కాంట్రాక్టు కార్మికులకు అండగా వైఎస్సార్‌ సీపీ | - | Sakshi
Sakshi News home page

కాంట్రాక్టు కార్మికులకు అండగా వైఎస్సార్‌ సీపీ

May 2 2026 7:32 AM | Updated on May 2 2026 7:32 AM

కడియం: మండలంలోని మాధవరాయుడుపాలెం పరిధిలోని ఏపీ పేపర్‌మిల్లు కాంట్రాక్టు కార్మికులకు అండగా తమ పార్టీ ఉంటుందని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. శుక్రవారం ఆయన పార్టీ నాయకులతో కలసి కార్మికుల దీక్షా శిబిరాన్ని సందర్శించి, మద్దతు తెలిపారు. వేణు మాట్లాడుతూ అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయవలసిన రోజున రిలే నిరాహార దీక్షకు మద్దతుగా రావడం బాధాకరమన్నారు. రెండు రోజుల్లో యాజమాన్యం పరిష్కారం చూపకపోతే, కార్మికులకు మద్దతుగా తానే శిబిరంలో కూర్చుంటానన్నారు. పలువురు కార్మికులు మాట్లాడుతూ తమ ఇబ్బందులను వేణు దృష్టికి తీసుకువచ్చారు. చాలీచాలని జీతాలతో పనిచేయలేక ఇప్పటి వరకు 18 మంది కార్మికులు ఉద్యోగాలను విడిచిపెట్టి వెళ్లిపోయారన్నారు. వారికి రావాల్సిన గ్రాట్యుటీ ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకొక్కరికి రూ.70 వేల వరకు అందాల్సి ఉందన్నారు. అయితే యాజమాన్యంగానీ, లేబర్‌ కాంట్రాక్టర్లు గానీ ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదన్నారు. లేబర్‌ కాంట్రాక్టర్ల ఆగడాలు కూడా అధికమయ్యాయని, మహిళలని కూడా చూడకుండా ఇబ్బందులు పెడుతున్నారని పలువురు మహిళా కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి గిరిజాల బాబు, కడియం మండలం పార్టీ అధ్యక్షులు యాదల సతీష్‌చంద్రస్టాలిన్‌, కడియపు సావరం మాజీ సర్పంచ్‌ సాపిరెడ్డి, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

పేపర్‌ మిల్లు లాకౌట్‌

కడియం: మాధవరాయుడుపాలెం పంచాయతీ పరిధిలోని ఏపీ పేపర్‌ మిల్లు లాకౌట్‌ ప్రకటించింది. శుక్రవారం రాత్రి 10 గంటలకు సీ షిఫ్టుకు హాజరయ్యే కార్మికులను విధులకు హాజరు కాకుండా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకుని గేటు వద్ద లాకౌట్‌ నోటీసును అంటించారు. కార్మికుల అక్రమ సమ్మె నేపథ్యంలో మిల్లుకు ఆర్థిక నష్టాల సంభవిస్తున్నందున లాకౌట్‌ విధిస్తున్నట్లు నోటీసులో పేర్కొన్నారు. అత్యవసర సేవలు మినహా మిల్లు లాకౌట్‌లోకి వెళుతుందని తెలిపారు. కాగా నిబంధనల ప్రకారం పర్మెనెంట్‌ కార్మికులకు ముందుగానే లాకౌట్‌ నోటీసు ఇవ్వాలని, కానీ నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి లాకౌట్‌ ప్రకటించడం దారుణమని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్మిక సంఘం నాయకులు టి.అరుణ్‌ అక్కడికి చేరుకుని ఆందోళన చేస్తున్న కార్మికులకు మద్దతుగా నిలిచారు.

Advertisement
 
Advertisement
Advertisement