పప్పన్నానికీ పగ్గాలేనా?
వంటింట్లో బియ్యంతో పాటు పప్పు.. ఉప్పు.. చింతపండు ఉంటే ఓ సగటు జీవి కుటుంబానికి ఆ రోజు గడచిపోతుంది. వీటిలో ఏ ఒక్కదానికి కొరత ఏర్పడినా గంజన్నం.. నంజుకోవడానికి ఓ పచ్చడితో ఆ రోజు వెళ్లదీస్తాడు. మనసారా ముద్ద దిగాలంటే కనీసం కందిపప్పు ఎంతో అవసరం. ముద్ద పప్పుకై నా.. చారులో వేసుకోవడానికై నా. ఆ మాత్రం కూడా చేయలేని చేతకాని ప్రభుత్వాలు ఉంటే ఎంత.. ఊడితే ఎంత? తీవ్రమైన కొరత ఏర్పడి అమాంతం ధరలు పెరిగిపోయి కొనలేని పరిస్థితి ఉంది.. అయ్యో పాపం అనుకుందామనుకున్నా.. ధర బాగా తగ్గినప్పుడైనా సబ్సిడీపై ఇవ్వడానికేం అని సగటుజీవి చంద్రబాబు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నాడు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో బహిరంగా మార్కెట్ ధరతో సంబంధం లేకుండా సబ్సిడీపై కేవలం రూ.67 కే ప్రజలకు అందజేసేది. సుష్టుగా భోంచేసి కడుపు నింపుకోవడానికి ఇంతకు మించి ఏముంటుందని ప్రజలు నాటి ప్రభుత్వ పాలనతో పోల్చుకుంటున్నారు.
సాక్షి, రాజమహేంద్రవరం: చౌక దుకాణాల్లో సబ్సిడీపై అందించే కందిపప్పు సరఫరాను చంద్రబాబు ప్రభుత్వం నిలిపివేసింది. కూటమి ప్రభుత్వం పగ్గాలు చేపట్టినప్పటి నుంచీ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఎత్తివేయడమే లక్ష్యంగా పనిచేస్తోంది. ఇందులో భాగంగా ఆర్థిక భారం తగ్గించుకునే క్రమంలో ప్రేదలకు ప్రియమైన కందిపప్పును నెమ్మదిగా వదిలించుకుంటోంది. దుకాణాలకు సక్రమంగా సరఫరా చేయకుండా నియంత్రిస్తోంది. కేవలం అంగన్‌వాడీ కేంద్రాలకు మాత్రమే తప్పదన్నట్టు పంపిణీ చేస్తోంది.
16 నెలలుగా అరకొరే..
ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు నిత్యావసరాలైన కందిపప్పు, బియ్యం, చక్కెర సబ్సిడీ ధరకు చౌకదుకాణాల్లో అందజేయాల్సి ఉంది. 16 నెలలుగా కంది పప్పు అవసరమైన మేరకు సరఫరా చేయడం లేదు. రేషన్ దుకాణాలకు వెళ్లిన లబ్ధిదారులు కందిపప్పు లేక నిరాశగా తిరిగివస్తున్నారు. కొన్ని నెలల క్రితం బహిరంగ మార్కెట్లో కందిపప్పు కిలో రూ.180 వరకు వెళ్లింది. ఈ ధర కొన్ని నెలల పాటు కొనసాగింది. ఈ సమయంలో సబ్సిడీపై ప్రజలకు అందజేయాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసింది. టెండర్లు పిలిస్తే కాంట్రాక్టర్లు అధిక ధరకు కోట్ చేస్తారన్న భయంతో పూర్తిగా పంపిణీయే వద్దనుకుంది. ప్రస్తుతం మార్కెట్లో కందిపప్పు కిలో రూ.130 ఉంది. ధర తగ్గినప్పుడైనా సబ్సిడీపై చౌక దుకాణాల ద్వారా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ముందుకు రాకపోవడం బాధాకరం. నిజానికి కందిపప్పు సబ్సీడీపై కిలో రూ.67కు అందించాలి. అంటే ప్రభుత్వం బహిరంగ మార్కెట్‌లో హోల్‌సేల్‌లో కొన్నా కిలో రూ.100కు లభిస్తుంది. అది కొని ప్రజలకు పంపిణీ చేసినా రూ.30కి మించి ప్రభుత్వంపై భారం పడదు. అయినా తగిన చర్యలు తీసుకోవడం లేదంటే ప్రజా సంక్షేమంపై ఎంత నిర్లక్ష్యం ఉందో అర్ధం చేసుకోవచ్చు.
