జాతీయ టెన్నిస్‌ సంఘ ఈసీ సభ్యుడిగా రామ్‌కుమార్‌ | - | Sakshi
Sakshi News home page

జాతీయ టెన్నిస్‌ సంఘ ఈసీ సభ్యుడిగా రామ్‌కుమార్‌

May 4 2026 7:19 AM | Updated on May 4 2026 7:19 AM

నాగమల్లితోట జంక్షన్‌ (కాకినాడ సిటీ): ఆలిండియా టెన్నిస్‌ సంఘ ఎగ్జిక్యూటివ్‌ సభ్యుడిగా కాకినాడ జిల్లాకు చెందిన సీనియర్‌ టెన్నిస్‌ క్రీడాకారుడు, ఏపీ టెన్నిస్‌ సంఘ కార్యదర్శి పుప్పాల వెంకట రామ్‌ కుమార్‌ ఎన్నికయ్యారు. ఈ మేరకు జాతీయ టెన్నిస్‌ సంఘం నుంచి ఆదివారం ఆయన నియామక ఉత్తర్వులు అందుకున్నారు. 2017 నుంచి ఏపీ టెన్నిస్‌ సంఘ కార్యదర్శిగా కొనసాగుతున్న రామ్‌ కుమార్‌ ఇప్పటి వరకు నాలుగు వేల మందిని టెన్నిస్‌ క్రీడాకారులుగా తీర్చిదిద్దారు. 22 ఏళ్లుగా కాకినాడ, ఏపీ టెన్నిస్‌ సంఘానికి తన సేవలు అందిస్తున్నారు. ఏపీలో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీలు నిర్వహించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆలిండియా టెన్నిస్‌ సంఘ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యునిగా రామ్‌ కుమార్‌ ఎన్నిక కావడంపై టెన్నిస్‌ క్రీడాకారులు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో, రాష్ట్రంలో టెన్నిస్‌ క్రీడాభివృద్ధికి తన సహకారం అందిస్తానని తెలిపారు.

కల్యాణ మండపాన్ని

దేవుడు ఆశీర్వదించాడు

– ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు

రామచంద్రపురం రూరల్‌: నియోజకవర్గంలో కాపు కల్యాణ మండపం నిర్మాణానికి భూమి పూజ పూర్తయిన తరువాత భగవంతుడు వర్షం రూపంలో ఆశీర్వదించాడని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు. ముందుగా మండలం హసన్‌బాదలో శిరిడీ సాయి ఆలయం పక్కన గల రెండు ఎకరాల పది సెంట్ల స్థలంలో తన తల్లిదండ్రులు తోట పుండరీకాక్షయ్య, లక్ష్మీకాంతం దంపతుల పేరుతో శ్రీ కృష్ణదేవరాయ కాపు కల్యాణ మండపానికి త్రిమూర్తులు, సూర్యకుమారి దంపతులు, కుమారుడు పృథ్వీరాజ్‌ చేతుల మీదుగా కాపు సంఘ పెద్దలు మేడిశెట్టి కృష్ణదాసు, తెనగాని ఏడుకొండలు, చవ్వాకుల సూరిబాబు, రావూరి సుబ్బారావు, రేవు శ్రీను తదితరులతో కలసి భూమి పూజ చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ నియోజకవర్గంలో కాపు సంఘీయుల చిరకాల కోరిక ఈ రోజు సాకారమైందన్నారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ సాకా బాబీ, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ గాధంశెట్టి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement