గాలికుంటు.. టీకాతో సరి.. | - | Sakshi
Sakshi News home page

గాలికుంటు.. టీకాతో సరి..

Mar 26 2026 7:47 AM | Updated on Mar 26 2026 7:47 AM

ఎన్‌ఏడీపీలో భాగంగా

ఏప్రిల్‌ 13 వరకు పంపిణీ

జిల్లాలో 2.31 లక్షల టీకాల లక్ష్యం

నివారణ చేపట్టండిలా

● పశువులు బాగా బలహీనంగా ఉంటే గ్లూకోజ్‌ రక్తంలోకి ఇవ్వాల్సి ఉంటుంది. ’నోటిలో పుండ్ల వలన మేత మేయవు. కనుక వాటికి సులభంగా జీర్ణమయ్యే పోషక పదార్థాలతో కూడిన ఆహారం అందించాలి.

● జావ, జొన్న, అన్నం, ఉప్పు, బెల్లంతో కలిపి నిత్యం తాగించడం ద్వారా అవి బలహీన పడకుండా జాగ్రత్త వహించాలి. ఈ వ్యాధి సోకిన పశువులను వేరు చేయాలి.

● వీటి మల మూత్రాలను గడ్డిలో కాల్చివేయాలి. చనిపోయిన పశువులను సున్నపు గోతిలో పూడ్చాలి.

చికిత్స

● కాలిగిట్టల మధ్య పుండ్లను పొటాషియం పర్మాంగనేట్‌ ద్రావకాలతో కడిగి నీమ్‌లెంట్‌, వేపనూనె పూయాలి.

● నోటిలోని పుండ్లకు బోరిక్‌ పౌడర్‌ చల్లి గ్లిజరిన్‌ కలిపి పూయాలి. వైద్యుడిని సంప్రదించి అవసరమైన మందులు వాడాలి.

రాయవరం: వ్యాధులు దాడి చేయడం ద్వారా పశువుల్లో పాల ఉత్పాదక శక్తి తగ్గుతుంది. ఒక్కో సమయంలో అవి ప్రాణాలు కూడా కోల్పోతాయి. అటువంటి ప్రమాదకర వ్యాధుల్లో గాలికుంటు ఒకటి. వైరస్‌ ద్వారా వ్యాపించే ఈ వ్యాధిని ఫుట్‌ అండ్‌ మౌత్‌ డిసీజ్‌గా పేర్కొంటారు. పశు పోషకులు సరైన చికిత్సా విధానాలు పాటిస్తే పశువులను కాపాడుకోవచ్చునంటున్నారు జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి టి.శ్రీనివాసరావు. నేషనల్‌ యానిమల్‌ డిసీజ్‌ కంట్రోల్‌ ప్రోగ్రామ్‌ (ఎన్‌ఏడీపీ) 8వ విడతలో భాగంగా గాలికుంటు వ్యాధి నివారణకు ఈ నెల 16న సామూహిక టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. వచ్చే నెల 13 వరకూ ఈ పంపిణీ సాగనుంది.

వ్యాధి లక్షణాలు

● గాలిలో తేమ శాతం అధికంగా ఉన్నపుడు ఈ వ్యాధి వ్యాపించే అవకాశం ఎక్కువ.

● వ్యాధి సోకిన సమయంలో పశువుల్లో గర్భం విఫలమవుతుంది. వేడిని తట్టుకోలేవు.

● వ్యాధికి గురైన పశువుకు తీవ్రమైన జ్వరం కన్పిస్తుంది.

● పాల దిగుబడి తగ్గడం, నోరు, మూతి, కాళ్లు, పొదుగు మీద పుండ్లు, బొబ్బలు కనపడటం, కాళ్లు కుంటడం, నోటి నుంచి విపరీతంగా నురగ కారడం వంటి లక్షణాలు ఉంటాయి.

● వ్యాధి సోకిన గేదె, ఆవు పాలు తాగే దూడల్లో మరణాలు ఉంటాయి. వ్యాధి సోకిన గేదె, ఆవు పాలను దూడలు తాగకుండా చూసుకోవాలి.

ఉత్పాదక సామర్ధ్యం తగ్గుతుంది

● మార్చి, ఏప్రిల్‌ మాసాల్లో ఈ వ్యాధి ఎక్కువ వస్తుంది.

● వ్యాధి వల్ల మరణాల శాతం తక్కువైనప్పటికీ పశువుల్లో ఉత్పాదక శక్తి సామర్ధ్యం తగ్గుతుంది.

● జ్వర తీవ్రత 104–106 డిగ్రీల ఫారన్‌హీట్‌ వరకు పెరిగి పశువులు నీరసిస్తాయి.

● పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గుతుంది. నోటి ఎపిథీలియం (పైపొర), పళ్లు, చిగుళ్లు, నాలుక, ముట్టి లోపలి ప్రాంతాల్లో బొబ్బలు ఏర్పడి అవి 24 గంటల్లో చితికి పోవడం వల్ల పశువులు నొప్పితో మేత తినవు.

● నోటి నుంచి చొంగ కారుతుంది.

● చూడి పశువుల్లో గర్భస్రావాలు సంభవిస్తాయి.

● పశువులు శ్వాసను కష్టంగా పీల్చుతూ, రొప్పుతూ ఎండవేడి తట్టుకోలేక నీరసిస్తాయి.

వ్యాప్తి చెందుతుందిలా

● నోరు, కాలు వ్యాధికి గురైన పశువుల అంతఃస్రావాల (లాలాజలం, పుండ్ల నుంచి కారే రసి) వల్ల వ్యాధి మిగతా పశువులకు వ్యాప్తి చెందే అవకాశం ఉంది.

● వ్యాధికారక క్రిమి ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది.

● గాలిలో తేమ శాతం అధికంగా ఉన్నప్పుడు ఒక చోట నుంచి మరో చోటుకు త్వరగా వ్యాప్తి చెందుతుంది.

● సంకరజాతి పశువులు త్వరగా ఈ వ్యాధి బారిన పడతాయి.

జిల్లాకు 2.31లక్షల డోసులు

జిల్లాలోని పశువులకు అవసరమైన డోసుల్లో మొదటి దశలో 2.31 లక్షల డోసులు జిల్లాకు చేరుకున్నాయి. నాలుగు నెలల పైబడి ఉన్న పశువులకు మాత్రమే వ్యాధి నిరోధక టీకాలు తప్పనిసరిగా వేయించాలి. నాలుగు నెలలు దాటి తొలిసారి టీకాలు వేయిస్తున్న దూడలకు నెల రోజుల తర్వాత బూస్టర్‌ డోస్‌ వేస్తారు. జిల్లాలో 74 వేలు వైట్‌ క్యాటిల్స్‌, 1.86 బ్లాక్‌ క్యాటిల్స్‌ ఉన్నాయి. పశువైద్యశాఖ ద్వారా ఉచితంగా వ్యాధి నిరోధక టీకాలు వేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 31 వరకు వ్యాధి నిరోధక టీకాలు వేస్తారు. జిల్లా కేంద్రం నుంచి మండల కేంద్రాలకు కూడా వ్యాధి నిరోధక టీకాలను పంపిణీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement