ఆరోగ్యశ్రీ.. గుండె గుభిల్లు! | - | Sakshi
Sakshi News home page

ఆరోగ్యశ్రీ.. గుండె గుభిల్లు!

Mar 30 2026 8:35 AM | Updated on Mar 30 2026 8:35 AM

బి

జిల్లా వ్యాప్తంగా రూ.250

కోట్లకు పైగా బకాయి

ఆగనున్న ఎన్టీఆర్‌ ‘వైద్యసేవ’

1 నుంచి నిలిపివేతకు ‘ఆషా’ నిర్ణయం

చంద్రబాబు ప్రభుత్వానికి అల్టిమేటం

నూతన యూనివర్సల్‌ హెల్త్‌ పాలసీ అమలుపై ప్రభుత్వం సమాలోచనలు

సాక్షి, రాజమహేంద్రవరం: పేదలకు ఆధునిక, కార్పొరేట్‌ వైద్యం అందించే ఎన్టీఆర్‌ వైద్య సేవలు (ఆరోగ్యశ్రీ) నిలిచిపోనున్నాయి. ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి వైద్యం పూర్తి స్థాయిలో నిలిపివేస్తామని ఆంధ్రప్రదేశ్‌ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ అసోసియేషన్‌ (ఆషా) చంద్రబాబు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న రూ.3 వేల కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేసింది. ఏప్రిల్‌ 1వ తేదీ లోగా బకాయిలు చెల్లించని పక్షంలో సేవలు కొనసాగించే పరిస్థితి లేదని తేల్చిచెప్పింది. ఈ పరిణామం జిల్లా ప్రజల్లో ఆందోళన నింపుతోంది. ఎన్టీఆర్‌ వైద్యసేవ స్తంభిస్తే ఖరీదైన వైద్యం, శస్త్ర చికిత్సలు ఎక్కడ చేయించుకోవాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ.లక్షలు వెచ్చించి వైద్యం చేయించలేని పరిస్థితుల్లో ప్రభుత్వం స్పందించకపోవడం ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. దీని వెనుక చంద్రబాబు ప్రభుత్వ కుట్ర దాగుందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్టీఆర్‌ వైద్యసేవ పథకం ఎత్తేసి.. యూనివర్సల్‌ హెల్త్‌ పాలసీ తీసుకువచ్చే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తోందని.. అందులో భాగంగానే బిల్లులు చెల్లించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. రూ.లక్షలు విలువ చేసే వైద్యం ఉచితంగా పొందే పరిస్థితి ఇకపై ఉండదని ప్రజలు ఆందోళ చెందుతున్నారు.

జిల్లాలో ఇలా..

జిల్లా వ్యాప్తంగా 90 ఆస్పత్రుల్లో ఎన్టీఆర్‌ వైద్య సేవలు అందుతున్నాయి. అందులో ప్రైవేటు ఆస్పత్రులు 40 ఉండగా.. కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు 5, ప్రైమరీ హెల్త్‌ సెంటర్లు 28, జీజీహెచ్‌ 1, ఏరియా హాస్పిట్‌ 1, మరో 3 ఎంపిక ప్రక్రియలో ఉన్నాయి. 16 దంత వైద్య శాలలు(ఈహెచ్‌ఎస్‌) సైతం వైద్య సేవలు అందిస్తున్నాయి. వీటిల్లో సుమారు 60 మంది వైద్య మిత్రలు విధులు నిర్వర్తిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆరోగ్యశ్రీ పథకాన్ని ఎప్పుడు ఎత్తివేయాలా అనే ఆలోచిస్తున్నారు. ఏప్రిల్‌ నుంచి ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్‌ వైద్యసేవ) స్థానంలో యూనివర్సల్‌ హెల్త్‌ పాలసీ తీసుకువచ్చేందుకు కొన్ని నెలల నుంచి సన్నాహాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పథకం ప్రకారం ఆరోగ్య నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు బిల్లులు ఆపేసి.. వేధించడం ప్రారంభించారన్న ఆరోపణలు ఉన్నాయి.

వన్‌టైం సెటిల్‌మెంట్‌ పేరుతో వంచన

చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బిల్లుల చెల్లింపుల్లో అంతులేని నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. నిరసనగా ఇప్పటికే ఆస్పత్రుల యాజమాన్యాలు తమకు బిల్లులు చెల్లించాలని పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లాయిు. రెండు, మూడు సార్లు వైద్య సేవలను సైతం నిలిపివేశారు. సమ్మె సైతం నిర్వహించాయి. ప్రైవేట్‌ ఆస్పత్రుల యజమానులు రోడ్డెక్కి ఉద్యమాలు చేసిన సందర్భాలు సైతం ఉన్నాయి. అప్పట్లో నెట్‌వర్క్‌ ఆస్పత్రుల యాజమాన్యాలను బుజ్జగించేందుకు ప్రభుత్వం వన్‌టైం సెటిల్‌మెంట్‌తో మొత్తం బిల్లు చెల్లించేస్తామని గతేడాది డిసెంబర్‌లో సెటిల్‌ చేస్తామని హామీ ఇచ్చింది. ఇది జరిగి మూడు నెలలవుతున్నా నేటికీ అతీగతి లేదు. ఎప్పుడు చెల్లిస్తారని ప్రశ్నిస్తే సమాధానం చెప్పేవారు లేరు. చేసేది లేక ఎన్టీఆర్‌ వైద్యసేవ పథకాన్ని నిలిపివేసేందుకు ఆషా నిర్ణయం తీసుకుంది.

జిల్లా వ్యాప్తంగా రూ.250 కోట్లకు పైగా బకాయి

తెల్ల రేషన్‌కార్డు దారులకు ప్రభుత్వం ఎన్టీఆర్‌ వైద్యసేవ వర్తింప చేస్తోంది. ఆస్పత్రులకు చెల్లించాల్సిన బిల్లులపై ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా కాలయాపన చేస్తూ వస్తోంది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు సుమారు రూ.250 కోట్ల మేర బకాయి పెట్టింది. గుండె సంబంధిత, చర్మం, ఈఎన్‌టీ, గ్యాస్ట్రో, జనరల్‌ మెడిసిన్‌, సర్జరీ, మూత్రపిండ శస్త్ర చికిత్సలు తదితర ఆపరేషన్లు చేసిన ఆస్పత్రులకు బిల్లులు ఆగిపోయాయి. ఈ పరిణామం పేద ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. ఖరీదైన శస్త్ర చికిత్స తాము ఎలా చేయించుకోవాలంటూ నిట్టూరుస్తున్నారు. దీనిపై చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. అనేక ఆందోళనల నేపథ్యంలో తలొగ్గిన ప్రభుత్వం ఇటీవల 5 శాతం నిధులు మాత్రమే విడుదల చేసి వారిని జోకొట్టింది. మిగిలినవి ఎప్పుడు విడుదల చేస్తుందో స్పష్టత ఇవ్వలేదు.

సేవల ఎత్తివేతకు కుట్ర

ఎన్టీఆర్‌ వైద్యసేవ పథకాన్ని శాశ్వతంగా తొలగించేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. ఆ పథకం స్థానంలో యూనివర్సల్‌ హెల్త్‌ పాలసీ తీసుకువచ్చేందుకు ఇప్పటికే సర్వం సిద్ధం చేసినట్లు తెలిసింది. పాలసీకి సంబంధించిన మార్గదర్శకాలు, స్పష్టమైన ఆదేశాలు మాత్రం గుట్టుగా ఉంచిందన్న ఆరోపణలున్నాయి. రూ.2 లక్షల వరకు ఆయుష్మాన్‌ భారత్‌, ఆపై మొత్తానికి బీమా కంపెనీల ద్వారా వైద్యం అందించాలనే ప్రతిపాదనలపై ఇప్పటికే అధికారులకు అవగాహన కల్పించినట్లు తెలిసింది. ఆస్పత్రుల సిబ్బంది వివరాలు రిజిస్టర్‌ చేసినట్లు సమాచారం. తక్కువ ప్యాకేజీల కారణంగా బీమా కంపెనీలు ముందుకు రావడం లేదని సమాచారం. బీమా పథకంలో వ్యాధుల సంఖ్య 1900 లోపే ఉంటాయి. ప్యాకేజీ సైతం తక్కువగా ఉండడంతో ప్రైవేటు ఆస్పత్రులు ఆయుష్మాన్‌ భారత్‌పై ఆసక్తి చూపడం లేదు. ఇదే జరిగితే నయాపైసా చెల్లించకుండా వైద్యం చేయించుకునే పేద, మధ్య తరగతి ప్రజలపై తీవ్ర భారం పడుతుంది.

