గర్జించిన విద్యాలోకం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): కందుకూరి రాజ్యలక్ష్మీ మహిళా కళాశాల హాస్టల్‌ను రాజకీయ రాబందుల చేతిలోంచి రక్షించాలని, వెంటనే దానిని ప్రభుత్వం స్వాఽఽధీనం చేసుకోవాలని విద్యార్థులు కదం తొక్కారు. కొద్దిరోజులుగా విద్యార్థులు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు కందుకూరి రాజ్యలక్ష్మీ మహిళా కళాశాల హాస్టల్‌ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఆందోళనలు చేస్తున్నారు. దీనిలో భాగంగా శనివారం కలెక్టర్ బంగ్లా వద్ద వందల మంది విద్యార్థులు బైఠాయించారు. పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. దీంతో పోలీసు బలగాలు ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. పోలీసులు ఆందోళన చేస్తున్న వారిని అక్కడ నుంచి పంపించి వేసేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో ఇద్దరు విద్యార్థులకు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులకు గాయాలయ్యాయి. ముందుగా ఉన్నత విద్యా రీజినల్ జాయింట్ డైరెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకుని ఆందోళన చేశారు. ఆర్జేడీ బయటకు వచ్చినా విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు. అక్కడి నుంచి విద్యార్థులు భారీ ర్యాలీగా కలెక్టర్ క్యాంప్ ఆఫీస్‌కు చేరుకున్నారు. సమస్యలను రాసి వినతిపత్రం పట్టుకుని రమ్మని, దానిపై చర్చించి సమస్య పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. దీంతో వారు సాయంత్రం ఆర్డీవో కార్యాలయానికి చేరుకుని ఆర్డీవోకు వినతిపత్రం ఇచ్చారు.
మాజీ ఎంపీ భరత్ మద్దతు
కార్యక్రమానికి మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ మద్దతు తెలియజేస్తూ విద్యార్థుల సమస్య పరిష్కారం అయ్యే వరకూ వారికి మద్దతుగా ఉంటామని, దీనిపై కోర్టులో కేసు వేస్తామని చెప్పారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు పి.రామ్మోహన్ మాట్లాడుతూ జీవో నంబర్ 42 ప్రకారం కందుకూరి విద్యాసంస్థలు ఐదింటిలో నాలుగు ప్రభుత్వ పరం అయ్యాయన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్నట్టు ప్రతీ విద్యాసంస్థకి జీవోలు వచ్చాయని, అందులో భాగమైన కందుకూరి రాజ్యలక్ష్మి మహిళా కళాశాల జీవో నెం 28 ప్రకారం స్థర, చర ఆస్తులతో 2022 నుంచి ప్రభుత్వ కళాశాలగా నడుస్తోందన్నారు. హితకారిణి సమాజం చైర్మన్, పాలకమండలి, ఎండోమెంట్ ఈఓ కలిసి కళాశాల ప్రిన్సిపాల్ లేని సమయంలో స్టూడెంట్ మేనేజ్‌మెంట్ హాస్టల్‌ని దౌర్జన్యంగా లాగేసుకున్నారన్నారు. ఆ సమయంలో ఆర్జేడీ ఉన్నా దానిని ఆపలేదన్నారు. దానిని అడ్డుకున్న విద్యార్థులు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులపై కేసులు బనాయించారన్నారు. కళాశాల మొత్తం క్యాంపస్ ప్రభుత్వానిదేనని, దీనిలో ఇతర డిపార్ట్‌మెంట్, హితకారిణి సమాజం ఎందుకు జోక్యం చేసుకుందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
కందుకూరి రాజ్యలక్ష్మీ
వుమెన్స్ కళాశాల హాస్టల్
తక్షణమే ప్రభుత్వం
స్వాధీనం చేసుకోవాలి
భారీ ఎత్తున ఆందోళన,
ధర్నా చేసిన విద్యార్థులు
పోలీసుల తోపులాటలో
విద్యార్థులకు, ఎస్‌ఎఫ్‌ఐ
నాయకులకు గాయాలు


