమిత్తం అమలాపురంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
తాళం పగలగొట్టి ఇంట్లో చోరీ
నల్లజర్ల: దూబచర్ల శివారు గాంధీ కాలనీలో ఓ ఇంటి తాళం పగులగొట్టి దొంగలు చోరీకి పాల్పడ్డారు. శనివారం రాత్రి జరిగిన ఈ సంఘటనపై ఎస్‌ఐ ఆంజనేయబాబు తెలిపిన వివరాల మేరకు ఇంటి యజమాని భీమడోలు పుష్పకు శనివారం జ్వరం రావడంతో ఇంటికి తాళం వేసి అదే గ్రామంలో ఉన్న తన తల్లి ఇంటికి వెళ్లి పడుకుంది. ఉదయం వచ్చి చూసేసరికి ఇంటితాళం పగులగొట్టి ఇంట్లో వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. బీరువాలోని 8 గ్రాముల బంగారు భరణాలు, 30 తులాల వెండి వస్తువులను దొంగలు దోచుకుపోయినట్టు ఆదివారం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
గుర్తు తెలియని
మృతదేహం లభ్యం
ధవళేశ్వరం: కాటన్ బ్యారేజ్ 9వ గేట్ వద్దకు ఆదివారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కొట్టుకువచ్చింది. స్థానికుల సమాచారం మేరకు ధవళేశ్వరం పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహం మగ వ్యక్తిగా గుర్తించారు. ఐదడుగుల పొడవు, సుమారు 35 నుంచి 40 ఏళ్ల వయస్సు ఉంటుందని పోలీసులు తెలిపారు. మృతుడి శరీరంపై నీలం, బిస్కెట్ రంగు గడులు కలిగిన ఫుల్ హాండ్స్ షర్టు, సిమెంట్ కలర్ ఫ్యాంటు ఉంది. షర్టు కాలర్ వెనుక ‘శ్రీసాయి‘ పేరుతో ఒక లేబుల్ ఉన్నది. మృతుడి ఆచూకీ తెలిసిన వారు 9440796586 , 9491999336 నెంబర్లకు తెలియజేయాలని ధవళేశ్వరం సీఐ టి.గణేష్, ఎస్సై హరిబాబు కోరారు.


