గుండెపోటుతో ఉపాధి కూలీ మృతి | - | Sakshi
Sakshi News home page

గుండెపోటుతో ఉపాధి కూలీ మృతి

May 2 2026 7:32 AM | Updated on May 2 2026 7:32 AM

కొత్తపేట: జాతీయ ఉపాధి హామీ పథకం కింద కాలువలో పూడికతీత పనులు చేస్తూ ఉపాధి కూలీ మృతి చెందినట్టు ఏపీఓ ఎన్‌.ఆనంద్‌కుమార్‌ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. అవిడి పంచాయతీ పరిధి గోరింక డ్రైన్‌ సమీపంలో ఐదు రోజులుగా 165 మంది కాలువ పనులు చేస్తున్నారు. ఇక్కడ అవిడి పెదపేటకు చెందిన గోసంగి నరసమ్మ (55) పనిచేస్తుంది. కాగా శుక్రవారం పనిచేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే ఉపాధి సిబ్బంది, సహచరులు కొత్తపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, ఉపాధి పథకం పీడీ మహేష్‌ కుమార్‌, ఎంపీడీఓ పీఎస్‌ మహేష్‌కుమార్‌లు ఆమె మృతదేహాన్ని సందర్శించి, కూలీ వివరాలు అడిగి తెలుసుకున్నారు.

విద్యుదాఘాతానికి...

అల్లవరం: విద్యుదాఘాతానికి గురై ఓ యువకుడు మృతి చెందిన ఘటన బోడసకుర్రులో జరిగింది. ఎస్సై సంపత్‌కుమార్‌ కథనం ప్రకారం.. బోడసకుర్రు పంచాయతీ గౌతమి నగర్‌లో ఓ వివాహ వేడుకలో అదే గ్రామానికి చెందిన సాపే శ్రీరామ్‌ (19) కరెంట్‌ పనులు నిర్వహిస్తుండగా, విద్యుత్‌ షాక్‌కు గురయ్యాడు. అపస్మారక స్థితికి చేరుకున్న అతన్ని అమలాపురంలోని ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందాడని వైద్యులు ధ్రువీకరించారు. దీనిపై కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై శుక్రవారం తెలిపారు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు. శ్రీరామ్‌ మృతదేహాన్ని వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్‌ పినిపే శ్రీకాంత్‌, మాజీ ఎంపీ చింతా అనురాధలు సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. మృతుడి కుటుంబానికి అనురాధ రూ. 10 వేల ఆర్థిక సాయం అందించారు. మాజీ సర్పంచ్‌ దొమ్మేటి శ్యాంప్రకాష్‌, చెల్లుబోయిన రమేష్‌, చొల్లంగి బా బి, సాపే ధర్మరాజు, బొంతు శ్రీను పాల్గొన్నారు.

వైభవంగా శ్రీభావనారాయణ స్వామికి శ్రీచక్ర స్నానం

కాకినాడ రూరల్‌: శ్రీరాజ్యలక్ష్మి సమేత భావనారాయణ స్వామి దివ్య కల్యాణ మహోత్సవాల్లో భాగంగా ఆరవ రోజు శుక్రవారం స్వామివారికి శ్రీ చక్రస్నానం వైభవంగా నిర్వహించారు. సర్పవరం నుంచి ఊరేగింపుగా మండల పరిధిలోని సూర్యారావుపేట సాగన తీరానికి తీసువచ్చి పూజలు అనంతరం శ్రీ చక్రస్నానం నిర్వహించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులతో సాగర తీరం సందడిగా మారగా స్వామి వారి శ్రీచక్ర స్నానం అనంతరం భక్తులు స్నానాలు ఆచరించారు. ఆలయ ఈఓ రాపాక శ్రీనివానివాసరావు, గ్రామస్తులు, అర్చకులు కిరణ్‌ పాల్గొన్నారు.

ఈఓపై జేఎస్పీ నేత ఆగ్రహం

సర్పవరం భావనారాయణ స్వామి కల్యాణోత్సవంలో భాగంగా శ్రీచక్రస్నానానికి స్వామివారిని తాను వచ్చేలోపే తీసుకెళ్లారని ఆరోపిస్తూ ఆలయ ఈఓ రాపాక శ్రీనివాసరావుపై ఆ గ్రామానికి చెందిన జేఎస్పీ నేత పుల్లా శ్రీరాములు ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్ణాహుతి కార్యక్రమం ముగించి స్వామివారిని ఊరేగింపు నిర్వహిస్తున్న తరుణంలో ఆలయానికి వచ్చిన ఆయన తాను వచ్చే వరకూ వేచి ఉండలేదంటూ ఆరోపిస్తూ ఈఓపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈఓను బదిలీ చేయిస్తానంటూ ఆయన బెదిరించడం విమర్శలకు తావిచ్చింది. ఆలయంలో దేవుని కార్యక్రమంపై జేఎస్పీ నేత పెత్తనం చేయడంపై పలువురు విమర్శలు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement