స్వీయ నమోదులో అందరూ భాగస్వాములు కావాలి | - | Sakshi
Sakshi News home page

స్వీయ నమోదులో అందరూ భాగస్వాములు కావాలి

Apr 27 2026 7:42 AM | Updated on Apr 27 2026 7:42 AM

రాజమహేంద్రవరం సిటీ: జనగణనలో భాగంగా నిర్వహిస్తున్న స్వీయ నమోదు(సెల్ఫ్‌ ఎన్యూమరేషన్‌)లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్‌ కీర్తి చేకూరి పిలుపునిచ్చారు. దీనిపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు స్థానిక వై జంక్షన్‌ నుంచి కోటిపల్లి బస్టాండ్‌ వరకూ ఆదివారం నిర్వహించిన సెన్సస్‌ 5కే రన్‌ను కమిషనర్‌ రాహుల్‌ మీనాతో కలసి ఆమె జెండా ఊపి ప్రారంభించారు. ఈ రన్‌లో ఉద్యోగులు, యువత, వివిధ వర్గాల ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, సెల్ఫ్‌ ఎన్యూమరేషన్‌ విధానం ద్వారా పౌరులు తమ వివరాలను తాము ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే అవకాశాన్ని కల్పించారన్నారు. ఈ నెలాఖరు వరకూ స్వీయ గణన అందుబాటులో ఉంటుందన్నారు. మొబైల్‌లో క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి కూడా వివరాలు నమోదు చేసుకోవచ్చన్నారు.

జిల్లాలో 22 లక్షల మంది వివరాలను సెన్సస్‌ ఎన్యూమరేషన్‌ చేయాల్సి ఉందని చెప్పారు. ఇప్పటి వరకూ 3 శాతం మంది మాత్రమే స్వీయ నమోదు చేసుకున్నారన్నారు. రానున్న మూడు రోజుల్లో చేపడుతున్న స్వీయ నమోదులో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని కలెక్టర్‌ కీర్తి పిలుపునిచ్చారు. కమిషనర్‌ రాహుల్‌ మీనా మాట్లాడుతూ, ప్రజలు తమ మొబైల్స్‌ ద్వారా నమోదు చేసిన వివరాలను సంబంధిత ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లు క్షేత్రస్థాయిలో ధ్రువీకరిస్తారని చెప్పారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్‌ పీవీ రామలింగేశ్వర్‌, సెక్రటరీ శైలజవల్లి, జిల్లా హౌసింగ్‌ అధికారి నాతి బుజ్జి, జిల్లా క్రీడా అధికారి డీఎంఎం శేషగిరి, డీసీపీ నాయుడు, మేనేజర్‌ ఎండీ అబ్దుల్‌ మాలిక్‌ తదితరులు పాల్గొన్నారు.

బీచ్‌లో మౌలిక సదుపాయాలు కల్పించాలి

కాకినాడ రూరల్‌: సందర్శకులకు ఇబ్బందులు కలకుండా బీచ్‌లలో మౌలిక సదుపాయాల కల్పనకు అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్‌ ఎంఎన్‌ హరేంధిర ప్రసాద్‌ ఆదేశించారు. సూర్యారావుపేట బీచ్‌ను ఆదివారం ఆయన సందర్శించారు. అక్కడ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలలో పాటు ప్రస్తుతం జరుగుతున్న పనుల గురించి అధికారులు ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, బీచ్‌లో సందర్శకులకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రధానంగా తాగునీరు, మరుగుదొడ్లు, పార్కింగ్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. పారిశుధ్యం సక్రమంగా నిర్వహించాలన్నారు. భవిష్యత్తులో చేపట్టాల్సిన పనులకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.

కార్యక్రమంలో జిల్లా పర్యాటక శాఖ అధికారి లక్ష్మణరావు, మత్స్యశాఖ అధికారి కృష్ణారావు, కాకినాడ రూరల్‌ తహసీల్దార్‌ కుమారి, కాకినాడ నగరాభివృద్ధి సంస్థ అధికారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement