రాయవరం: ఇంటర్మీడియెట్ జవాబు పత్రాల మూల్యాంకనం ఈ నెల 6న ముగిసింది. దీంతో, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఫలితాల కోసం ఉత్కంఠగా నిరీక్షిస్తున్నారు. 2023 వరకూ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఇంటర్మీడియెట్ జవాబు పత్రాల మూల్యాంకనం రాజమహేంద్రవరంలో నిర్వహించేవారు. జిల్లాల పునర్విభజన అనంతరం 2024 నుంచి కొత్త జిల్లాల వారీగా మూల్యాంకనం ప్రారంభమైంది. గత ఏడాది నుంచి స్పాట్ కేంద్రంలోనే స్కానర్లు ఏర్పాటు చేసి, మార్కులను అప్‌లోడ్ చేయడం ప్రారంభించగా, ఈ ఏడాది కూడా ఈ విధానాన్ని కొనసాగించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురాల్లో నిర్వహించిన స్పాట్ వాల్యుయేషన్ సెంటర్లకు ఇంటర్ ఫస్టియర్, సెకండియర్‌కు చెందిన 6,64,900 జవాబు పత్రాలు వచ్చాయి. వీటిని 16 రోజుల పాటు నిరంతరాయంగా మూల్యాంకనం చేశారు. స్పాట్ వాల్యుయేషన్ క్యాంప్ ఆఫీసర్లుగా ఆయా జిల్లాల ఇంటర్మీడియెట్ విద్యాశాఖాధికారులు ఐ.శారద (తూర్పు గోదావరి), వి.కేశవరావు (కాకినాడ), చంద్రశేఖరబాబు (కోనసీమ) వ్యవహరించారు.
స్పాట్‌లోనే మార్కుల నమోదు
గతంలో మూల్యాంకనం అనంతరం ఓఎంఆర్ షీట్‌లోని పార్ట్–3 (మార్కులు నమోదు చేసిన షీట్) విడదీసి బండిల్స్‌గా ఇంటర్ బోర్డుకు పంపించేవారు. అక్కడ బోర్డు అధికారుల పర్యవేక్షణలో ఓఎంఆర్ షీట్ పార్ట్–3లో మార్కులను స్కాన్ చేసి, మార్కుల నమోదు అనంతరం ఫలితాలను ప్రకటించేవారు. ఈ ప్రక్రియలో ఉన్న జాప్యాన్ని తగ్గించేందుకు 2024 నుంచి ప్రతి స్పాట్ కేంద్రానికీ స్కానర్ అందజేశారు. విద్యార్థికి నష్టం జరగకుండా స్కానింగ్ అనంతరం మార్కుల నమోదును మరోసారి నిర్ధారించుకున్నారు. మూల్యాంకనం అనంతరం స్కానర్‌తో మార్కుల నమోదు ప్రక్రియను ఇక్కడే చేపట్టడం ద్వారా ఫలితాలను అత్యంత వేగంగా విడుదల చేసే ఏర్పడింది. ఈ నెల 12న ఇంటర్ పలితాలు వచ్చే అవకాశముందని అధ్యాపకులు, విద్యార్థులు భావిస్తున్నారు. అయితే, ఫలితాలు ప్రకటించే తేదీని ఇంటర్ బోర్డు అధికారులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
మూల్యాంకనం జరిగిందిలా..
రాజమహేంద్రవరం స్పాట్ వాల్యుయేషన్ కేంద్రంలో ఇంటర్ జనరల్ ఫస్టియర్ 96,529, సెకండియర్ 1,00,726, ఒకేషనల్ విభాగంలో ఫస్టియర్ 62,450, సెకండియర్ 53,103 కలిపి మొత్తం 3,12,808 జవాబు పత్రాలను మూల్యాంకనం చేశారు. కాకినాడ కేంద్రంలో 2,18,977 జవాబు పత్రాల మూల్యాంకనం జరిగింది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఫస్టియర్ 65,829, సెకండియర్ 67,286 జవాబు పత్రాలను మూల్యాంకనం చేశారు. ఈ ప్రక్రియలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా మొత్తం 2,763 మంది సిబ్బంది పాలు పంచుకున్నారు.
పూర్తి పారదర్శకంగా..
ఇంటర్మీడియెట్ జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి పారదర్శకంగా, అత్యంత వేగంగా నిర్వహించాం. జిల్లాల పునర్విభజన అనంతరం అదే జిల్లాలో స్పాట్ నిర్వహించడం వలన అన్ని క్యాడర్లపై ఒత్తిడి తగ్గింది. ఉన్నతాధికారులు నిర్దేశించిన సమయానికి మూల్యాంకన ప్రక్రియను పూర్తి చేయగలిగాం.
– ఐ.శారద, ప్రాంతీయ పర్యవేక్షకులు,
ఇంటర్మీడియెట్ బోర్డు, రాజమహేంద్రవరం
ఫ ముగిసిన ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్
ఫ జిల్లాలో 6.65 లక్షల
జవాబు పత్రాల మూల్యాంకనం
ఫ ఇక అందరి దృష్టీ ఫలితాల పైనే


