పన్ను కట్టకపోతే.. పరువు తీత! | - | Sakshi
Sakshi News home page

పన్ను కట్టకపోతే.. పరువు తీత!

Mar 31 2026 8:32 AM | Updated on Mar 31 2026 8:32 AM

పంచాయతీల్లో పన్నుల వసూళ్లకు

చంద్రబాబు ప్రభుత్వం కొత్త పంథా

పన్ను చెల్లించని ప్రజల ఇంటి

ముందు జప్తు నోటీసుల ఏర్పాటు

జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో

వెలసిన బోర్డులు

తమ పరువేం కావాలంటూ

ప్రజల ఆందోళన

వసూలు చేయని అధికారులపై

చర్యలకూ వెనకాడని వైనం

జిల్లాలో పన్నుల వసూళ్ల లక్ష్యం

రూ.120 కోట్లు

ఇప్పటికి రూ.79.99 కోట్లు వసూలు

సాక్షి, రాజమహేంద్రవరం: పంచాయతీల్లో పన్నుల వసూలుకు చంద్రబాబు సర్కారు కొత్త పంథా అనుసరిస్తోంది. పన్నుల చెల్లింపుల్లో ఆలస్యమైన, చెల్లించని వారి పరువు తీసేందుకు నిర్ణయం తీసుకుంది. పన్ను కట్టని ఇంటి వద్ద ఇంటి యజమాని పేరుతో పెద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తోంది. జప్తు నోటీసు ఇంటికి అంటిస్తోంది. అందులో ఇంటి యజమాని పేరు, ఎంత చెల్లించాలో స్పష్టం చేస్తోంది. ఈ పరిణామం గ్రామీణ ప్రాంత ప్రజల్లో ఆగ్రహావేశాలు నింపుతోంది. పన్ను చెల్లించకపోతే నోటీసు ఇచ్చి వసూలు చేయాలే తప్ప.. ఇంటి వద్దకు వచ్చి పరువు తీయడం ఎంతవరకు సమంజసమన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇలాంటి చర్యలు ఇప్పటి వరకు ఎన్నడూ చూడలేదని ఆవేదన చెందుతున్నారు. అడ్డదారుల్లో సంపద సృష్టించేందుకు ఇలాంటి పద్ధతిని అవలంబిస్తున్నారా? అన్న అనుమానం కలుగుతోంది. ఇప్పటికే మద్యం, విద్యుత్‌ సర్‌చార్జీలు పెంచడం ద్వారా రూ.కోట్లల్లో ఆదాయం గడించిన చంద్రబాబు ప్రభుత్వం.. గ్రామాల్లో పన్నుల వసూళ్లతో మరింత ఆదాయం గడించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఎవరినీ వదలడం లేదు. పన్నులు ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేయాలంటూ కార్యదర్శులకు హుకుం జారీ చేసింది. చేయని పక్షంలో సస్పెండ్‌ చేస్తామంటూ బెదిరింపులకు గురిచేస్తోంది.

జిల్లాలో రూ.120.17 కోట్ల వసూళ్ల లక్ష్యం

జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది పన్నుల వసూళ్లలో భాగంగా మొత్తం రూ.120.17 కోట్లు వసూలు చేయాలని చంద్రబాబు ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. ఇందులో ట్యాక్స్‌లో భాగంగా ఇంటి, నీటి పన్నులు, నాన్‌ట్యాక్స్‌గా ఇండస్ట్రీస్‌, చెరువులు తదితరాల కింద రూ.120.17 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. ఈ మేరకు పంచాయతీ కార్యదర్శులకు లక్ష్యాలను నిర్దేశించింది. మార్చి నెలాఖరుకు 100 శాతం పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇందుకుగాను కార్యదర్శుల మెడపై కత్తి పెట్టారు. లక్ష్యాలు అధిగమించకపోతే.. మండలానికి ఒక కార్యదర్శిని సస్పెండ్‌ చేస్తామంటూ బెదిరింపులకు గురి చేశారు. దీంతో గ్రామాల్లో కార్యదర్శులు పన్నుల వసూళ్లపై దృష్టి సారించారు. నిత్యం అదేపనిలో తలమునకలయ్యారు. అయినా లక్ష్యం నెరవేరలేదు. ఇప్పటి వరకు రూ.79.99 కోట్లు వసూలు చేయగా.. రూ.40.17 కోట్లు పెండింగ్‌లో ఉంది. 66 శాతం మాత్రమే లక్ష్యాన్ని సాధించారు. మిగిలినది ఒక రోజులో ఎలా చేస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది.

