అనపర్తి: స్థానిక పాత ఊరిలో కొలువైన పార్వతీ సమేత ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో అమ్మవారికి దాతలు సుమారు మూడు కిలోల వెండి వీణను సమర్పించారు. గ్రామానికి చెందిన పడాల నాగమోహనరెడ్డి, అలేఖ్యాదేవి దంపతులు తమ కుమార్తె నధిర కైవల్యతో కలసి ఈ వీణను అర్చకులు కామేష్‌శర్మ సోదరులకు శనివారం అందజేశారు. ప్రత్యేక పూజల అనంతరం ఈ వీణను అమ్మవారికి అలంకరించారు.
‘నిమ్మ’దించిన ధర
దేవరపల్లి: మొన్నటి వరకూ మార్కెట్లో ఎగసిన నిమ్మకాయల ధర వారం రోజులుగా తగ్గుముఖం పట్టింది. గత నెలలో కిలో నిమ్మకాయల ధర రూ.130 నుంచి రూ.150 వరకూ పలికింది. ఇది మరింత పెరిగి రూ.180కి చేరుతుందని రైతులు ఆశ పడ్డారు. కానీ, వారి ఆశలపై నీల్లు జల్లేలా వారం రోజులుగా యాదవోలు మార్కెట్లో ధర దిగజారింది. ప్రస్తుతం కిలో నిమ్మకాయల ధర రూ.50 నుంచి రూ.60 వరకూ మాత్రమే పలుకుతోంది. ధర సగానికి పైగా తగ్గిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కనీస ధర కిలోకు రూ.100 ఉంటే గిట్టుబాటు అవుతుందని అంటున్నారు. కాయల నాణ్యత, సైజు తగ్గడంతో రసం రావడం లేదని, దీంతో మార్కెట్లో ధర తగ్గినట్టు వ్యాపారులు చెబుతున్నారు. ఈ నెలతో నిమ్మకాయల సీజన్ ముగుస్తుంది. ప్రస్తుతం యాదవోలు మార్కెట్‌కు రోజుకు 10 టన్నుల కాయలు అమ్మకానికి వస్తున్నాయి. ఈ ఏడాది దిగుబడులు తగ్గగా, మార్కెట్లో ధర కూడా లేకపోవడం వల్ల కౌలు సొమ్ము కూడా రాని పరిస్థితి ఏర్పడిందని కౌలు రైతులు ఆవేదన చెందుతున్నారు.
రీ వెరిఫికేషన్ దరఖాస్తుకు
7 వరకు అవకాశం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): పదో తరగతి పరీక్ష ఫలితాల్లో అనుమానాలున్న విద్యార్థులు రీ వెరిఫికేషన్, రీకౌంటింగ్‌కు ఈ నెల ఏడో తేదీ వరకూ దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా విద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు తమతమ పాఠశాలల లాగిన్ల ద్వారా దరఖాస్తులు సమర్పించాలన్నారు. ప్రతి సబ్జెక్టుకు రీకౌంటింగ్‌కు రూ.500, రీవెరిఫికేషన్‌కు రూ.1,000 చొప్పున చెల్లించాలన్నారు. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీఎస్‌ఈ.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్‌సైట్ ద్వారా డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ ద్వారా మాత్రమే చెల్లించాలన్నారు. సీఎఫ్‌ఎంఎస్ సిటిజన్ చలాన్ ద్వారా చేసే చెల్లింపులు అంగీకరించరని స్పష్టం చేశారు. పునఃపరిశీలనకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల జవాబు పత్రాలు పాఠశాల లాగిన్లలో మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటాయన్నారు. అదనంగా జవాబు పత్రాల స్కాన్ చేసిన కాపీలు వాట్సాప్ గవర్నెన్స్ మన మిత్ర సేవ 95523 00009 ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మరిన్ని వివరాలకు సంబంధిత అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని వాసుదేవరావు సూచించారు.
దూసుకొచ్చిన మృత్యువు
క్వారీ లారీ ఢీకొని యువకుడి దుర్మరణం
కపిలేశ్వరపురం (మండపేట): క్వారీ లారీ ఢీకొని ఓ యువకుడు దుర్మరణం పాలైన ఘటన ద్వారపూడిలో చోటు చేసుకుంది. మండపేట రూరల్ పోలీసులు శనివారం తెలిపిన వివరాల ప్రకారం.. ద్వారపూడికి చెందిన సయ్యపురెడ్డి సతీష్ (29) అనపర్తిలోని పెట్రోలు బంకులో పని చేస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం విధులు ముగించుకుని పీరా రామచంద్రపురంలోని స్నేహితుడి ఇంటికి వెళ్లాడు. అక్కడి నుంచి ద్విచక్ర వాహనంపై అర్ధరాత్రి ద్వారపూడిలోని ఇంటికి వెళ్తూండగా పీరా రామచంద్రపురం వైపు వెళ్తున్న క్వారీ లారీ ఎదురుగా దూసుకుని వచ్చి అతడిని ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్ర రక్తస్రావమైన సతీష్ అక్కడిక్కడే మృతి చెందారు. సతీష్‌కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. సతీష్ తండ్రి నారాయణ ఫిర్యాదు మేరకు ఎస్సై వి.కిశోర్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.


