బైక్ అదుపు తప్పి కోనసీమ వాసి మృతి
చింతూరు: భద్రాచలం సీతారాముల కల్యాణానికి వెళ్తున్న క్రమంలో గురువారం ఘాట్‌రోడ్‌లో జరిగిన ప్రమాదంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు చెందిన ఆకుల శివ(26) మృతిచెందాడు. జిల్లాలోని చొప్పెల్లకు చెందిన శివ, సంతోష్ శుక్రవారం భద్రాచలంలో జరిగే రాములోరి కల్యాణం తిలకించేందుకు ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. వారు ప్రయాణిస్తున్న వాహనం చింతూరు, మారేడుమిల్లి ఘాట్‌రోడ్‌లోని చింతూరు మండలం తులసిపాక సమీపంలోని వ్యూ పాయింట్ వద్దకు రాగానే అదుపుతప్పి బండరాయిని ఢీకొట్టింది. ఈ ఘటనలో శివ అక్కడికక్కడే మృతిచెందగా సంతోష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన సంతోష్‌ను చికిత్స నిమిత్తం 108 వాహనంలో చింతూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మోతుగూడెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