నోటీసులు అందకపోవడంతో..

గతేడాది అక్టోబర్‌, నవంబర్‌ నెలల్లో పన్నుల డిమాండ్లకు సంబంధించి కంప్యూటరైజేషన్‌ చేశారు. ట్యాక్స్‌ చెల్లించే వారికి ఫిజికల్‌ కాపీ ఇవ్వకుండా వారి ఫోన్‌ నంబర్లకు కట్టాల్సిన మొత్తానికి సంబంధించి డిమాండ్‌ నోటీస్‌ పంపారు. గ్రామీణ ప్రాంతాల్లో చదువుకోని వారు ఎక్కువగా ఉంటారు. దీనికితోడు ఆండ్రాయిడ్‌ కాకుండా కీప్యాడ్‌ ఫోన్లు ఎక్కువగా వినియోగిస్తారు. వారికి ఈ విషయం తెలియకపోవడం.. ఫిజికల్‌గా నోటీసు అందకపోవడంతో పన్నుల వసూళ్లలో ఆలస్యం చోటు చేసుకుంది. నవంబర్‌ 1వ తేదీ నుంచి ఇంటి పన్నులు, జనవరి 1 నుంచి కుళాయిలు, చేపల చెరువుల పన్నుల వసూళ్లు ప్రారంభించారు. దీంతో పాటు స్వర్ణ పంచాయతీలుగా ప్రభుత్వం రూపకల్పన చేయడంతో డిసెంబర్‌ 1 నుంచి స్వర్ణ పంచాయతీల్లో చెల్లింపులు జరుగుతున్నాయి. ఫోన్ల ద్వారా మెసేజ్‌ వెళ్లిన వారికి బకాయి ఎంత ఉందో తెలియకపోవడం, ప్రజలు నగదు ఇవ్వటంతో కార్యదర్శులు, సచివాలయ ఉద్యోగులు వాటిని తీసుకెళ్లి డిపాజిట్‌ చేసి ఆన్‌లైన్లో కట్టడం తలకుమించిన భారంగా పరిణమించింది.

పన్ను కట్టని వారికి ఘోరంగా అవమానం

గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు పరువుకు ప్రాణం ఇస్తారు. ఏ ఒక్కరు చిన్న మాట అన్నా.. పడరు. అలాంటి పల్లెల్లో పన్నులు చెల్లించలేదన్న సాకుతో వారి పరువు తీసేలా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తోంది. పన్నులు కట్టని వారిని వివిధ రూపాల్లో అవమానాలకు గురి చేస్తోంది. పన్ను కట్టని ఇంటికి కూళాయి కనెక్షన్‌ నిలిపివేస్తున్నారు. వారికి నీరు అందకుండా చేస్తున్నారు. మరో అడుగు ముందుకేసి విద్యుత్‌ కనెక్షన్‌ కట్‌ చేస్తున్నారు. ఇంట్లో వస్తువులు జప్తు చేసేందుకు నోటీసులు జారీ చేస్తున్నారు. అంతటితో ఆగకుండా ‘ఈ కుటుంబ యజమాని పన్నులు చెల్లించలేదు.’ అంటూ ఆ ఇంటి ముందు యజమాని పేరు, ఆయన చెల్లించని పన్ను వివరాలు తెలిసేలా పెద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల పేరుతో కార్యదర్శులను ప్రతి ఇంటికీ పంపించి వసూళ్ల పర్వం వేగవంతం చేయాలని ఒత్తిడి చేయడంతో పగలు, రాత్రి తేడా లేకుండా పంచాయతీ కార్యదర్శులు పడుతున్న అవస్థలు వర్ణనాతీతంగా మారుతున్నాయి. దీంతో ప్రజలు మరింత అవమానాలకు గురవుతున్నారు. తాము పన్ను కట్టలేదని ఊరంతా తెలిసేలా చేస్తున్నారని.. ప్రభుత్వం చేసే తప్పిదాలకు తాము అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తోందని ప్రజలు ఆవేదన చెందుతున్నారు.

