సాక్షి, రాజమహేంద్రవరం: కూటమి నేతృత్వంలోని ఇసుక మాఫియా కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పటికే ర్యాంపులు దక్కించుకుని అడ్డగోలు దోపిడీకి పాల్పడుతున్న మాఫియా లారీల నుంచి అదనపు వసూళ్లకు అర్రులు చాస్తోంది. మామూళ్లు ఇవ్వని లారీలపైకి అధికారులను ఉసిగొలుపుతున్నారు.
ఇదీ సంగతి..
కొవ్వూరు, తాళ్లపూడి మండలాల్లో సుమారు 20 వరకు ఇసుక ర్యాంపులున్నాయి. ఇందులో 7 ఓపెన్ రాంపులు, 13 బోట్స్ మెన్ సొసైటీకి చెందినవి. ప్రస్తుతం వాడపల్లి, ఔరంగాబాదు, కొవ్వూరు, దొంగగుంట రేవు, కుమారదేవం, తాళ్లపూడిలో ఇసుక తవ్వకాలు సాగుతున్నాయి. నియోజకవర్గంలోని రాంపులన్నీ టీడీపీలోని ఓ కీలక నేత కనుసన్నల్లో నడుస్తున్నాయి. వీరికి ఓ ప్రజాప్రతినిధి సహకారం ఉండటంతో అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. దొంగగుంట రేవు వద్ద అనధికార డ్రెడ్జింగ్ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. కొవ్వూరు, తాళ్లపూడి ర్యాంపుల నుంచి నిత్యం 400లకు పైగా లారీల ఇసుక ఇతర ప్రాంతాలకు తరలుతున్నట్లు సమాచారం. కొన్ని ర్యాంపుల్లో బోట్స్‌మెన్ సొసైటీల ముసుగులో ఈ దందా సాగుతున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం నిర్దేశించిన ధరలు కాదని తమకు తోచినట్టు ఇసుక అమ్మి రూ.లక్షలు దండుకుంటున్నారు. 20 టన్నుల లారీ ఇసుక రూ.2,900కు విక్రయించాల్సి ఉండగా.. డిమాండ్‌ను బట్టి రూ.6 వేల నుంచి రూ.7 వేలకు ఇస్తున్నారు. కొవ్వూరు నియోజకవర్గం కుమారదేవం ఓపెన్ రీచ్‌లో నిత్యం వందలాది లారీల్లో ఇసుక అక్రమంగా తరలుతోంది. నియోజకవర్గ కేంద్రం, ఆర్డీఓ స్థాయి అధికారులు ఉన్నా.. అక్రమాలపై పర్యవేక్షణ పెట్టకపోవడం ఏంటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
భారీగా జరిమానాలు
అక్రమ దందా చాలదన్నట్లు లారీల నుంచి అక్రమ వసూళ్లకు అర్రులు చాస్తున్నట్లు ఆరోపణలున్నాయి. టన్ను ఇసుకకు రూ.50 చొప్పున 20 టన్నుల లారీ నుంచి అదనంగా మరో రూ.వెయ్యి వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఈ మొత్తం చెల్లించని లారీలపై ఇసుక మాఫియా, కూటమి నేతలు, ప్రజాప్రతినిధులు కక్ష గడుతున్నారు. చెల్లించని పక్షంలో అధికారులకు ఆ లారీల సమాచారం చేరవేస్తున్నారు. రంగంలోకి దిగుతున్న అధికారులు వారిని వెంబడించి మరీ తనిఖీలు చేస్తున్నారు. నిబంధనల మేరకు ఒక్కో లారీకి 20 టన్నుల ఇసుకను టాప్ దాటకుండా నింపాల్సి ఉంది. అధిక లోడ్‌తో వెళుతున్న లారీలపై జరిమానా వేయాల్సి ఉంది. కానీ ఇక్కడ అందుకు విరుద్ధంగా కూటమి నేతలు, ప్రజా ప్రతినిధులకు టన్నుకు రూ.50 ఇవ్వని వసూలు చేస్తున్నారు. కొన్ని లారీలు నిబంధనల మేరకే ఇసుక తరలిస్తున్నా.. తమకేమీ పట్టనట్లు ఇష్టానుసారంగా జరిమానా వేసేస్తున్నారు. ఒక్కో లారీకి ఒకసారి పట్టుబడితే రూ.20 వేల నుంచి రూ.40 వేల వరకు ఫైన్ రూపంలో వసూలు చేస్తున్నట్లు సమాచారం. దీంతో తాము నెలంతా సంపాదించుకున్న మొత్తం ఒక్క ఫైన్‌తోనే కోల్పోతున్నామని లారీల యజమానులు ఆవేదన చెందుతున్నారు. నెల రోజుల వ్యవధిలో ఇలా రూ.లక్షల్లో జరిమానాల రూపంలో వసూలు చేసినట్లు సమాచారం. సీఎం చంద్రబాబు మాత్రం ఇసుక పాలసీ పారదర్శకంగా సాగుతోందని, ఎలాంటి మామూళ్లు ఇవ్వాల్సిన అవసరం లేదని చేస్తున్న ప్రకటనలకు.. క్షేత్ర స్థాయిలో జరుగుతున్న తంతుకు భారీ వ్యత్యాసం కనిపిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కొవ్వూరు మండలం
రోడ్ కం రైలు వంతెన వద్ద ఇసుక తవ్వకాలు (ఫైల్)
ఇసుకను లారీల్లో లోడు చేస్తున్న నిర్వాహకులు
కూటమి నేతల కనుసన్నల్లో
ఇసుక అక్రమ దందా
అది చాలదన్నట్లు అదనపు వసూళ్లు
టన్నుకు రూ.50 ఇవ్వాలని డిమాండ్
లారీకి రూ.వెయ్యి వసూలు
కొవ్వూరు, తాళ్లపూడి ఇసుక
ర్యాంపులలో రెచ్చిపోతున్న మాఫియా
గగ్గోలు పెడుతున్న లారీల యజమానులు
నిఘాపై నిర్లక్ష్యం?
ఇసుక రీచ్‌ల వద్ద నిఘా ఉండటం లేదు. సీసీ కెమెరాలతో పాటు, అధికారుల పర్యవేక్షణ సక్రమంగా లేకపోవడం ఇసుక మాఫియాకు వరంగా మారుతోంది. ఒకవేళ ఉన్నా.. మామూళ్ల మత్తులోపడి మిన్నకుండిపోతున్నారన్న ఆరోపణలున్నాయి. గత కలెక్టర్ హయాంలో ఇసుక అక్రమాలపై ఉక్కుపాదం మోపారు. ఎప్పుడు వచ్చి అధికారులు పట్టుకుంటారో అన్న భయం ఉండేది. ప్రస్తుత కలెక్టర్ కొత్తగా రావడం.. ఈ దందాపై వ్యవస్థపై అవగాహన లేకపోవడంతో పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేదన్న వాదన ప్రజల నుంచి వినిపిస్తోంది.


