బుద్ధిస్ట్ సర్క్యూట్ల అభివృద్ధికి కృషి
● మంత్రి కందుల దుర్గేష్
● వైభవంగా బుద్ధ విహార్ కలశ ప్రతిష్ఠ
నిడదవోలు: రాష్ట్రంలోని చారిత్రక బౌద్ధ క్షేత్రాలను అనుసంధానిస్తూ అంతర్జాతీయ స్థాయి బుద్ధిస్ట్ స ర్క్యూట్‌ల అభివృద్ధికి కృషి చేస్తున్నట్టు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఉండ్రాజవరంలో నిర్మించిన మైత్రేయ బుద్ధ విహార్ కలశ ప్రతిష్ఠ మహోత్సవం ఆదివారం వైభవంగా నిర్వహించారు. దుర్గేష్‌తో పాటు రాష్ట్ర స్కిల్ డెవలప్‌మెంట్ చైర్మన్ బూ రుగుపల్లి శేషారావు ముఖ్య అతిథులుగా హాజరై బుద్ధుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు తణుకు నుంచి ఉండ్రాజవరం వరకు కలశాల రథాలతో బౌద్ధ భిక్షువులతో కలిసి శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ గత 11 ఏళ్లుగా బౌద్ధ భిక్షువు ఆనాలయు నేతృత్వంలో బౌద్ధ ధమ్మపీఠం చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. ఎకరం విస్తీర్ణంలో నిర్మించిన ఈ విహార్ ద్వారా చిన్నారులకు విద్య, వైద్యం, యోగా, ధ్యానం, వక్తృత్వం, కరాటే, చిత్రలేఖనంలో ఉచిత శిక్షణ అందించడం గొప్ప విషయమని కొనియాడారు. రాష్ట్రంలో అమరావతి, నాగార్జునకొండ, బొజ్జన్నకొండ, తోట్లకొండ వంటి చారిత్రాత్మక బౌద్ధ ప్రాంతాలను కలిపి బుద్ధిస్ట్ సర్క్యూగా తీర్చిదిద్ది కేంద్ర ప్రభుత్వ సహకారంతో పర్యాటక రంగంలో అగ్రగామిగా నిలుపుతామని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. కార్యక్రమంలో తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, బుద్ధ విహర్ పీఠాధిపతి భంతేజీ అనాలయో పాల్గొన్నారు.


