● అంగన్‌వాడీ కేంద్రాలకు పొరుగు
రాష్ట్రాల్లో ఇప్పటికే సెలవులు
● మన రాష్ట్రంలో సెలవులివ్వని సర్కారు
● మండుటెండల్లో చిన్నారుల ఇబ్బందులు
రాజమహేంద్రవరం రూరల్: భానుడి భగభగలతో చిన్నాపెద్దా అల్లాడిపోతున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావాలంటే భయపడిపోతున్నారు. ఉదయం 10 గంటలకే ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఈ పరిస్థితుల్లో గత నెల 24 నుంచి జూన్ 11వ తేదీ వరకూ అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు విద్యా శాఖ సెలవులు ప్రకటించింది. జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. కానీ, ముక్కుపచ్చలారని 3 నుంచి ఆరేళ్ల చిన్నారులుండే అంగన్‌వాడీ కేంద్రాలకు మాత్రం చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటి వరకూ సెలవులు ప్రకటించకలేదు. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటకలు అంగన్‌వాడీ కేంద్రాలకు ఇప్పటికే సెలవులు ప్రకటించాయి. మన రాష్ట్రంలో మాత్రం సర్కారు నిర్లక్ష్యం పుణ్యమా అని పసి పిల్లలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ పరిస్థితిపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
ఒంటిపూట అయినా ఇబ్బందే..
ఐసీడీఎస్ పరిధిలో జిల్లాలోని 8 సెక్టార్లలో 1,798 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. వీటిల్లో మూడు నుంచి ఆరేళ్లలోపు పిల్లలు 27,760 మంది విద్యనభ్యసిస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటించని ప్రభుత్వం.. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ ఒంటిపూట నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో, అంగన్‌వాడీ కేంద్రాలకు వస్తున్న తమ పిల్లలను తిరిగి 12 గంటల తరువాత దూరంగా ఉన్న ఇళ్లకు మండుటెండలో తల్లులు నడుచుకుంటూ తీసుకువెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. దీనికి తోడు పలు కేంద్రాలు అద్దె భవనాలు ఇరుకై న భవనాల్లో ఉన్నాయి. ఆ ఇరుకు గదుల్లో చిన్నారులతో పాటు సిబ్బంది సైతం అల్లాడిపోతున్నారు. దీంతో, చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు అనారోగ్యానికి గురవుతారేమోననే భయంతో అంగన్‌వాడీ కేంద్రాలకు పంపించడానికి ఇష్టపడటం లేదు. ఫలితంగా 50 శాతానికి పైగా చిన్నారులు హాజరు కావడం లేదు. అంగన్‌వాడీ కార్యకర్తలకు, హెల్పర్లకు 15 రోజుల చొప్పున ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ప్రస్తుతం మొదట హెల్పర్లు సెలవు తీసుకుంటున్నారు.
సెలవులుండవు
అంగన్‌వాడీ కేంద్రాలకు ఎప్పుడూ సెలవులుండవు. ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నప్పటికీ తల్లిదండ్రులు తగు జాగ్రత్తలతో తమ పిల్లలను అంగన్‌వాడీ కేంద్రాలకు తీసుకువస్తారు. హాజరు శాతం తగ్గినప్పటికీ న్యూట్రిషన్ పంపిణీకి అంగన్‌వాడీ కేంద్రాలు ఉండాలి. కార్యకర్తలకు, హెల్పర్లకు 15 రోజుల చొప్పున సెలవులు ఇస్తారు. ఈ మేరకు జీఓ వచ్చింది.
– కె.నాగలక్ష్మి, జిల్లా ఇన్‌చార్జి సీ్త్ర,
శిశు సంక్షేమ సాధికారత అధికారి