కొత్త పథకంపై స్పష్టత కరువు

పేదలకు ఆరోగ్య ఆసరా కల్పిస్తున్న ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్‌ వైద్యసేవ) పథకాన్ని తొలగిస్తే మెరుగైన వైద్యం అందుతుందా..? లేదా..? అన్న ఆందోళన ప్రజల్లో నెలకొంది. కొత్త పాలసీతో పేదలకు మేలు జరుగుతుందా..? లేదంటే పేరు మార్చి బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తోందా..? అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. ప్రస్తుతం అమలవుతున్న ఎన్టీఆర్‌ వైద్య సేవలో ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల మేర హెల్త్‌ కవరేజ్‌ లభిస్తోంది. ఈ విధానాన్ని బీమాలోకి తీసుకువస్తే.. బీమా క్లెయిమ్‌ల విషయంలో ఏ మేరకు లబ్ధి చేకూరుతుందన్న ప్రశ్న ప్రజల్లో ఉత్పన్నమవుతోంది.

వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో ఊపిరి

వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చాక 938 వ్యాధులతో ప్రారంభమైన ప్రస్థానం 3,275 వ్యాధుల వరకు విస్తరించారు. ఆస్పత్రుల్లో మౌలిక వసతులు, డ్యూటీ డాక్టర్‌, స్పెషలిస్టు వైద్యులతో పాటు నర్సు, పారా మెడికల్‌ సిబ్బంది తప్పనిసరిగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. నాలుగున్నరేళ్లలో పథకం అమలుకు భారీగా ఖర్చు చేసింది. రూ.508,49,95,571 కోట్లు వైద్యం, శస్త్ర చికిత్సలకు వెచ్చించింది. 2,48,805 మందికి వైద్యం అందించి సంపూర్ణ ఆరోగ్యవంతులు చేశారు.

దిక్కుతెలియని

పరిస్థితుల్లో ఆపేస్తున్నాం

ఎన్టీఆర్‌ వైద్యసేవలో నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు రాష్ట్ర వ్యాప్తంగా రూ.3 వేల కోట్ల బకాయిలు ఉన్నాయి. డిసెంబర్‌ నాటికి వన్‌టైం సెటిల్‌మెంట్‌ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. నేటికీ ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. తమకు చెల్లించాల్సిన బిల్లుల్లో సైతం కోత విధిస్తున్నారు. మళ్లీ కొత్తగా యూనివర్సల్‌ హెల్త్‌ స్కీమ్‌ మొదలు పెడతామంటున్నారు. ఇదే ప్యాకేజీతో వైద్యం అందించడం సాధ్యం కాదని చెబుతున్నా పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం చేయాలనుకున్న పని చేసుకుంటూ పోతోంది. ప్రజలకు వైద్యం అందించాలని ఉన్నా.. బిల్లులు అందకపోవడంతో దిక్కుతెలియని పరిస్థితుల్లో వైద్యం ఆపేయాలని నిర్ణయం తీసుకున్నాం.

– డాక్టర్‌ విజయ్‌కుమార్‌, ఆషా ఏపీ చైర్మన్‌

గత ప్రభుత్వంలో జిల్లాలో వైద్యం ఇలా..

సంవత్సరం వైద్యం/ ఖర్చులు

శస్త్రచికిత్సలు (రూ.కోట్లల్లో)

2019–2020 25,750 62.71

2020–2021 29,602 62.15

2021–2022 47,039 89.48

2022–2023 1,46,414 294.15

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement