పొట్టకూటి కొచ్చి అనంతలోకాలకు.. | - | Sakshi
Sakshi News home page

పొట్టకూటి కొచ్చి అనంతలోకాలకు..

May 2 2026 7:32 AM | Updated on May 2 2026 7:32 AM

విద్యుదాఘాతానికి ఇద్దరు కూలీల మృతి

మృతులు రాష్ట్రానికి చెందిన వారు

కరప: ఊరికాని ఊరొచ్చారు.. పొట్టకూటి కోసం చెమట చిందిస్తున్నారు.. ఇంతలో అనుకోని ప్రమాదం మృత్యు కుహరంలోకి లాగేసింది. ఇటుకల బట్టీలో విద్యుదాఘాతానికి ఇద్దరు కూలీలు మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. కరప పోలీసుల కథనం ప్రకారం.. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో లట్టులీ గ్రామానికి చెందిన 8 మంది కూలీలు కరప మండలం వలసపాకల గ్రామంలోని ఇటుక బట్టీలో పని చేస్తున్నారు. శుక్రవారం ఉదయం 5 గంటలకు పార్వతీ విశ్వకర్మ, భూపేంద్రకుమార్‌, మారుద్వాజ్‌ పాయికర్‌, భీమ్‌సింగ్‌, విశ్వకర్మలు బట్టీలో ఇటుకలు తయారు చేసే మెషీన్‌ వద్ద పనిచేస్తున్నారు. సదరు మెషీన్‌ లాగుతుండగా అది ప్రమాదవశాత్తూ అక్కడ లైటింగ్‌ కోసం ఏర్పాటు చేసిన ఐరన్‌ పోల్‌కు తగిలింది. దీనివల్ల కరెంట్‌ స్తంభానికి ఉన్న విద్యుత్‌ తీగల కారణంగా ఆ ముగ్గురు కూలీలు విద్యుదాఘాతానికి గురయ్యారు. వెంటనే సదరు ఆ ముగ్గురినీ చికిత్స కోసం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలిచారు. వైద్యులు పరీక్షించి పార్వతీ విశ్వకర్మ, భూపేంద్రకుమార్‌ మృతి చెందినట్టు ధ్రువీకరించారు. పాయికర్‌కు స్వల్ప గాయాలవ్వగా చికిత్స పొందుతున్నాడు. కరప ఎస్‌ఐ టి.సునీత, విద్యుత్‌ శాఖ ఏఈ సానా ఈశ్వరిప్రసాద్‌ ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కరప ఎస్సై కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement