కాకినాడ క్రైం: స్థానిక జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న ఓ పసిపాపను రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యులు శుక్రవారం పరిశీలించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో మూడు నెలల అనాథ బాలిక చైత్రను తల్లిదండ్రులు నడిరోడ్డుపై వదిలేశారు. ఈ విషయం పోలీసులకు చేరడంతో వారు పాపను చేరదీసి మహిళా శిశు సంక్షేమ శాఖకు చెందిన శిశు గృహలో అప్పగించారు. గత నెల 1 నుంచి అమలాపురం శిశుగృహలో సంరక్షణ పొందుతున్న శిశువు తీవ్ర అనారోగ్యానికి గురైంది. సిబ్బంది స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చిన్నారి గుండెకు రంధ్రం ఉందని, ఇన్‌ఫెక్షన్ చేరి ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయని, ఆయాసంతో బాధపడుతోందని వైద్యులు గుర్తించారు. ఈ నేపథ్యంలో మెరుగైన వైద్యం కోసం కాకినాడ జీజీహెచ్‌కు సిఫార్సు చేశారు. గురువారం సాయంత్రం చిన్నారిని జీజీహెచ్‌కు తరలించి పీఐసీయూలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. కమిషన్ సభ్యులు డాక్టర్ కొప్పుల నాగమానస, మందాల గంగా సూర్యనారాయణలు పాపకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. కమిషన్ సభ్యుల వెంట కాకినాడ అర్బన్ సీడీపీఓ అనసూరి జ్యోతి, అంబేడ్కర్ కోనసీమ జిల్లా బాలల పరిరక్షణ విభాగం డీసీపీఓ బూల ఉమాలక్ష్మి, కాకినాడ జిల్లా బాలల పరిరక్షణ విభాగం సంరక్షణ అధికారులు జాగరపు విజయ, మాకే సుధాకర్ ఉన్నారు.


