భావితరాలకు స్ఫూర్తి వందేమాతరం
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): వందేమాతం స్ఫూర్తిని భావి తరాలకు అందించడం మన బాధ్యత అని కలెక్టర్ కీర్తి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో వందేమాతరం 150 ఏళ్ల సంస్మరణోత్సవాన్ని పురస్కరించుకుని గీతాలాపన చేశారు. విద్యార్థులతో ముఖాముఖి సమావేశంలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్, స్వాతంత్య్ర పోరాటానికి ప్రేరణ ఇచ్చిన వందేమాతరం గీతం ప్రాముఖ్యతను పంచుకున్నారు. నాటి పరిస్థితులు భిన్నంగా ఉండేవని వందేమాతం గీతం ఆలపిస్తే జైలు శిక్ష వేసేవారన్నారు. ఈ స్ఫూర్తి దేశ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని పిలుపు ఇచ్చారు. వందేమాతరం కేవలం గీతం కాదని, భారతీయుల గౌరవం, అభిమానం, ఏకత్వానికి ప్రతీక అన్నారు. ప్రతి ఒక్కరు ఈ పవిత్ర గీతాన్ని ఆలపిస్తూ స్వాతంత్య్ర వీరుల త్యాగాలను స్మరించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో టి.సీతారామ మూర్తి, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కేఎన్ జ్యోతి, జిల్లా బీసీ సంక్షేమ అధికారి బి.శశాంక్ పాల్గొన్నారు.
ముంపు నివారణకు సమగ్ర పణాళిక
జిల్లాలో ఇటీవలి వరదలు, అధిక వర్షాలకు పలు గ్రామాలు ప్రభావిత మయ్యాయని, భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా సమగ్ర నివారణ చర్యలను అమలు చేయాల్సిన అవసరం ఉందని కలెక్టర్ కీర్తి స్పష్టం చేశారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఇరిగేషన్ అధికారులతో జేసీ వై.మేఘా స్వరూప్‌తో కలిసి నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఇటీవల మోంథా తుపాను వల్ల పలు గ్రామాల్లో పంటలు ముంపునకు గురై రైతులు నష్టపోయారని తెలిపారు. ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చెరువుల గట్లు పటిష్టంగా ఉండేలా నిరంతర పర్యవేక్షణ, గండ్లు పడే అవకాశం ఉన్న ప్రాంతాల గుర్తింపు, తక్షణ మరమ్మతులు చేపట్టాలన్నారు. జిల్లా వ్యాప్తంగా నీటి వనరుల స్థితిగతులపై సమగ్ర నివేదిక ఇవ్వాలన్నారు. ఆటోమేటిక్ వాటర్ లెవల్ రీడింగ్ పరికరాలు వివరాలు సమర్పించాలన్నారు. వచ్చే వారంలో తహసీల్దార్లు, ఎంపీడీఓలు ద్వారా మండల స్థాయిలో నోటిఫికేషన్ జారీ చేసి విలేజ్ డిజాస్టర్ వలంటీర్ ప్రతినిధులను గుర్తించి నియమించాలన్నారు. చెరువుల గట్లు నిరంతరం తనిఖీ చేయడం, నివేదికలు సమర్పించడం, నీటి వినియోగదారుల సంఘాలు, డిజాస్టర్ వలంటీర్లకు శిక్షణ తరగతులు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్ శేషుబాబు, ఎస్‌ఈ కె.గిరిధర్ తదితరులు పాల్గొన్నారు.


