ఉపాధికి దొరకని హామీ! | - | Sakshi
Sakshi News home page

ఉపాధికి దొరకని హామీ!

Nov 7 2025 7:25 AM | Updated on Nov 7 2025 7:25 AM

ఉపాధి

ఉపాధికి దొరకని హామీ!

డిమాండ్‌ల సాధనకు ఆందోళన

నగదు రహిత ఆరోగ్య కార్డులు, మిగిలిన అన్ని శాఖల ఉద్యోగుల మాదిరిగానే ఉద్యోగ విరమణ వయస్సు 60 సంవత్సరాల నుంచి 62కు పెంచాలని టీఏలు చాలా కాలంగా డిమాండ్‌ చేస్తున్నారు. బేసిక్‌ వేతనంపై 23 శాతం పెంచేందుకు కూడా ప్రభుత్వం ముందుకురావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం గ్రాడ్యుటీ కూడా లేకపోవడంతో రిటైర్‌మెంట్‌ అనంతరం తీవ్ర అన్యాయానికి గురవుతున్నామని టీఏలు మదనపడుతున్నారు. ఇటీవల ముగ్గురు టీఏలు పదవీ విరమణ చేస్తే ప్రభుత్వం నుంచి ఏ ప్రయోజనం కూడా చూపించని విషయాన్ని ఎవరికి చెప్పుకున్నా తమకు న్యాయం చేయలేదంటున్నారు. రెండు నెలల వేతనాలు విడుదల సహా వివిధ డిమాండ్‌ల సాధన కోసం గురువారం జిల్లావ్యాప్తంగా ఉన్న టీఏలు ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌ టీఏల అసోసియేషన్‌ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా నీటి యాజమాన్య సంస్థ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. సమస్యలు పరిష్కరించకుంటే దశల వారీ ఆందోళనకు సిద్ధం కావాల్సి ఉంటుందని వారు హెచ్చరించారు.

జీతాలు లేక రోడ్డున పడ్డ టీఏలు

పస్తులతో సహవాసం

కనికరం లేని కూటమి సర్కార్‌

సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉపాధి హామీ పథకంలో క్షేత్ర స్థాయిలో ఉపాధి కూలీలకు అవసరమైన అన్ని రకాల సేవలు అందించే టెక్నికల్‌ అసిస్టెంట్‌ల పరిస్థితి దయనీయంగా మారింది. పది మంది నిరుపేదలకు పనులు కల్పించడంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న టెక్నికల్‌ అసిస్టెంట్‌లు పస్తులతో సహవాసం చేస్తున్నారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకంలో అన్నీ తానై అందరికీ ఉపాధి చూపించే సాంకేతిక నిపుణులు ఆకలి కేకలతో అల్లాడిపోతున్నారు. ఉపాధి హామీలో చిరుద్యోగులైన టెక్నికల్‌ అసిస్టెంట్‌ల కుటుంబాలకు కూటమి సర్కార్‌ నిర్వాకంతో పూటగడవడమే గగనమవుతోంది. అసలే ఉన్న జీతాలే సరిపోక అల్లాడుతుంటే ఉన్న జీతం కూడా ఇవ్వకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తుంటే టెక్నికల్‌ అసిస్టెంట్‌లు అష్టకష్టాలు పడుతున్నారు. ఉద్యోగాల్లో జాయిన్‌ అయి 18 ఏళ్లు గడచిపోయింది. చాలీచాలని జీతాలైనా ఉన్న ఉద్యోగాలు వదులుకోలేక, బయటకు వస్తే ప్రత్యామ్నాయం లేక పోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఉన్నచోటే సర్దుకుపోతున్నారు.

ఎన్నికల నోటిఫికేషన్‌ రావడంతో..

2007 మే నెలలో జిల్లా స్థాయి ఎంపిక కమిటీ (డీఎస్‌సీ)లో లిఖిత పూర్వక పరీక్షతోపాటు ఇంటర్వ్యూలలో అన్నింటా అర్హత సాధించిన వారిని టెక్నికల్‌ అసిస్టెంట్‌గా ఎంపిక చేశారు. ఇంటర్‌ తరువాత ఐటీఐ లేదా తత్సమాన డిప్లొమా(సివిల్‌) చేసిన వారికి ప్రాధాన్యం ఇచ్చారు. అప్పట్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రాతిపదికన వీరిని ఎంపిక చేశారు. జనాభా ప్రామాణికంగా రెండు, మూడు గ్రామాలకు ఒక టెక్నికల్‌ అసిస్టెంట్‌ను నియమించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉపాధి హామీ పథకంలో టెక్నికల్‌ అసిస్టెంట్‌(టీఏ)లుగా 200 నుంచి 250 మంది పనిచేస్తున్నారు. ఇలా 18 ఏళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న టీఏలకు 50 ఏళ్లు వయసు దాటిపోయింది. రూ.4,500తో ప్రారంభమైన వేతనాలు సర్వీసును బట్టి రూ.18,500 నుంచి రూ.28,000కు చేరుకున్నాయి. వేతనాల పెంపు, పీఆర్సీ, నగదు రహిత ఆరోగ్య కార్డులు...ఇలా వివిధ సౌకర్యాలు కల్పించేందుకు గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం సమాయత్తమైన దశలో ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడటంతో అర్ధంతరంగా ఆ ప్రక్రియ నిలిచిపోయింది.

కేంద్రం నుంచి నిధులు విడుదలైనా..

అక్కడి నుంచి టెక్నికల్‌ అసిస్టెంట్‌ల కష్టాలు మళ్లీ మొదటికి వచ్చాయి. తొమ్మిదో పీఆర్సీ వరకు సక్రమంగానే అందుకున్నారు. 10వ పీఆర్సీ అమలు చేయాల్సి వచ్చేసరికి కూటమి సర్కార్‌ చేతులెత్తేసి తమను నిలువునా దగా చేసిందని టీఏలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గడచిన రెండు నెలలుగా వేతనాలు కూడా ఇవ్వకపోవడంతో టెక్నికల్‌ అసిస్టెంట్‌లు పూట గడవడమే కష్టంగా మారిందని ఆవేదన చెందుతున్నారు. వచ్చే జీతం సరిపోక నానా పాట్లు పడుతుంటే ఆ జీతం కూడా ఇవ్వకుండా ప్రభుత్వం ముప్పు తిప్పలు పెడుతోందని మండిపడుతున్నారు. నెల జీతమే ఆధారంగా కుటుంబాలు పోషించుకుంటుంటే ప్రభుత్వం మానవత్వం లేకుండా తమ జీవితాలతో ఆటలాడుకుంటోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటి పూట గడవడమే కనాకష్టమైపోతోన్న తరుణంలో రెండు నెలలుగా వేతనాలు వేయకుండా చంద్రబాబు సర్కార్‌ మానసికంగా వేధిస్తోందంటున్నారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకం కోసం విడుదల చేసిన నిధుల్లో వేతనాల కోసం మెటీరియల్‌ కాంపొనెంట్‌ నుంచి 6 శాతం కేటాయిస్తోందంటున్నారు. ఆ మేరకు కేంద్రం నుంచి నిధులు విడుదలైనా రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు విడుదల చేయకుండా తమను గాలికొదిలేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి హామీ పథకంలో పనిచేసే ప్రాంతం కొలతల దగ్గర నుంచి కూలీలకు వేతనాలు వేసే వరకు అన్ని విభాగాల్లోను క్రియాశీలక పాత్ర పోషించే తమను ఇలా వేతనాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేయడం తగునా అని టీఏలు ప్రశ్నిస్తున్నారు.

జీతాల్లేకుండా కుటుంబ పోషణ ఎలా?

మార్కెట్‌లో నిత్యవసరాల ధరలు ఆకాశాన్ని అంటి వేతనాలు లేక నానా అగచాట్లు పడుతున్నాం. రెండు నెలలు జీతాలు లేకుండా కుటుంబ పోషణ ఏ రకంగా జరుగుతుంది. వేతనాలతోపాటు ఉద్యోగ విరమణ వయోపరిమితిని 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచాలి. నగదు రహిత ఆరోగ్య కార్డులను విడుదల చేసి టెక్నికల్‌ అసిస్టెంట్ల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.

– డేగల సుధీర్‌, ప్రెసిడెంట్‌ ఎంజీఎన్‌ఆర్‌

ఈజీఎస్‌ టెక్నికల్‌ అసిస్టెంట్స్‌ అసోసియేషన్‌

10వ పీఆర్‌సీ వర్తింపజేయాలి

వేతనాలు అందక మా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అన్ని అర్హతలు ఉండడంతో ఉద్యోగం ఇచ్చారు. అప్పటి నుంచి కనీస వేతనం పెంచకుండా అన్యాయం చేస్తున్నారు. తక్షణం వేతనాలు విడుదల చేసి 10వ పీఆర్‌సీ మాకు వర్తింపచేసేలా ప్రభుత్వం స్పందించాలి. మా సమస్యలు పరిష్కరించకపోతే దశలవారీ ఉద్యమానికి సిద్ధం కావాల్సి వస్తుంది.

– ఎం.ప్రసాద్‌, వైస్‌ ప్రెసిడెంట్‌,

ఎంజీఎన్‌ఆర్‌ ఈజీఎస్‌ టెక్నికల్‌ అసిస్టెంట్స్‌ అసోసియేషన్‌

ఉపాధికి దొరకని హామీ!1
1/3

ఉపాధికి దొరకని హామీ!

ఉపాధికి దొరకని హామీ!2
2/3

ఉపాధికి దొరకని హామీ!

ఉపాధికి దొరకని హామీ!3
3/3

ఉపాధికి దొరకని హామీ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement