● పొగాకు కొనుగోళ్లు ఇంకెప్పుడు?
● రైతుల వద్ద వందల టన్నుల నిల్వ
● వెంటనే ప్రారంభించకుంటే పోరాటమే
● వైఎస్సార్ సీపీ నేత జక్కంపూడి రాజా
సాక్షి, రాజమహేంద్రవరం: నల్లరేగడి నేలల్లో (బ్లాక్ సాయిల్ – బీఎస్) రైతులు సాగు చేస్తున్న పొగాకు కొనుగోళ్లు వెంటనే ప్రారంభించాలని వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరం ప్రకాష్ నగర్‌లోని తన కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. బీఎస్ పొగాకు రైతులపై చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఏటా మార్చి 15 నుంచి 30వ తేదీలోగా వేలం కేంద్రాల్లో బీఎస్ పొగాకు కొనుగోలు చేసేవారని, ఈ ఏడాది మే మొదటి వారం వచ్చినా ఇప్పటి వరకూ కొనుగోలు ప్రక్రియ ప్రారంభించకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. దీంతో, రైతులు ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తోందన్నారు. బీఎస్ పొగాకు బ్యారన్లు సుమారు 900 ఉన్నాయని, వీటి పరిధిలో సుమారు 3 వేల ఎకరాల్లో రైతులు పొగాకు సాగు చేస్తున్నారని, 5 వేల మంది ఉపాధి పొందుతున్నారని చెప్పారు. రైతుల వద్ద రూ.కోట్ల విలువైన సుమారు 2 మిలియన్ టన్నుల పొగాకు నిల్వలు ఉన్నాయన్నారు. సుమారు 50 రోజులుగా పొగాకు నిల్వ ఉండిపోవడంతో నాణ్యత దెబ్బ తింటుందని, ఎండల తీవ్రతకు తరుగు వస్తుందని రైతులు గగ్గోలు పెడుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని రాజా దుయ్యబట్టారు. అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టిన రైతులు నెలల తరబడి వడ్డీలు కట్టలేక సతమతమవుతున్నారన్నారు. ఎకరా పొగాకు సాగుకు అన్ని ఖర్చులూ కలిపి రూ.2.50 లక్షల నుంచి రూ.2.70 లక్షల వరకు పెట్టుబడులు పెట్టారని చెప్పారు. ఇప్పటి వరకూ కొనుగోలు ప్రక్రియ ప్రారంభించకపోవడంతో రైతులు దిక్కు తోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. కర్ణాటకలోని మైసూరులో కొనుగోళ్లు పూర్తి చేసిన అనంతరం జూన్‌లో దేవరపల్లిలో నల్లరేగడి పొగాకు కొనుగోలు ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. గతంలో పొగాకు రైతుల ఇబ్బందులను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి మార్క్‌ఫెడ్ ద్వారా 2 మిలియన్ టన్నుల పొగాకును కొనుగోలు చేయించిన ఘనత వైఎస్సార్ సీపీదేనని గుర్తు చేశారు. బీఎస్ పొగాకు కొనుగోళ్లను తక్షణం ప్రారంభించకపోతే రైతుల పక్షాన పోరాడతామని రాజా హెచ్చరించారు.


