ఆశ్రయించిన వారిని వదలను
● యుధిష్ఠిరుని ధర్మాన్ని వివరించిన సామవేదం
● ముగిసిన ప్రవచన యజ్ఞం
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): స్వర్గ సుఖాల కోసం తనను ఆశ్రయించిన వారిని వీడనని ధర్మరాజు ఇంద్రునితో చెబుతాడని సామవేదం షణ్ముఖశర్మ వివరించారు. హిందూ సమాజంలో ఆదివారం ఆయన మహాప్రస్థానిక, స్వర్గారోహణ పర్వాలతో ప్రవచన యజ్ఞాన్ని ముగించారు. ‘నన్ను అనుసరించి వచ్చిన శునకాన్ని వీడను. స్వర్గం లేకపోయినా ఫరవాలేదు. ఆశ్రయించిన భక్తుని, ఆర్తుని, స్వీయ రక్షణ చేసుకోలేక, ప్రాణాలు కాపాడుకోదలచిన వానిని వదలిపెట్టరాదని’ ధర్మరాజు ఇంద్రునితో అంటాడు. ఈ మాటలకు శునకం ధర్మునిగా సాక్షాత్కరించింది. రాజులందరూ నరకాన్ని చూడవలసిన వారే కనుక, ధర్మరాజు ముహూర్తకాలం నరకాన్ని ఽచూడవలసి వచ్చిందని సామవేదం వివరించారు. ద్రౌపది స్వర్గలక్ష్మిగా ధర్మరాజుకు గోచరించింది. లక్ష్మి అన్న పదానికి విష్ణుపత్ని అన్న ఒకే అర్థం కాదని చెప్పారు. యుద్ధంలో మరణించిన వారినందరినీ చూడగలిగాడని అన్నారు. సశరీరంగా స్వర్గానికి చేరుకున్న మహాత్ముడు ధర్మరాజు. భారతం మహేతిహాసం, సత్యవాది అయిన వ్యాస భగవానుడు మూడు సంవత్సరాలలో దీనిని నిర్మించాడు. ఏకాగ్రతతో దీనిని విన్నవారు ఉత్తమ ఫలితాలను పొందుతారని ఫలశ్రుతి చెబుతోందని సామవేదం అన్నారు. అష్టాదశ పురాణాలు, వేద వేదాంగాలు అన్ని శాస్త్రాలు భారతంలో ఉన్నాయని వ్యాసుడే స్వయంగా చెప్పాడని తెలిపారు. భారతంలో నాలుగో భాగం విన్నా, వినిపించినా, సంపూర్ణభారతం చదివిన ఫలితం కలుగుతుందని అన్నారు. ‘లోకంలో జీవుడికి వేల కొలది తండ్రులు, తల్లులు, పుత్రులు అనుభవానికి వస్తారు. వచ్చారు. కష్టసుఖాలకు వివేకవంతులు లొంగిపోరు. ‘ఊర్ధ్వ బాహుర్విరౌమ్యేష న చ కశ్చిచ్ఛృణోతి మే, ధర్మాదర్థశ్చ కామశ్చ స కిమర్థం న సేవ్యతే’ శ్లోకాన్ని వివరిస్తూ రెండు చేతులు పైకెత్తి ఆక్రోశిస్తున్నాను.. ధర్మం వలనే అర్థకామ్యాలు సిద్ధిస్తాయి. అటువంటి ధర్మాన్ని ఎందుకు సేవించరు?’ అని వ్యాసుడు స్వర్గా రోహణ పర్వంలో ప్రశ్నించినట్టు సామవేదం వివరించారు. అనంతరం సామవేదం షణ్ముఖశర్మ దంపతులను పుర ప్రముఖులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రవచన రాజహంస దూళిపాళ్ల మహాదేవమణి, మహా మహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ, స్వాధ్యాయరత్న గుళ్లపల్లి సీతారామ ఘనపాఠి, హిందూ సమాజం అధ్యక్షుడు న్యాపతి సుబ్బారావు, భాగవత విరించి డాక్టర్ టీవీ నారాయణరావు మాట్లాడారు. అనంతరం సామవేదం చేతుల మీదుగా శ్రోతలకు ప్రసాద వితరణ చేశారు.
ఆశ్రయించిన వారిని వదలను


