కొత్తపేట: మండల పరిధిలోని వాడపాలెం సమీపంలోని బండారుపేట వద్ద ఆటోను కారు ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక ఎస్సై జి.సురేంద్ర తెలిపిన వివరాల మేరకు మండల పరిధిలోని వానపల్లి గ్రామానికి చెందిన అక్కిశెట్టి వీరేశ్వరరావు తన ఆటోలో నలుగురు మహిళా ప్రయాణికులు, ఒక బాలికను ఎక్కించుకుని కొత్తపేట వస్తున్నాడు. బండారుపేట వద్దకు వచ్చేసరికి ఎదురుగా వానపల్లి వైపు అతి వేగంగా వచ్చిన ఏపీ39 బీవై 6896 నెంబరు గల కారు అతని ఆటోను ఢీకొంది. దానితో ఆ ఆటో అక్కడే నిలిపి ఉన్న మరో ట్రక్కు ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ వీరేశ్వరరావుతో పాటు దానిలో ప్రయాణిస్తున్న వానపల్లికి చెందిన ఇమ్మడి నాగమణి, బద్రి పళ్లాలమ్మ, గండ్రోతు గణేశ్వరి, సలాది పద్మ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు కొత్తపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా వారికి ప్రాధమిక చికిత్స చేసి ఉన్నత వైద్యం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆటో డ్రైవర్ వీరేశ్వరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సురేంద్ర తెలిపారు.
అవయవ దానంతో ముగ్గురికి పునర్జన్మ
కాకినాడ క్రైం: కాకినాడకు చెందిన ఓ వ్యక్తికి బ్రెయిన్ డెడ్ కావడంతో కుటుంబ సభ్యులు అవయవదానం చేసి ఆదర్శంగా నిలిచారు. ఆర్‌ఆర్ నగర్‌కు చెందిన భూపతిరాజు వెంకటనారాయణ రాజు (60)కు కొద్ది రోజుల క్రితం తీవ్రమైన బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. కుటుంబ సభ్యులు కాకినాడ అపోలో ఆసుపత్రిలో ఆయనను చేర్చినప్పటికీ కోలుకోలేకపోయారు. దీంతో వైద్యులు బ్రెయిన్ డెడ్ అయినట్లు నిర్థారించారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఆదర్శాన్ని చాటుకున్నారు. రాజు భార్య మమత, కుమార్తె విజయశ్రీతో పాటు రాజు సోదరుడు సుబ్బరాజు అవయవ దానానికి ముందుకు వచ్చారు. వారి నిర్ణయంతో ముగ్గురికి పునర్జన్మ లభించింది. ఓ వ్యక్తి ప్రాణాలు నిలువగా, మరో ఇద్దరికి కంటి చూపు దక్కింది. ఆయన కాలేయాన్ని విశాఖపట్టణంలో ప్రాణాపాయంతో ఉన్న ఓ వ్యక్తికి అమర్చనున్నారు. అలాగే కళ్లను బాదం ఐ బ్యాంక్‌కు దానం చేశారు. రాజు నేత్రదానంతో ఇద్దరు తమ కంటి చూపును తిరిగి పొందనున్నారు. కాలేయాన్ని తరలించేందుకు జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. గ్రీన్ చానల్ ఏర్పాటు చేసి కాలేయాన్ని శనివారం మధ్యాహ్నం సకాలంలో అవసరమైన వారికి అమర్చేందుకు తరలించారు. వెంకట నారాయణ రాజు కుటుంబం చూపిన ఉదాత్త సేవాభావం సమాజానికి ఓ ప్రేరణగా నిలిచిందని పలువురు కొనియాడారు.
ఆలోచింపచేసిన అమ్మ చెక్కిన బొమ్మ
ఏలేశ్వరం: మానవజన్మలో సీ్త్ర, పురుషులే కాకుండా 20 రకాల శరీర తత్వాలు ఉన్నాయనే ఇతివృత్తంతో సాగిన అమ్మచెక్కిన బొమ్మ నాటిక ఆహూతులను ఆలోచింపజేసింది. మండలంలోని పెద్దనాపల్లి గ్రామంలో శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా గొల్లపల్లి చెల్లయ్య మోమోరియల్ నాటక కళాపరిషత్ అధ్యక్షుడు, ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలుగు రాష్ట్రాల నాటికల పోటీలు అసక్తికరంగా సాగుతున్నాయి. హైదరాబాద్‌కు చెందిన గోవాడ క్రియేషన్స్ ప్రదర్శించిన ఈ నాటికకు గోవాడ వెంకట్ దర్శకత్వం వహించగా శ్రీమతి జ్యోతిరాజ్ భీశెట్టి రచన చేశారు. రెండో నాటికగా తరమెల్లిపోతున్నదో నాటిక ప్రదర్శించారు. మరణం తరువాత మనిషి బతుకుతాడు, మరణం తరువాత బతికేవారే నిజమైన మనిషి అనే కధాంశంతో నాటిక కొనసాగింది. గుంటూరుకు చెందిన కరణం మహేష్ మోమోరియల్ థియేటర్స్ వారి ఈ నాటికకు రచన, దర్శకత్వం శ్రీరామకృష్ణ బొమ్మిడి అందించారు.


