ఫియట్ లైనియా కారు స్వాధీనం
పిఠాపురం రూరల్: స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల వెలుగు చూసిన భారీ గంజాయి అక్రమ రవాణా కేసులో ఇద్దరు నిందితులను శనివారం అరెస్టు చేసినట్లు సీఐ జి. శ్రీనివాస్ తెలిపారు. ఈ నెల ఐదో తేదీన పి.దొంతమూరు గ్రామ శివారు పామాయిల్ తోటలో తనిఖీలు చేసిన పోలీసులు 92 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై స్థానిక ఎస్సై ఎస్‌కే జానీబాషా తహసీల్దార్ సమక్షంలో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కేసు దర్యాప్తులో భాగంగా నిందితుల కోసం గాలింపు చేపట్టామని, సాంకేతిక ఆధారాలతో శనివారం శుద్దగెడ్డ వాగు కల్వర్టు వద్ద కారులో వెళ్తున్న ఇద్దరు అంతర్ జిల్లాల నిందితులను అరెస్టు చేసినట్టు తెలిపారు. నిందితులు అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలానికి చెందిన నడిగట్ల మనోహర్ (33), అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలానికి చెందిన లోచల రాజుబాబు (30)గా గుర్తించామని, వీరు గతంలో కూడా పలు గంజాయి అక్రమ రవాణా కేసుల్లో నిందితులుగా ఉన్నట్లు తెలిపారు. నిందితులు తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి అధిక ధరకు విక్రయించే ఉద్దేశంతో దాచిపెట్టినట్లు వెల్లడైందన్నారు. నిందితుల వద్ద నుంచి ఫియట్ లైనియా కారు సీజ్ చేసినట్లు తెలిపారు. ఇద్దరు నిందితులను కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారన్నారు. పరారీలో ఉన్న ఇతర నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.


