అయినవిల్లి: విఘ్నాలను తొలగించే అయినవిల్లి విఘ్నేశ్వరస్వామిని ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించి, మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రధానార్చకుడు అయినవిల్లి సూర్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో స్వామికి తెల్లవారు జామున మేలుకొలుపు సేవ, పంచామృతాభిషేకం, ఏకాదశ, లఘున్యాస పూర్వక అభిషేకాలు, లక్ష్మీగణపతి హోమం, గరిక పూజ నిర్వహించారు. అర్చకులు స్వామిని వివిధ పుష్పాలతో సుందరంగా అలంకరించారు. స్వామికి మహా నివేదన చేశారు. సాయంత్రం ఎనిమిది గంటలకు విశేష సేవలు చేసి ఆలయ తలుపులు వేశారు. స్వామికి ఒక జంట పంచామృతాభిషకం నిర్వహించారు. అలాగే లఘున్యాస ఏకాదశ రుద్రాభిషేకాల్లో 46 మంది భక్త దంపతులు పాల్గొన్నారు. 16 మంది భక్తులు లక్ష్మీగణపతి హోమం నిర్వహించారు. 13 మంది చిన్నారులకు అక్షరాభ్యాసం చేశారు. ఆరుగురికి తులాభారం, ఎనిమిది మందికి అన్నప్రాశన, ఒక చిన్నారికి నామకరణం చేశారు. 24 మంది వాహన పూజలు చేయించుకున్నారు. 1694 మంది స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారు. ఆదివారం ఒక్క రోజు స్వామికి వివిధ పూజా టిక్కెట్లు, అన్నదాన విరాళాలు ద్వారా రూ.2,04,450 ఆదాయం లభించినట్లు ఆలయ ఈఓ, అసిస్టెంట్ కమీషనర్, ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు.


