సీతానగరం: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి సారించినట్టు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ఆమె శనివారం పురుషోత్తపట్నంలో ని ఎంపీయూపీ స్కూల్, తాబే లు మెట్ట – ఏనుగు కొండ ప్రాంతం, సీతానగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించా రు. ఎంపీయూపీ పాఠశాలలో ఉపాధ్యాయులతో సమావేశమై బోధనా విధానాలు, పేరెంట్స్ కమిటీ సమావేశాల నిర్వహణ, విద్యార్థుల ప్రతిభ తదితర వాటిపై ఆరా తీశారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనాన్ని రుచి చూశారు. పురుషోత్తపట్నం సమీపంలో పురాతన రామాలయం ఉన్న రామదుర్గం, తాబేలు మెట్ట – ఏనుగు కొండ ప్రాంతంలో పర్యాటక రంగ అభివృద్ధి పనులను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో పీపీపీపీ విధానంలో చేపడుతున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ఈ ప్రాంతంలో రిసార్టులు, రెస్టారెంట్ల స్థాపనకు అనువైన 7.5 ఎకరాల భూమిని గుర్తించామన్నారు. అవసరమైన మార్గదర్శకాలను టూరిజం వెబ్‌సైట్‌లో విడుదల చేశామని, ఆసక్తి కలవారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. అలాగే సీతానగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి, అక్కడి అపరిశుభ్రతపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
అన్నవరప్పాడుకు పోటెత్తిన భక్తులు
పెరవలి: అన్నవరప్పాడులోని వేంకటేశ్వరస్వామి ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అన్నవరప్పాడు గ్రామానికి చెందిన వాసంశెట్టి గోపాలం, కుమారి దంపతుల కుమారుల ఆర్థిక సాయంతో 13 వేల మందికి అన్నసమారాధన నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి మీసాల రాధాకృష్ణ మాట్లాడుతూ స్వామి వారికి పూలంకరణ, భక్తులకు ప్రసాదం, నిత్యగోత్రార్చన, అన్నదానం, నూతన ఆలయ నిర్మాణానికి భక్తుల నుంచి విరాళాలు సేకరిస్తున్నామన్నారు.


