కడియం: కడియపులంకలో ప్రభుత్వ ఆసుపత్రి నిర్మిస్తున్న స్థలంలోని నల్లమట్టిని రాత్రికి రాత్రే కొంతమంది దోచుకుపోయారు. ‘అడ్డగోలు దోపిడీ’ శీర్షికన మార్చి 14న ప్రచురించిన కథనం ద్వారా ఇక్కడ జరుగుతున్న మట్టి దోపిడీని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. అప్పటి నుంచీ ఇటువైపు తొంగి చూడని అక్రమార్కులు శుక్రవారం ఒక్కసారిగా చెలరేగిపోయారు. రాత్రికి రాత్రే దాదాపు రూ.3 లక్షల విలువైన మట్టిని 60కి పైగా ట్రాక్టర్లతో తరలించుకుపోయారని స్థానిక రైతులు చెబుతున్నారు. కడియపులంకకు చెందిన అన్నందేవుల రామసూర్య సీతామహాలక్ష్మి రూ.కోట్ల విలువైన 80 సెంట్ల భూమిని గ్రామ పంచాయతీకి దానంగా ఇచ్చి, అందులో ప్రభుత్వ ఆసుపత్రి నిర్మించాలని కోరారు. ఈ మేరకు ఇక్కడ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో నల్లమట్టిని దోచుకుని, ఇసుకతో నింపే ప్రయత్నాలను కొందరు స్థానిక నాయకులు ప్రారంభించారు. దీనిపై మీడియా దృష్టి పెట్టడంతో కొన్నాళ్లు మిన్నకుండిపోయారు. ఇప్పుడు హఠాత్తుగా ఈ మట్టిని మాయం చేయడం వెనుక మండలంలోని ప్రముఖ నాయకుల హస్తం ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మట్టి మాయమైందంటూ ఆసుపత్రి నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్న సైట్ సూపర్‌వైజర్ కడియం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దాత ఇచ్చిన స్థలంలో మట్టిని మాయం చేయడంపై మండల వ్యాప్తంగా తీవ్ర చర్చ నడుస్తోంది. సంబంధిత అధికారులు దీనిపై దృష్టి పెట్టి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.


