నిగ్గు తేలినా సిగ్గు వదలరా?
సాక్షి, రాజమహేంద్రవరం: తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన దుష్ప్రచారం పటాపంచలైంది. చంద్రబాబు, కూటమి నేతల చేసిన ఆరోపణల్లో నిజం లేదని, లడ్డూలో ఎలాంటి జంతువుల కొవ్వు కలవలేదని సీబీఐ తేల్చేసింది. స్వార్థ రాజకీయాలకు చివరకు తిరుమల వేంకటేశ్వర స్వామిని సైతం వాడుకున్న చంద్రబాబు, పవన్‌కళ్యాణ్, కూటమి నేతలకు మంచిబుద్ధి ప్రసాదించాలని, కూటమి నేతల అపచారం పోవాలని.. వైఎస్సార్ సీపీ పాప ప్రక్షాళన పూజలు చేపట్టింది. పార్టీ ఆదేశాల మేరకు తిరుమల తిరుపతి లడ్డూ వ్యవహారంపై చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారాలకు నిరసనగా జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్లు, పార్టీ శ్రేణులు, ప్రజలు వేంకటేశ్వర స్వామి ఆలయాల్లో పాప ప్రక్షాళన ప్రత్యేక పూజలు నిర్వహించారు. కూటమి ప్రభుత్వం పాపం మీద పాపం చేస్తూ తిరుమల క్షేత్రానికి కళంకం తీసుకువస్తోందని నేతలు అన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలని జిల్లావ్యాప్తంగా భక్తులు డిమాండ్ చేశారు.
రాజమహేంద్రవరం సిటీ
తిరుమల ప్రసాదానికి చంద్రబాబు ఘోర అపచారం చేశారని వైఎస్సార్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్ అన్నారు. పవిత్ర తిరుమల ప్రసాదాన్ని రాజకీయాలకు వాడుకోవడం దారుణమన్నారు. స్థానిక టీటీడీ కల్యాణ మండపంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆధ్వర్యంలో పాప పరిహార పూజలు నిర్వహించారు. శ్రీ వేంకటేశ్వర స్వామికి చంద్రబాబు చేసిన ఘోర అపచారం కారణంగా రాష్ట్రానికి, ప్రజలకు ఎలాంటి నష్టం కష్టం రాకూడదని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ పాప పరిహార పూజలు చేశామని భరత్ తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో దేశంలోనే ప్రముఖమైన ఎన్డీడీబీ, ఎన్డీఆర్‌ఏ ల్యాబ్‌లు చేసిన పరీక్షల్లో చంద్రబాబు ఆరోపించినట్టుగా ఎలాంటి జంతువుల కొవ్వు గాని, గొడ్డు కొవ్వు గాని, పంది కొవ్వు గాని తిరుమల ప్రసాదంలో వాడే నెయ్యిలో లేదని తేలిపోవడం అందరికీ చాలా సంతోషాన్ని, భక్తులకు ఊరటను ఇచ్చిందన్నారు.
రాజమహేంద్రవరం రూరల్
రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం ధవళేశ్వరం శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు, ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుమల ప్రసాదానికి చంద్రబాబునాయుడు ఘోర అపచారం చేశారని, ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకుని చంద్రబాబునాయుడు తప్పులు చేస్తున్నారన్నారు. పవిత్ర తిరుమల తిరుపతి ప్రసాదాన్ని రాజకీయాలకు వాడుకోవడం దారుణమన్నారు. చంద్రబాబు నాయుడు కుట్రల కారణంగా కలిగిన అపచారాల వల్ల రాష్ట్ర ప్రజలకు ఎలాంటి కష్టం– నష్టం కలుగకుండా పాప పరిహార పూజలు నిర్వహించినట్లు వేణు వెల్లడించారు.
అనపర్తి
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందంటూ చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ అండ్ కో చేసిన ప్రచారం పూర్తిగా అబద్ధమని కోర్టుకు సమర్పించిన చార్జ్‌షీట్‌తో స్పష్టమైందని అనపర్తి నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి అన్నారు. పవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం కోట్లాది హిందూ భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరచడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనపర్తిలోని పోతారెడ్డి రామాలయం ప్రాంగణంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పరిహార పూజలు నిర్వహించారు.
కొవ్వూరు
తిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని వేదికగా చేసుకుని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, కూటమి నేతలు చేస్తున్న కుట్రలు దారుణమని వైఎస్సార్ సీపీ కొవ్వూరు నియోజకవర్గ సమన్వయ కర్త, మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు అన్నారు. స్థానిక శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో పాప ప్రక్షాళన పూజలు నిర్వహించారు. ఆలయం బయట చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చంద్రబాబుకు, పవన్‌కళ్యాణ్‌కు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరారు. రాజకీయ స్వార్థం కోసం చంద్రబాబు కోట్లాది భక్తుల మనోభావాలతో ఆడుకున్నారన్నారు. దుర్మార్గపు కుట్రను తిరుమల వెంకన్న స్వామే కూల్చేశారన్నారు. నిజాలు తెలిసినప్పటికీ ఇంకా అసత్య ప్రచారం చేయడం దారుణమన్నారు.
రాజానగరం
తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలవలేదని సీబీఐ చెప్పినా.. చంద్రబాబు, కూటమి నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండించాలని వైఎస్సార్ సీపీ అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి అన్నారు. పాప ప్రక్షాళన పూజల్లో భాగంగా రాజానగరంలోని రావులచెరువు గట్టున ఉన్న వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద జక్కంపూడి విజయలక్ష్మి, పార్టీ శ్రేణులు కొబ్బరికాయలు కొట్టారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నిడదవోలు
తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కూటమి నేతలు చేసిన నీచమైన విష ప్రచారం పూర్తిగా అసత్యమని తేలింది. అయినా అసత్య ప్రచారాలతో భక్తుల మనోభావాలను గాయపరుస్తున్న టీడీపీ నేతల వైఖరిగా నిరసనగా నిడదవోలు పట్టణంలో కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో వైఎస్సార్ సీపీ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
గోపాలపురం
తిరుమల లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారం చేసిన కూటమి నేతలకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ గోపాలపురంలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో వైఎస్సార్ సీపీ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవరపల్లి, గోపాలపురం, నల్లజర్ల మండలాల పారీ అధ్యక్షులు, నేతలు బస్టాండ్ సెంటర్‌లో రాస్తారోకో చేపట్టారు.
అనపర్తిలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో పూజల అనంతరం నిరసన తెలుపుతున్న మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి
రాజానగరంలో కొబ్బరి కాయలు కొడుతున్న
వైఎస్సార్ సీపీ అమలాపురం పార్లమెంటరీ పరిశీలకురాలు విజయలక్ష్మి
తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదని సీబీఐ నిర్ధారణ
అయినా టీడీపీ చేస్తున్న అసత్య
ప్రచారంపై వైఎస్సార్ సీపీ ఆగ్రహం
వేంకటేశ్వరస్వామి ఆలయాల్లో
పాప ప్రక్షాళన పూజలు
జిల్లావ్యాప్తంగా అన్ని నియోజక
వర్గాల్లో నిర్వహించిన పార్టీ శ్రేణులు
నిగ్గు తేలినా సిగ్గు వదలరా?
నిగ్గు తేలినా సిగ్గు వదలరా?