జిల్లాలో ఇలా..
జిల్లా వ్యాప్తంగా 871 రేషన్ దుకాణాలు ఉన్నాయి. సుమారుగా 5,69,014 రేషన్ కార్డులున్నాయి. 15,77,393 మందికి రేషన్ షాపుల ద్వారా సరుకులు అందజేస్తోంది. రేషన్ కార్డులకు సంబంధించి ప్రతి నెలా 564.9 టన్నుల కందిపప్పు అవసరం ఉంది. ప్రతి నెలా 20వ తేదీ లోపు రేషన్ డీలర్లు డీడీలు తీసి, అవసరమైన సరకులను దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. రేషన్ డీలర్లు డీడీలు తీస్తున్నా.. పౌరసరఫరా శాఖ మాత్రం అవసరమైన మేరకు కాకుండా అరకొరగా కందిపప్పు సరఫరా చేస్తోంది. జిల్లాకు 564 టన్నులు కందిపప్పు కావాల్సి ఉండగా.. కేవలం వంద, 150 టన్నులు మాత్రమే సరఫరా చేస్తుండటంతో ప్రజలకు పూర్తి స్థాయిలో కందిపప్పు అందడం లేదు. ఈ నెల పూర్తిగా ఆపేశారు. కేవలం అంగన్‌వాడీ కేంద్రాలకు మాత్రం 20 టన్నులు సరఫరా చేసింది. కందిపప్పు కోసం డీడీలు తీయవద్దని అధికారులు ముందస్తు సమాచారం ఇచ్చారు. దీంతో పూర్తి స్థాయిలో డీడీలు కట్టడం మానేశారు. బియ్యం, పంచదారతో పాటు కందిపప్పు కావాలని ప్రజలు రేషన్ షాపు డీలర్లను అడుగుతుంటే.. తమకే రాలేదన్న సమాధానం వస్తోంది. ప్రభుత్వ వ్యవహార శైలి చూస్తుంటే రేషన్ దుకాణాల నుంచి కందిపప్పు పంపిణీని పూర్తిగా ఎత్తివేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కందిపప్పు పంపిణీలో మొండిచేయి
చౌక దుకాణాల్లో
16 నెలలుగా అరకొర సరఫరా
జిల్లా వ్యాప్తంగా నెలకు
564.9 టన్నులు అవసరం
కిలో రూ.180 ఉన్నపుడు ఎలాగూ లేదు
రూ.130కి దిగినప్పుడైనా ఇవ్వరా?
చంద్రబాబు ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్న రేషన్ లబ్ధిదారులు
పేదలపై భారం
చౌక దుకాణాలు, ఎంఎల్‌ఎస్ పాయింట్లలో కందిపుప్పు నిల్వలు నిండుకోవడంతో లబ్ధిదారులు బహిరంగ మార్కెట్‌లో అధిక ధరలు పెట్టి కొనాల్సివస్తోంది. జిల్లా వ్యాప్తంగా 5 ఎంఎల్‌ఎస్ (మండల స్థాయి స్టాక్ పాయింట్లు) పాయింట్ల ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు. ప్రస్తుతం ఒక్క ఎంఎల్‌ఎస్ పాయింట్‌లో కూడా కిలో కందిపప్పు కూడా లేకపోవడం గమనార్హం.
జిల్లాలో రేషన్ కార్డుల వివరాలు ఇలా..
మండలం చౌక కార్డుల
దుకాణాలు సంఖ్య
అనపర్తి 39 22,593
బిక్కవోలు 40 22,583
చాగల్లు 36 21,242
దేవరపల్లి 34 25,647
గోకవరం 36 22,784
గోపాలపురం 43 21,227
కడియం 45 29,179
కోరుకొండ 43 27,155
కొవ్వూరు 55 33,748
నల్లజెర్ల 42 27,768
నిడదవోలు 51 34,855
పెరవలి 43 23,522
రాజమండ్రి రూరల్ 59 51,060
రాజమండ్రి అర్బన్ 105 83,482
రాజానగరం 48 36,736
రంగంపేట 30 19,908
సీతానగరం 44 24,200
తాళ్లపూడి 34 16,959
ఉండ్రాజవరం 44 24,366
పప్పన్నానికీ పగ్గాలేనా?


