దేవీపట్నం: నెల రోజులకు పైగా జిల్లా వాసులను వణికిస్తున్న పులి గురువారం రాత్రి దేవీపట్నం మండలంలోకి ప్రవేశించింది. ఇందుకూరు పంచాయతీ కొత్తవీధి గ్రామం వద్ద కట్టి ఉంచిన వీరపాటి కొండబాబుకు చెందిన మూడు లేగ దూడలపై దాడి చేసి చంపేసింది. మరో చూడి ఆవును చంపి, కొంత మేర ఈడ్చుకుపోయి తినేసింది. జీపీఎస్ ట్రాకర్ ద్వారా ఈ పులి కొత్తవీధి సమీపాన ఉన్నట్లు అటవీ సిబ్బంది శుక్రవారం ఉదయం గుర్తించారు. వెంటనే తిరుపతి నుంచి వచ్చిన టీమ్, హనుమ టీమ్, స్థానిక అటవీ సిబ్బంది బృందాలు అక్కడకు చేరుకున్నాయి. ఆ పులికి మత్తు మందు ఇచ్చేందుకు మాటు వేశారు. అయితే, అక్కడి పొదల్లో సేద తీరుతున్న పులి మధ్యాహ్నం 3 గంటలకు సమీపంలోని ఈనుకొండ వైపు మళ్లిపోయింది. దీంతో, పులిని బంధించేందుకు అటవీ సిబ్బంది చేసిన ప్రయత్నం ఫలించలేదు. పులి దాడిలో చనిపోయిన పశువుల యజమానులకు నష్టపరిహారం అందిస్తామని ఇందుకూరు అటవీ రేంజ్ అధికారి కొండలరావు తెలిపారు. ఇదిలా ఉండగా ఈ పులి శుక్రవారం రాత్రికి తిరిగి రంపచోడవరం మండలంలోకి ప్రవేశించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
2న వాటర్ స్పోర్ట్స్
జిల్లా స్థాయి ఎంపికలు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యాన వచ్చే నెల 2న రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) లీగ్ వాటర్‌స్పోర్ట్స్‌లో జిల్లా స్థాయి ఎంపికలు జరగనున్నాయి. జిల్లా క్రీడాభివృద్ధి అధికారి (డీఎస్‌డీఓ) వి.సతీష్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. సబ్ జూనియర్స్ అండర్–15, జూనియర్స్ అండర్–18 విభాగాల్లో కెనాయింగ్, క్యాకింగ్, రోయింగ్, డ్రాగన్ బోట్‌లలో ఎంపికలుంటాయని వివరించారు. స్థానిక వివేకానంద పార్కు ఆవరణలో ఆ రోజు ఉదయం 8 గంటలకు ఎంపికలు ప్రారంభమవుతాయన్నారు. ఆసక్తి ఉన్న వారు సొంత క్రీడా పరికరాలతో హాజరు కావాలన్నారు. క్రీడా యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుని, జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డుతో హాజరు కావాలని సూచించారు.
శిల్పారామంలో స్టాల్స్‌కు
దరఖాస్తుల ఆహ్వానం
కాకినాడ రూరల్: బీచ్ రోడ్డులోని శిల్పారామంలో ఖాళీగా ఉన్న స్టాల్స్‌ను సంప్రదాయ హస్తకళలు, చేనేత వస్త్ర వ్యాపారానికి కేటాయించేందుకు ఆసక్తి ఉన్న వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. పరిపాలనాధికారి మోహన్‌తేజ శుక్రవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. స్థానిక హస్తకళలను ప్రోత్సహించడంలో భాగంగానే వీటిని కేటాయిస్తున్నామన్నారు. ఆట వస్తువులతో పాటు ఎగ్జిబిషన్ ఏర్పాటుకు ఆసక్తి ఉన్న వారు ఏప్రిల్ 6వ తేదీలోగా శిల్పారామం కార్యాలయంలో నేరుగా సంప్రదించాలని కోరారు,
బ్లాక్‌స్పాట్లలో భద్రతా చర్యలు
ఆలమూరు: జాతీయ రహదారి–216ఏపై రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నట్టు కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్‌రావు, హైవే ప్రాజెక్టు డైరెక్టర్ బి.కృష్ణమూర్తి తెలిపారు. కోనసీమ జిల్లా పరిధిలోని 216ఏ జాతీయ రహదారిపై రావులపాలెం – ఆలమూరు మండలం పొట్టిలంక వరకూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలను రూరల్ సీఐ సీహెచ్ విద్యాసాగర్, ఆలమూరు ఎస్సై జి.నరేష్‌తో కలిసి శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ రహదారిలోని జొన్నాడ వద్ద కోటిపల్లికి వెళ్లే ఏటిగట్టు రోడ్డు, ఆంజనేయస్వామి గుడి, మూలస్థాన అగ్రహారం సెంటర్, చొప్పెల్ల లాకులు, చెముడులంక, మడికి గ్రామాల్లో ఆరు ప్రమాదకర ప్రదేశాలు (బ్లాక్ స్పాట్లు) ఉన్నట్లు గుర్తించారు. ఆయా ప్రదేశాల్లో ప్రమాదాలకు కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. వాటి నివారణకు తీసుకోవలసిన చర్యలపై స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో చర్చించారు.
జొన్నాడ – కోటిపల్లి ఏటిగట్టు జంక్షన్ వద్ద
బ్లాక్‌స్పాట్‌ను పరిశీలిస్తున్న అధికారులు


