యువ ఓటర్లతోనే దేశ భవిత
● ఇన్‌చార్జి కలెక్టర్ మేఘ స్వరూప్
● ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవం
సీటీఆర్‌ఐ: భారత ఎన్నికల కమిషన్ స్థాపనను పురస్కరించుకుని ఏటా జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్టు ఇన్‌చార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మేఘస్వరూప్ అన్నారు. ఆదివారం రాజమహేంద్రవరంలోని శ్రీవెంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో 16వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ‘నా భారతదేశం–నా ఓటు’ అనే థీమ్‌తో ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. యువ ఓటర్ల భాగస్వామ్యంతోనే దేశ భవిష్యత్తు మరింత బలంగా రూపుదిద్దుకుంటుందని పేర్కొన్నారు. ప్రతి ఓటరు అవగాహనతో, నిర్భయంగా, నిష్పక్షపాతంగా ఓటు హక్కును వినియోగించినప్పుడే చైతన్యవంతమైన, బలమైన ప్రజాస్వామ్యం సాధ్యమవుతుందని తెలిపారు. నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా మాట్లాడుతూ నగరంలోని 2.55 లక్షల మంది ఓటర్లు రానున్న ఎన్నికల్లో నూరుశాతం ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా నూతనంగా ఓటర్లకు గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు. జిల్లా స్థాయిలో కళాశాలలు, పాఠశాలల్లో నిర్వహించిన పలు పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ సీతారామమూర్తి వివిధ జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. స్థానిక ఎస్‌కేవీటీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులు కళాశాల నంచి కంబాలచెరువు వరుకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో డిప్యుటీ కమిషనర్ వెంకటరమణ, అర్బన్ తహసీల్దార్ పాపారావు, కళాశాల ప్రిన్సిపాల్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆనం కళాకేంద్రంలో పోటీలలో నెగ్గిన విద్యార్ధులకు బహుమతులను అందచేశారు.


