● డీఎస్‌ఏ స్టేడియంలో స్విమ్మింగ్ శిక్షణ
● ఆరేళ్ల చిన్నారుల నుంచి పెద్దవారి వరకు అవకాశం
● ఈతతో వ్యాయామంతో పాటు ఆరోగ్యం
● స్వీయ రక్షణకే కాకుండా ఇతరుల రక్షణకూ దోహదం
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): ఒంటిపూట సెలవులు వచ్చేశాయి. అభిరుచులకు అనుగుణంగా చిన్నారులకు వారికి ఆసక్తికరమైన ఆటపాటల్లో తర్ఫీదు ఇప్పించేందుకు అనువైన సమయం. పుస్తకాలకు కాస్త విరామం ఇచ్చి ఆసక్తి ఉన్న రంగాల్లో శిక్షణ ఇప్పించి నైపుణ్యాలకు పదును పెట్టేందుకు దోహదపడే సమయం. లలిత కళలు, డ్యాన్స్, మూజిక్, క్రీడలు వంటివి నేర్చుకుంటూ సంతోషంగా గడపాలనుకునే వారి జాబితాలో ఇప్పుడు స్విమ్మింగ్ కూడా చేరుతోంది. భానుడి వేడి రోజురోజుకు పెరుగుతుండడంతో ఈ క్రీడపై ఆసక్తి చూపుతున్న చిన్నారుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. పాఠశాలలకు ఒంటి పూట సెలవులు కావడంతో చెరువుల్లో, సముద్రంలో, బావుల్లో, కాలువల్లో, నదుల్లో సరదాగా స్నానానికి దిగి ప్రమాదవ శాత్తు పడి ప్రాణాలు కోల్పోయేవారు ఎక్కువవుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో స్వీయ రక్షణకు ఈత తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈత శరీరాన్ని చల్లబరచడమే కాకుండా.. కావలసిన వ్యాయామాన్ని అందిస్తుంది. ఈత నేర్చుకోవాలనుకునే వారికి కాకినాడలోని డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ (డీఎస్‌ఏ)లోని స్విమ్మింగ్ పూల్ ఆహ్వానం పలుకుతోంది.
డీఎస్‌ఏలో
కాకినాడ జిల్లా క్రీడామైదానంలోని స్విమ్మింగ్ పూల్‌లో శిక్షణకు చిన్నారులు ఉత్సాహంగా చేరుతున్నారు. జలకాలలో ఓనమాలు నేర్చుకుని తమ ప్రతిభను రాష్ట్ర, జాతీయ స్థాయిలో కపనరచాలనే లక్ష్యంతో శిక్షణ పొందుతున్నారు. స్వీమ్మింగ్ కోచ్ అప్పలనాయుడు ఆధ్వర్యంలో, డీఎస్‌డీఓ వి.సతీష్‌కుమార్ పర్యవేక్షణలో ఈశిక్షణ నిర్వహిస్తున్నారు. ఉదయం 5.30 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 7.30 వరకు శిక్షణ అందిస్తున్నారు. మహిళలకు ప్రత్యేకంగా సాయంత్రం 4 నుంచి 5 వరకు పూల్‌ను కేటాయించారు. శిక్షణలో చేరిన వారికి ఫిట్‌నెస్‌తో పాటు ఫ్రీ స్టైల్, బటర్‌ఫ్‌లై, బ్యాక్‌స్ట్రోక్, బ్రెస్ట్‌స్ట్రోక్‌లో శిక్షణ ఇస్తూ మెళకువలు నేర్పుతున్నారు. డీఎస్‌ఏలో స్విమ్మింగ్ పూల్‌లో శిక్షణకు చేరగోరే పిల్లలకు నెలకు రూ.వెయ్యి, పెద్ద వారికి నెలకు రూ.1500 వసూలు చేస్తున్నారు. జాతీయస్థాయి, రాష్ట్రస్థాయి పతకాలు సాధించిన బీపీఎల్ కార్డు ఉన్న క్రీడాకారులకు ఉచితం.
మంచి వ్యాయామం
ఈత నేర్చుకునే సమయంలో శరీరంలోని అన్ని కండరాలు, కీళ్లకు అవసరమైన వ్యాయామం అందుతుంది.
ఊపిరి ఎక్కువ సేవు బిగబట్టి వదలడం వల్ల శాస ప్రక్తియ క్రమబద్దీకరించబడి ఊపితిత్తులు బలంగా తయారవుతాయి.
పగలు ఏసమయంలో ఈత నేర్చుకున్నా మంచిదే.
ఈత వల్ల అత్యధిక క్యాలరీలు ఖర్చవుతాయి. తద్వారా ఆకలి పెరుగుతుంది.
నిత్యం ఈత కొట్టేవారు ఉత్సాహంగా ఉంటారు. మెదడు చురుకుగా పనిచేస్తుంది.
శరీరం దృఢంగా ఉంటుంది. చదివిన విషయాలను త్వరగా నేర్చుకోగలుగుతారు. చిన్న వయసు వారి నుంచి పెద్ద వయసు వారి వరకు ఈత నేర్చుకోవచ్చు.
కొలనులో ఈత నేర్చుకునే వారు రు.500 వెచ్చిస్తే మంచి స్విమ్మింగ్ దుస్తులు లభిస్తాయి.
మూడు వారాలు క్రమం తప్పకుండా నేర్చుకుంటే ప్రావీణ్యం వస్తుంది.
స్విమ్మింగ్ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి
చిన్నతనం నుంచి స్విమ్మింగ్ నేర్చుకోవడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. శరీరానికి ఆక్సిజన్ సంపూర్ణంగా అందుతుంది. రక్తం సరఫరా మెరుగుపడి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. మన స్నేహితులు, బంధువులు, మరెవరైనా ప్రమాదవ శాత్తు ఏదైనా నీటి ప్రమాదంలో పడిపోతే రక్షించే అవకాశం ఉంటుంది.
అప్పల నాయుడు, కోచ్, డీఎస్‌ఏ
శిక్షణను సద్వినియోగం చేసుకోండి
కాకినాడ జిల్లా క్రీడామైదానంలోని స్విమ్మింగ్ పూల్‌లో నైపుణ్యం కలిగిన కోచ్, అసిస్టెంట్ కోచ్ సహాయంతో శిక్షణ అందిస్తున్నాం. మహిళలకు ప్రత్యేక సమయంలో శిక్షణ నిర్వహిస్తున్నాము. ఆత్మరక్షణకు స్విమ్మింగ్ దోహదపడుతుంది. ఆసక్తి గల వారు ఇక్కడి స్విమ్మింగ్ పూల్‌ను సద్వినియోగం చేసుకుని మంచి క్రీడాకారులుగా ఎదగాలి. ఈత నేర్చుకోవాలనుకునే వారు 94400 31601 నెంబరులో సంప్రదించాలి.
– వి.సతీష్‌కుమార్, డీఎస్‌డీఓ, డీఎస్‌ఏ, కాకినాడ