ఏటా జరుగుతోందిలా..!

ఏటా ఇంటి పన్నుల వసూళ్లకు మార్చి మాసంలో నోటీసులు జారీ చేస్తారు. ఏప్రిల్‌ నెలాఖరుకు పంచాయతీ కార్యదర్శులు వసూలు చేస్తారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాత ప్రక్రియకు మంగళం పాడారు. ప్రజల వద్ద వసూళ్లకు నాంది పలికారు. రాష్ట్ర ప్రభుత్వానికి మరెక్కడా అప్పు పుట్టక ప్రజలపై పడుతున్నారు. ఫిబ్రవరి నెలాఖరుకే పన్నులు వసూలు చేసేయాలంటూ కార్యదర్శుల మెడపై కత్తిపెట్టారు. ఈ పరిణామం కార్యదర్శుల్లో ఆవేదన నింపుతోంది. ప్రతి సంవత్సరం ఇంటిపన్ను వసూళ్లకు మార్చి నెలలో నోటీసులు జారీ చేసి ఆ నెలాఖరుకు గానీ, ఏప్రిల్‌ చివరకు పంచాయతీ కార్యదర్శులు వసూలు చేస్తుంటారు. ప్రస్తుతం పద్ధతులన్నీ మారడంతో కార్యదర్శి ఉద్యోగం చేయడం కంటే మానుకోవడం మేలంటూ కొందరు కార్యదర్శులు వాపోతున్నారు.

కార్యదర్శులు సతమతం

పన్నుల వసూళ్లపై ప్రభుత్వం ఉన్నతాధికారులపై ఒత్తిడి పెంచుతోంది. ఉన్నతాధికారులు కార్యదర్శులపై ఒత్తిడి పెంచుతున్నారు. దీంతో చేసేది లేక కార్యదర్శులు అవస్థలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఒత్తిడిని తాళలేక వయసుపైబడిన సీనియర్‌ కార్యదర్శులు బీపీలు, సుగర్‌ బారిన పడుతున్నామని వాపోతున్నారు. తమ పంచాయతీల్లో పన్నులు వసూలు చేసినా.. పక్క మండలాల్లో పంచాయతీలకు బాకీల వసూళ్ల నిమిత్తం పంపించడంతో పగలు, రాత్రి అష్టకష్టాలు పడి వసూలు చేస్తున్నారు.

జిల్లాలో ఇలా...

మండలం పన్ను వసూళ్ల వసూలైన శాతం

లక్ష్యం పన్నులు

(రూ.లక్షల్లో) (రూ.లక్షల్లో)

రాజానగరం 1,335.25 690.46 51.7

రాజమహేంద్రవరం రూరల్‌ 3,462.73 1,866.12 53.9

కడియం 1,053.88 650.06 61.7

రంగంపేట 332.87 213.41 64.1

దేవరపల్లి 590.22 384.22 65.1

గోకవరం 319.08 230.39 72.2

కొవ్వూరు 446.01 330.18 74.0

సీతానగరం 417.90 296 71.0

కోరుకొండ 354.29 249.42 70.4

గోపాలపురం 403.54 291.72 72.3

నల్లజర్ల 562.55 458.07 81.4

తాళ్లపూడి 273.90 216.09 78.9

ఉండ్రాజవరం 410.97 359.02 87.44

బిక్కవోలు 489.43 417.64 85.3

పెరవలి 277.52 230.15 82.9

చాగల్లు 387.90 316.45 81.6

అనపర్తి 606.50 545.23 89.9

నిడదవోలు 293.04 254.21 86.7

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement