ప్రకాశం నగర్ (రాజమహేంద్రవరం) : కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో మొత్తం 149 అర్జీలు స్వీకరించినట్లు అధికారులు తెలిపారు. వీటిలో 144 ఆన్‌లైన్ ద్వారా, 5 ఆఫ్‌లైన్ ద్వారా అందాయి. రెవెన్యూ విభాగానికి 56 అర్జీలు అందాయి.
పోలీస్ పీజీఆర్‌ఎస్‌కు..
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌కు 27 ఫిర్యాదులు వచ్చాయి. పీజీఆర్‌ఎస్‌ను ఎస్పీ డి.నరసింహకిశోర్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి అర్జీదారులు హాజరయ్యారు. వారి నుంచి ఎస్పీ అర్జీలు స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వెంటనే నేరుగా సంబంధిత స్టేషన్ పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడి ఫిర్యాదిదారుల సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించి, సత్వరమే న్యాయం చేయవలసిందిగా ఉత్తర్వులు ఇచ్చారు.
చెరువులో స్నానానికి దిగి
మృత్యువాత
రాజానగరం: స్నానం చేసేందుకని చెరువులో దిగిన వ్యక్తి ప్రమాదవశాత్తూ మునిగిపోయి మృతి చెందాడు. మండలంలోని కానవరంలో సోమవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి రాజానగరం ఎస్సై నారాయణమ్మ తెలిపిన వివరాలిలావున్నాయి. కానవరానికి చెందిన వాసంశెట్టి నాగరాజు (45) రోజువారీ మాదిరిగానే ఉదయాన్నే స్నానం చేసేందుకు గ్రామంలోని చెరువులోకి దిగాడు. అయితే కొంతసేపటికి ప్రమాదవశాత్తూ మునిగిపోయి, మృత్యువాత పడ్డాడు. ఆ సమయంలో చెరువును బాగు చేస్తున్న కూలీలు ఉన్నప్పటికీ స్నానం చేస్తున్నాడనుకొని పట్టించుకోలేదు. అయితే చెరువులోకి స్నానానికి వెళ్లిన వ్యక్తి ఎంతసేపటికీ రాకపోవడంతో కుటుంబ సభ్యులు కంగారుపడ్డారు. రాజమహేంద్రవరం నుంచి అగ్నిమాపక సిబ్బంది వచ్చి యంత్రం సాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు దర్యాప్తు జరుగుతోందని ఎస్సై తెలిపారు.
అప్పన్నపల్లి బాలాజీ హుండీ
ఆదాయం రూ.56.08 లక్షలు
మామిడికుదురు: అప్పనపల్లి శ్రీబాల బాలాజీ స్వామి వారి హుండీ ఆదాయాన్ని సోమవారం లెక్కించారు. 68 రోజులకు స్వామి వారికి హుండీల ద్వారా రూ.56.08 లక్షల ఆదాయం వచ్చిందని ఆలయ ఈఓ ఎం.రాంబాబురెడ్డి తెలిపారు. 17 గ్రాముల బంగారం, 250 గ్రాముల వెండిని భక్తులు హుండీల్లో కానుకలుగా సమర్పించారన్నారు. అమలాపురం గ్రూపు టెంపుల్స్ కార్యనిర్వహణాధికారి ఆర్.శ్రీనివాస్ పర్యవేక్షణలో జరిగిన హుండీ లెక్కింపులో ఆలయ వంశపారం పర్య ధర్మకర్త మొల్లేటి లక్ష్మీనారాయణ, స్థానికులు, ఆలయ ఉద్యోగులు పాల్గొన్నారు.
నరసన్న హుండీల
రాబడి రూ.37,08,338
సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీనరసింహస్వామివారి ఆలయ హుండీలను సోమవారం లెక్కించారు. మొత్తం రూ.37,08,338 ఆదాయం సమకూరింది. 53 రోజులకుగాను పై ఆదాయం వచ్చింది.


