1 నుంచి మార్కెట్ విలువల పెంపు
అభ్యంతరాలకు 29 వరకు గడువు
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలోని అన్ని గ్రామాలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో భూముల మార్కెట్ విలువలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం మెమో జారీ చేసిందని జిల్లా రిజిస్ట్రార్ ఎస్. సత్యనారాయణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పెంపు ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుందన్నారు. ఈ నేపథ్యంలో భూముల మార్కెట్ విలువల పెంపుపై శనివారం కలెక్టరేట్‌లో మార్కెట్ విలువల పెంపుదల కమిటీ అధికారులతో ఇన్‌చార్జి కలెక్టర్ వై.మేఘ స్వరూప్ అధ్యక్షతన సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. పెంచనున్న మార్కెట్ విలువల జాబితాను రిజిస్ట్రేషన్.ఏపీ.జిఓవి.ఇన్ వెబ్‌సైట్‌లోను, సంబంధిత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నోటీస్ బోర్డుల్లోను ప్రదర్శించనున్నట్లు తెలిపారు. ప్రజలు తమ అభ్యంతరాలను ఈ నెల 29వ తేదీ లోపు సంబంధిత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలో తెలియజేయాల్సిందిగా జిల్లా రిజిస్ట్రార్ కోరారు.
డాక్టర్ రవికిరణ్‌కు
అంతర్జాతీయ గౌరవం
సీతానగరం: మండలంలోని పురుషోత్తపట్టణానికి చెందిన డాక్టర్ రవికిరణ్ కాజకు అరుదైన అంతర్జాతీయ గౌరవం దక్కింది. రసాయన శాస్త్రంలో ప్రపంచంలోనే అత్యున్నత పురస్కారాలలో ఒకటైన ‘ఫెలో ఆఫ్ ది రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ సభ్యుడిగా ఆయన ఎంపికయ్యారు. రసాయన శాస్త్రంలో నిరంతర కృషి, అద్భుతమైన పరిశోధనలు చేసిన వారికి లండన్‌లోని రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ ఈ గౌరవాన్ని ప్రదానం చేస్తుంది. డాక్టర్ రవికిరణ్ ప్రస్తుతం యూఎస్ ఫార్మకోపియాలో సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్‌గా పనిచేస్తున్నారు. ఔషధాల నాణ్యతను పెంపొందించడంలో, కాంప్లెక్స్ ప్రొడక్ట్స్ కోసం గ్లోబల్ స్టాండర్ట్స్‌ను రూపొందించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అంతర్జాతీయ వేదికలపై యూఎస్ ఫార్మకోపియా తరఫున ప్రాతినిధ్యం వహిస్తూ ఔషధ రంగ అభివృద్ధికి కృషి చేస్తున్నారు.
29 నుంచి అధ్యయనోత్సవాలు
కోరుకొండ: స్థానిక స్వయంభు లక్ష్మీనరసింహస్వామి వారి అధ్యయనోత్సవాలు 29వ తేదీ నుంచి ఫిబ్రవరి ఆరో తేదీ వరకూ నిర్వహించనున్నట్టు ఆలయ ధర్మకర్త పరాశర రంగరాజ భట్టర్ తెలిపారు. 29న సాయంత్రం 6 గంటలకు గరుడ వాహన సేవ, రాత్రి కొండపైన తిరుప్పల్లాండు, తొళక్కం ప్రారంభం కానున్నాయి. ఉదయం నుంచి స్వామి వారికి సేవాకాలం నిర్వహించనున్నారు. 30న శ్రీ, భూ సమేత అనంతపద్మనాభస్వామి వారు ఆంజనేయ వాహనంపై ఊరేగనున్నారు. ఫిబ్రవరి 3, 4 తేదీల్లో శ్రీరంగనాథస్వామి వారి ఆలయంలో అధ్యయనోత్సవాలు జరుగుతాయి. అలాగే ఫిబ్రవరి 5, 6 తేదీల్లో అనంత పద్మనాభస్వామి వారికి అధ్యయనోత్సవాలు నిర్వహించనున్నారు.
1 నుంచి మార్కెట్ విలువల పెంపు


