కొత్తపేట: మండలంలో ప్రస్తుత రబీ సీజన్‌లో మొక్కజొన్న పంటను ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేయాలనే రైతుల విజ్ఞప్తిని ఉన్నతాధికారుల ద్వారా ప్రభుత్వానికి నివేదించామని మండల వ్యవసాయ అధికారి కె.ద్వారకాదేవి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ 2.400కు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో తక్కువ ధర రూ.1600కు దళారులకు అమ్ముకోవాల్సి వస్తుందని ఆ రైతుల ఆందోళనపై గత నెల 29న ‘సాక్షి’ దినపత్రికలో ‘కొనుఘెల్లు’ శీర్షికన కథనం వచ్చింది. దీనికి ఏఓ స్పందించి ఓ ప్రకటన విడుద చేశారు. కొత్తపేట మండలంలో మొత్తం 955 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేయగా, ఇందులో విత్తనం కోసం 445 ఎకరాలు, మిగతా 510 ఎకరాల్లో సాధారణ రకాలు సాగు చేశారని పేర్కొన్నారు. 510 ఎకరాల సాధారణ రకాల సాగుకు గాను ఇప్పటి వరకూ 370 ఎకరాల పంట కోతలు పూర్తయ్యాయని, ఎకరాకు సుమారు 40 క్వింటాళ్ల చొప్పున 14,800 క్వింటాల దిగుబడి వచ్చిందన్నారు. ఈ మొక్కజొన్న కొనుగోలుకు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతులు చేసిన విజ్ఞప్తిని ఉన్నతాధికారులకు తెలిపామన్నారు.


