జోడుమామిళ్ల సమీపంలో పెద్దపులి! | - | Sakshi
Sakshi News home page

జోడుమామిళ్ల సమీపంలో పెద్దపులి!

Mar 29 2026 7:18 AM | Updated on Mar 29 2026 7:18 AM

దేవీపట్నం: ఇందుకూరు పంచాయతీ కొత్తవీధి గ్రామంలో గురువారం రాత్రి నాలుగు పశువులను చంపిన పెద్దపులి శుక్రవారం రాత్రి కొత్తవీధి ఎగువన గల మీటరాయి చెరువు వద్ద ఉన్న కొండకు చేరింది. గోకవరం దండంగి ఆర్‌అండ్‌బి రహదారిలో పోతవరం, జోడుమామిళ్లు మధ్య పులి సంచరిస్తోంది. శనివారం రాత్రికి పులి పయనం ఎటువైపు వెళుతుందోనన్న ఆసక్తి నెలకొంది. జోడు మామిళ్లు వద్ద ఆర్‌అండ్‌బి రహదారి దాటితే పురుషొత్తపట్నం వైపు మరలే అవకాశం ఉంది. ప్రస్తుతం పులి ఉన్న ప్రదేశం నుంచి గుంపెనపల్లి, లక్ష్మీపురం గ్రామాల మీదుగా సీతపల్లి వాగు దాటితే పులిని విడిచిపెట్టిన పాపికొండల అభయారణ్యంలోని కొండమొదలు ప్రాంతానికి చేరే అవకాశం ఉన్నట్లు అటవీ అధికారులు భావిస్తున్నారు. గడిచిన 20 రోజులుగా పులి పయనిస్తున్న మార్గాన్ని పర్యవేక్షిస్తున్న అటవీశాఖ అధికారులు రక్షిత అటవీ ప్రాంతానికి చేరుకునే అవకాశాలున్నాయి. తిరుపతి, పుణే నుంచి వచ్చిన బృందాలతో పాటు, హనుమ సభ్యులు స్థానిక అటవీ సిబ్బంది సహకారంతో పులి గమనాన్ని జీపీఎస్‌ ట్రాకర్‌ ద్వారా ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. ఇదిలా ఉండగా స్థానికంగా ఉన్న గ్రామాలైన లక్ష్మీపురం, గుంపెనపల్లి, నూనెపల్లి గ్రామాలకు చెందిన పశువులను జనవరి నెలలోనే విడిచిపెట్టడంతో ఆయా పశువులు అడవులలో సంచరిస్తున్నాయి. వీటికి తోడు దండంగి పరిసర ప్రాంతాల్లో సుమారు వెయ్యి వరకూ గేదెలు ఉండడంతో ఆయా పశువుల యజమానులు ఆందోళనకు గురవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement