ఘటనలు ఎన్నో..
ప్రత్తిపాడు మండలం ధర్మవరంలో జనవరి 27న క్రూడ్ ఆయిల్, జంతువుల కొవ్వును మరగబెట్టి తయారు చేసిన 56 డబ్బాల్లోని నూనెను, 4 క్రూడ్ ఆయిల్ డబ్బాలను పట్టుకుని తొమ్మిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2025 ఫిబ్రవరి 20న అమలాపురంలోని రెస్టారెంట్లు, హోటళ్లు, బేకరీలను ఆహార భద్రత తనిఖీ అధికారులు పరిశీలించి రూ. 1.30 లక్షల అపరాధ రుసుం విధించారు. 2025 ఫిబ్రవరి 17న ఆత్రేయపురంలో దుకాణాలపై ఆహార నియంత్రణాధికారులు దాడులు చేసి, కంపెనీ పేరు లేని 150 కిలోల నెయ్యి ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 2025లో 145 దుకాణాలను తనిఖీ చేయగా 13 కేసులు, కాకినాడ జిల్లాలో 2025లో 240 చోట్ల సేకరించిన 198 నమూనాలను పరీక్షించగా, 38 నమూనాల్లో కల్తీ నిర్ధారణ అయ్యి 9 కేసులు మాత్రమే నమోదయ్యాయి.
ఫ అన్నింటా కల్తీ చేస్తున్న మాయగాళ్లు
ఫ ప్రజలకు ఆరోగ్య సమస్యలు
ఫ ఉమ్మడి జిల్లాలో కలవరపెడుతున్న
ఘటనలు
కపిలేశ్వరపురం: ఆరోగ్యమే మహాభాగ్యమని పెద్దలు అంటారు. అలాంటి ఆరోగ్యానికి నాణ్యమైన ఆహారం అవసరం. అయితే బయట కొని తెచ్చే ప్రతి సరకులోనూ కల్తీ జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. జాతీయ ఆహార భద్రత సూచీలో రాష్ట్రం 28వ స్థానానికి పడిపోవడం దీనికి ఉదాహరణగా నిలుస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలో 7,29,658, కాకినాడలో 7,23,855, కోనసీమ జిల్లాలో 4,90,075 కుటుంబాలు ఉండగా, పోలవరం జిల్లాలో 3,49,799 మంది జనాభా ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో 1.60 లక్షల పాల కేంద్రాలు నిర్వహిస్తున్నారు. కాకినాడ జిల్లాలో 352 రెస్టారెంట్లు, 635 బేకరీలు, 340 పానీపూరి బండ్లు, 2,150 ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, 170 పాల విక్రయ కేంద్రాలు, 300 చికెన్ సెంటర్లు ఉన్నాయి. కోనసీమ జిల్లా అమలాపురం పట్టణం, సమీప గ్రామాల్లో 120 ఫాస్ట్‌ఫుడ్ బండ్లు ఉన్నాయి. చాలా చోట్ల కల్తీ సరకుల విక్రయాలు చాపకింద నీరులా సాగుతోంది.
ఇలా చేసి.. ముంచేసి
ఫ వంట నూనెల్లో జంతు కొవ్వును కలిపి కల్తీ చేస్తున్నారు. వేడి చేయకుండా ఎలాంటి రసాయనాలు కలపకుండా తయారు చేసే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ మంచిది.
ఫ పాలను యూరియా, సబ్బు, కాస్టిక్ సోడా వంటి రసాయనాలతో కల్తీ చేస్తున్నారు. ఇలా ప్రజారోగ్యంతో ఆటలాడుతున్నారు.
ఫ వేసవిలో ఐస్ క్రీమ్, పండ్ల రసాలు, లస్సీలతో పాటు మత్స్య ఉత్పత్తుల ప్యాకింగ్ కోసం ఐస్ వాడతారు. ఐస్ తయారీలో తుప్పు పట్టిన బాక్స్‌లు, సురక్షితం కాని నీటిని వాడితే అనారోగ్యం. నీటిలోని మలినాలను తొలగించేందుకు రివర్స్ ఆస్మాసిస్ వ్యవస్థ ఐస్ ఫ్యాక్టరీలో లేకపోతే జాగ్రత్త పడాలి.
ఫ టీ పౌడర్ పరిమాణం పెంచేందుకు కొబ్బరి పీచు, తదితర వాటిని కలుపుతారు. 2018 మార్చి 23న రాజమహేంద్రవరంలోని ఓ హోల్‌సేల్ దుకాణంలో అప్పటి విజిలెన్స్ ఎస్పీ రెడ్డి గంగాధరరావు నకిలీ టీ పౌడర్‌ను పట్టుకున్నారు.
ఫ పైపులైన్లు డ్రైన్లలో ఉండడంతో తాగునీరు కల్తీ అవుతోంది. నీటిని శుద్ధి చేసి వినియోగించాలి.
కల్తీ తెలుసుకుందాం..
ఫ చిన్న గాజు గిన్నెలో ఒక టేబుల్ స్ఫూన్ నెయ్యిని వేసి రెండు చుక్కలు అయోడిన్ ఉప్పు కలిపినప్పుడు నెయ్యి నీలం రంగులోకి మారితే పిండి పదార్థాలను కలిపి కల్తీ చేసినట్టు లెక్క. ఒక స్ఫూన్ నెయ్యిలో కొంచెం చక్కెర కలిపి వేడి చేస్తే ఎరుపు లేదా పింక్ రంగులోకి మారిందంటే నెయ్యిలో వనస్పతి, పామాయిల్ వంటి నూనెలు కలిపి కల్తీ చేసినట్టు.
ఫ పాలను విరగగొట్టేందుకు నిమ్మ రసమో, వెనిగర్ వేయడం సహజమైన పద్ధతి. దానికి భిన్నంగా పామాయిల్ లాంటి వెజిటబుల్ ఆయిల్స్, స్టార్చ్‌లు కలుపుతారు. బాగా మరిగించిన నీళ్లలో పన్నీర్ ముక్కలు వేసి బెటాడిన్, లేదా అయోడిన్ చుక్కలు వేసినప్పుడు రంగు మారితే కల్తీదని అర్థం.
ప్రభుత్వమే బాధ్యత వహించాలి
రాజమహేంద్రవరంలో కల్తీ పాలు తాగిన కారణంగా మా మావయ్య కడలి కృష్ణారావు చనిపోయారు. వ్యక్తిగా, కుటుంబ పరంగా ఎలాంటి తప్పులూ చేయకపోయినా, మంచి వ్యక్తి దూరం అయ్యారు. కల్తీ పాల మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి.
–సూరంపూడి సత్యప్రసాద్, మండపేట
సమాచారం ఇవ్వండి
కల్తీ జరిగినట్లు తెలిస్తే ప్రభుత్వం ప్రకటించిన 1800 425 3857, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ హెడ్ ఆఫీస్ నంబరు 08645 297245 నంబర్లకు సమాచారాన్ని తెలపవచ్చు.


