కల్యాణ వీణ.. మోగేటి వేళ..
● మాఘం నుంచి మోగనున్న
మంగళ వాయిద్యాలు
● జూన్ వరకు మంచి ముహూర్తాలు
● వివాహ, అనుంబంధ రంగాల
వ్యాపారాలకు అనువైన కాలం
తాళ్లపూడి: మాఘమాసం ఎప్పడొస్తుందో.. మౌన రాగాలెన్ని నాళ్లో.. అని కూనిరాగాలు తీసే కన్నెపిల్లలకు కలిసొచ్చే కాలం వచ్చేసింది. శ్రీరస్తు.. శుభమస్తు.. అవిఘ్నమస్తు అని కల్యాణ శుభలేఖలు అచ్చు వేయించే మంచి ముహూర్తాలు ముంచుకొచ్చేస్తున్నాయి. సనాతన ధర్మంలో వివాహ వ్యవస్థకు ఎంతో విశిష్ట స్థానం ఉంది. కాలానికి అనుగుణంగా ట్రెండ్ అందుకోకపోతే ఏదో మనం వెనకపడ్డామా అన్న ఫీలింగ్ వధూ వరులిద్దరిలోనూ ఉంటుంది. అన్ని రంగాల్లోను ఆధునిక సాంకేతికతలో మార్పులు వచ్చినట్టే వివాహ వేడుకలలోకీ దూసుకొచ్చేశాయి. ప్రీ వెడ్డింగ్, పోస్టు వెడ్డింగ్ షూట్‌లు, డ్రోన్ ఫొటోగ్రఫీ, ఏసీ ఫంక్షన్ హాళ్లు, విద్యుత్ సెట్టింగ్‌లు, భారీ డెకరేషన్లు, రిసెప్షన్లు అన్నింటా పెద్ద మార్పులే చోటుచేసుకున్నాయి. ఇలాంటివి ఎన్నున్నా మామిడి తోరణాలు, తాటాకు పందిళ్లది మాత్రం ప్రత్యేక ఆకర్షణ. మాఘం ఆగమించడంతో పెళ్లి బాజాలు మోగనున్నాయి. జూన్ వరకు మంచి మూర్తాలు ఉండగా, జూలై 22 తరువాత నుంచి నవంబర్ 20 వరకు మళ్లీ ఖాళీ. దీంతో నియోజకవర్గంలో పెళ్లి సందళ్లు మొదలయ్యాయి. నియోజకవర్గంలో 19 వరకు ఫంక్షన్ హాళ్లు ఉన్నాయి. కొవ్వూరులో 7, తాళ్లపూడిలో 8, చాగల్లులో 4 వరకు కల్యాణ మండపాలున్నాయి.
జోరుగా వ్యాపారాలు
ఈ సీజన్‌లో వ్యాపారాలు జోరందుకోనున్నాయి. దుస్తులు, బంగారం, ఇతర వస్తువుల కొనుగోళ్లు భారీగా సాగుతాయి. ఏసీ ఫంక్షన్ హాళ్లు, బ్యాండ్ పార్టీలు, పురోహితులు, క్యాటరింగ్, ఫొటోగ్రాఫర్లు, టెంట్, లైటింగ్, డేకరేషన్, ఈవెంట్ ఆర్గనైజర్లు, ఇలా అందరికీ చేతి నిండా పని దొరుకుతుంది. ఒక్కో పెళ్లి, ఫంక్షన్‌కు రూ.10 లక్షల నుంచి రూ.35 లక్షల వరకు ఖర్చు కానుంది.
ఏసీ కల్యాణ మండపాలపై ఆసక్తి
ఇటీవల వివాహాది శుభకార్యాలకు ఏసీ కల్యాణ మండపాలపై ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. మిరిమిట్లు గొలిపే విద్యుద్దీపాలంకరణలు, వేదికల సెట్టింగులు ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. మారుమూల గ్రామాల్లో సైతం ఈ మండపాలు ఉన్నాయి.
పెళ్లికి వారం రోజుల ముందు నుంచే వివిధ రకాల స్వాగత తోరణాలు, కల్యాణ మండపాలను ఏర్పాటు చేస్తున్నారు. ఏసీ కళ్యాణ మంపడం అయితే ఖర్చులన్నిటితో కలిపి రూ.80 వేల నుంచి సుమారు రూ. రెండు లక్షల వరకు వసూలు చేస్తున్నారు.
పచ్చి పూల మండపాలకు గిరాకీ
నిశ్చయ తాంబూలాల నుంచి చిన్నచిన్న ఫంక్షన్‌లకు సైతం పచ్చిపూల మండపాలు ఏర్పాటు చేయడం తప్పనిసరైంది. ఒక్క వివాహానికి లైటింగ్, క్లాత్ సెట్టింగ్‌కు రూ.25 వేలు నుంచి రూ.లక్షకు పైగా ఖర్చవుతుంది. పచ్చిపూల మండపానికి అయితే రూ.25 వేల నుంచి రూ. 1.7 లక్షలకు పైగా వెచ్చిస్తున్నారు. అలాగే ఫ్లెక్సీలు, ఎల్‌ఈడీ స్క్రీన్లు, పత్రికా ప్రకటనలకు, మ్యుజికల్ నైట్, స్కిట్లు, ఈవెంట్లకు అదనపు వ్యయం తప్పదు.
ప్రీ, పోస్టు వెడ్డింగ్ షూట్‌లు
పెళ్లినాటి జ్ఞాపకాలు పది కాలాల పాటు పదిలం చేసుకోవడానికి ఫొటోలు తీయించుకోవడం అనవాతీ. పందిరి రాట మొదలు, అత్తవారింటికి వెళ్లే వరకు ఆ మధుర క్షణాలకు కొదవుండదు. అందుకు డిజిటల్ ఫొటో అల్బమ్ దగ్గర నుంచి వీడియోల వరకు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతున్నారు. ఇందుకు డ్రోన్ టెక్నాలజీ, ఎల్‌ఈడీ స్క్రీన్ల ఏర్పాటు, టీజర్లు, ప్రీ, పోస్టు వెడ్డింగ్ షూట్‌లు, మెహందీ వంటివి నిర్వహిస్తున్నారు.
క్యాటరింగ్ కల్చర్
బంధుజనాలు పది కాలాలు చెప్పుకొనేలా విందు భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు క్యాటరింగ్‌కు అప్పగిస్తూ భారీ మెనూతో భోజనాలు పెడుతున్నారు. అంతే కాకుండా అతిథులకు స్వాగత సత్కారాలు చేయడానికి కుందనపు బొమ్మల్లాంటి యువతులను సింహ ద్వారాల వద్ద ఏర్పాటు చేస్తున్నారు.
23 మంచి ముహూర్తాలు
ఈ మాఘమాసం మొదలు జూలై 11 వరకు పెద్ద ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెప్తున్నారు. పెళ్లిళ్లతోపాటు గృహప్రవేశాలు, శంకుస్థాపనలు కూడా ఊపందుకున్నాయి. ఐదు నెలల పాటు ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై నెలల్లో మాఘ, చైత్ర, వైశాఖ, జ్యేష్ట మాసాల్లో పెళ్లి బాజాలు మోగుతూనే ఉంటాయి.
ఫిబ్రవరి: 5, 6, 8, 10, 12, 14, 19, 20, 21, 24, 25, 26 తేదీల్లో, మార్చిలో 3, 4, 7, 8, 9, 11, 12, ఏప్రిల్‌లో 15, 20, 21, 25, 26 తేదీల్లో, మే నెలలో 1, 3, 5, 6, 7, 8, 13, 14 తేదీల్లో, జూన్‌లో 21, 22, 23, 24, 25, 26, 27, 29 తేదీల్లో, జూలైలో 1, 6, 7, 11 తేదీల వరకు ఉన్న ముహూర్తాలలో పెళ్లిళ్లు జరగనున్నాయి.
కల్యాణ వీణ.. మోగేటి వేళ..
కల్యాణ వీణ.. మోగేటి వేళ..


