కాకినాడ రూరల్: కాకినాడలోని పోర్టులకు మెరుగైన రవాణా సదుపాయానికి ఆజాదీ కా అమృత్ మాసోత్సవ్‌లో భాగంగా గతిశక్తి పథకం కింద కేంద్ర ప్రభుత్వం చొరవతో నాడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా రాష్ట్ర ప్రభుత్వం రహదారి విస్తరణ పనులను చేపట్టింది. ఏడీబీ రోడ్లు రాక్ సిరామిక్ నుంచి యాంకరేజ్ పోర్టు వరకు రూ.557 కోట్లతో రెండు ప్యాకేజీల్లో ఈ పనులను 2023లో ప్రారంభించింది. రాక్ సిరామిక్ నుంచి అచ్చంపేట జంక్షన్ వద్ద గోకుల్ గార్డెన్ వరకు 12.2 కిలోమీటర్ల మేర రూ.408 కోట్లతో ఒక ప్యాకేజీ, గోకుల్ గార్డెన్ నుంచి లైట్ హౌస్ మీదుగా యాంకరేజ్‌పోర్టు వరకు రూ.149 కోట్లతో మరో ప్యాకేజీగా పనులు ప్రారంభించారు. మొదటి ప్యాకేజీలో ఏడీబీ రోడ్డులో రాక్ సిరామిక్ నుంచి సామర్లకోటకు బైపాస్ మార్గంగా కెనాల్ రోడ్డు మీదుగా భీమేశ్వరస్వామి ఆలయం వెనక నుంచి ముత్యాలమ్మ గుడి పక్క నుంచి నాలుగు లైన్ల రోడ్లు నిర్మాణం పనులు చాలా వరకు పూర్తయ్యాయి. ఇందులో రాక్ సిరామిక్ నుంచి ద్వారపూడి కెనాల్ రోడ్డు వరకు 3.6 కిలో మీటర్లు (రెండు లైన్లు), ముత్యాలమ్మ గుడి నుంచి రైల్వే ట్రాక్ మీదుగా కిలో మీటరు మేర ప్లైఓవర్ నిర్మాణం చేపట్టారు. అలాగే అచ్చంపేట జంక్షన్ వద్ద కాకినాడ – పిఠాపురం ప్రధాన రహదారికి అండర్ పాస్ వంతెన నిర్మాణ పనులు చేపడుతున్నారు.
మరో ప్యాకేజీగా రాపాక గార్డెన్ వరకు యాంకరేజ్ పోర్టు వరకు గత ప్రభుత్వంలోనే పనులు వేగంగా సాగాయి. తరువాత ఏమైందో ఏమో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మొత్తానికి పనులు నిలిచిపోయాయి. నాలుగు లైన్ల రహదారి విస్తరణ పనులు మధ్యలో నిలిచిపోవడంతో పాముగుంట, ఓఎన్‌సీ కార్యాలయం, సూర్యారావుపేట వద్ద దుమ్ము దూళితో స్థానికులు, ప్రయాణికులు నరకం చూస్తున్నారు. అదానీ ఆయిల్ రిఫైనరీ, కోరమాండల్ జంక్షన్ వద్ద పోర్టు రోడ్డులో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. సీ పోర్టు వద్ద రహదారి పూర్తిగా ధ్వంసమవ్వడంతో ఈ మార్గంలో రాకపోకలు సాగించేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల మోంథా తుఫాన్ ప్రభావంతో వర్షాలకు రోడ్డుపై నీరు నిలిచిపోయి పెద్ద గతుకుల్లో ద్విచక్ర వాహనచోదకులు రాకపోకలు సాగించేందుకు నరకం చూశారు. కుంభాభిషేకం వద్ద సముద్రం నుంచి బ్యాక్ వాటర్ వచ్చే కాల్వపై వంతెన ద్వారా ఈ మార్గం ఉండడంతో ఆ వంతెన స్థానే కొత్తగా నాలుగు లైన్ల రోడ్డుకు అనుగుణంగా వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు చేశారు. రోడ్డు విస్తరణ పనులు మధ్యలో నిలిచిపోవడంతో ఆ ప్రభావం వంతెనపై పడింది. ఇటీవల మోంధా తుఫాన్‌కు బోటును రక్షించుకునే ప్రయత్నంలో దుమ్ములపేటకు చెందిన గద్దేపల్లి సాయిరామ్ అనే మత్స్యకార యువకుడు మృతి చెందడంతో ఆగ్రహించిన మత్స్యకారులు కొత్త వంతెన నిర్మాణం జరిగి ఉంటే బోట్లు కాల్వలోకి వెళ్లేవి కావని అప్పుడు ప్రమాదం జరిగేది కాదని ఇటీవల కుంభాభిషేకం వద్ద ధర్నా చేసిన సంగతి తెలిసిందే. తక్షణమే రహదారి విస్తరణ పనులతో పాటు వంతెన నిర్మాణం పనులు చేపట్టాలని జిల్లా వాసులు కోరుకుంటున్నారు.
రూ.149 కోట్ల ప్యాకేజీ
పనులకు చర్యలు
ఏడీబీ రోడ్డు విస్తరణలో భాగంగా రాక్ సిరామిక్ పరిశ్రమ నుంచి యాంకరేజ్ పోర్టు వరకు నాలుగు లైన్ల రహదారి విస్తరణ పనులు కాంట్రాక్టర్ భాగస్వాముల మధ్య సమన్వయ లోపంతో జాప్యమయ్యాయి. ఇటీవల చర్చలు జరిపాం. పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్నాం.
– బి.కృష్ణమూర్తి, పీడీ, నేషనల్ హైవేస్, రాజమండ్రి
నాడు జగన్ హయాంలో పనులకు బీజం
కూటమి ప్రభుత్వంలో మంద గమనం
రాక్ సిరామిక్ నుంచి యాంకరేజ్ పోర్టు
వరకు రెండు ప్యాకేజీల్లో పనులు
అవస్థలు పడుతున్న ప్రయాణికులు
సా..గుతున్న రహదారి విస్తరణ
సా..గుతున్న రహదారి విస్తరణ


